The International Space Station (ISS)
అంతరిక్షంలో ఏముంది? మనిషిని పోలిన జీవులు ఈ విశ్వంలో ఉన్నాయా? ఎన్నో ఏళ్ల నుంచి పరిశోధకులను ఈ ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే దిశగా మానవ మేథస్సు పనిచేస్తూనే ఉంది. ఈ ఆలోచనల నుంచి పుట్టిందే అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం. ఓ 50 ఏళ్ల క్రితం ఊహకు కూడా అందని విషయాన్ని శాస్త్రవేత్తలు నిజం చేసి చూపించారు.
అసలేంటీ అంతరిక్ష కేంద్రం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) అనేది భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తోన్న ఒక అద్భుతమైన ప్రయోగశాల. భూమి చుట్టూ అత్యంత వేగంగా తిరిగే ఈ కేంద్రం భూమి చుట్టూ ఒక రౌండ్ కంప్లిట్ చేయడానికి 90 నిమిషాలు పడుతుంది. ఈ కేంద్రంలో వ్యోమగాములు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. ప్రపంచంలోని చాలా దేశాలకు చెందిన పరిశోధకులు ఇక్కడికి వెళ్తుంటారు.
ISSను ఎప్పుడు ప్రారంభించారు?
ఈ అంతరిక్ష కేంద్ర నిర్మాణం 1998లో ప్రారంభమైంది. అమెరికా (NASA), రష్యా (Roscosmos), యూరోప్ (ESA), జపాన్ (JAXA), కెనడా (CSA) దేశాల భాగస్వామ్యంతో ఇది రూపొందింది. 2000 నుండి అంతరిక్ష కేంద్రంలో శాస్త్రవేత్తలు నిరంతరంగా నివసిస్తున్నారు.
ISS Station
ISSను ఎందుకు ఏర్పాటు చేశారు?
శాస్త్రీయ పరిశోధనలు చేయడం, భూమికి దూరంగా, భూమాకర్షణ లేని ప్రదేశాల్లో రసాయన, జీవ శాస్త్ర, భౌతిక శాస్త్ర పరిశోధనలు చేయడం ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం. అలాగే మనిషి గురుత్వాకర్షణ లేకపోతే ఎలాంటి ప్రభావం పడుతుంది, వీటికి ఎలాంటి ఔషధాలను తయారు చేయాలన్న పరిశోధనలు జరుగుతాయి. మనిషి భూమిపైనే కాకుండా మార్స్, మూన్ వంటి గ్రహాలపై జీవించవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనిషి అంతరిక్షంలో జీవించడానికి ఎలాంటి పరిస్థితులు కావాలి.? ఎలాంటి ఆవిష్కరణలు కావాలన్న వాటిపై పరిశోధన కేంద్రంలో పరిశోధనలు చేస్తున్నారు. ఐఎస్‌ఎస్ వీటికి ఒక ప్రాక్టీస్ ప్రదేశంగా భావిస్తున్నారు.
ISS
అంతరిక్ష కేంద్రం ఉపయోగాలు ఏంటి?
గురుత్వాకర్షణ లేని ప్రదేశంలో ప్రయోగాలు ఎలా చేయవచ్చో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులపై ముందస్తు హెచ్చరికలు ఇవ్వడంలో ఉపయోగపడుతుంది. కొత్త తరాలకు సైన్స్ మీద ఆసక్తి పెరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ చేపట్టడానికి ప్రతీ ఏటా రూ. వేల కోట్ల ఖర్చువుతుంది.
అంతరిక్ష కేంద్రం మనకెలా ఉపయోగపడుతుంది?
GPS, క్లౌడ్ స్టడీస్, కాంప్లెక్స్ ఫార్ములేషన్ల ఔషధాలు మొదలైనవి అంతరిక్ష పరిశోధనలతో సాధ్యమవుతున్నాయి. అంతరిక్ష కేంద్రం నుంచి భూమిని పరిశీలించిన సమయంలో తుఫానులు ఎప్పుడు వస్తాయి? వర్షాలు ఎక్కడ ఎక్కువగా పడతాయ్? భూకంపం ముప్పు ఉందా? లాంటి విషయాలను ముందుగానే తెలుసుకోవచ్చు. వీటి ఆధారంగా ప్రజలను ముందుగానే అలర్ట్ చేయవచ్చు. భవిష్యత్తులో జీపిఎస్ వ్యవస్థ మరింత మెరుగవుతుంది. ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది. దూర ప్రాంతాలకు కమ్యూనికేషన్ సులభంగా అందుతుంది.
ISS
ISS ఎలా మొదలైంది? ఎలా రూపాంతరం చెందింది?
అంతరిక్ష అన్వేషణలో భాగంగా, అంతరిక్షంలో నివసించాలనే లక్ష్యంతో 1998లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే 1971లో తొలి అంతరిక్ష కేంద్రంగా సల్యూట్1ని ప్రయోగించారు. తర్వాత మిర్ స్పేస్ స్టేషన్ ద్వారా దీన్ని మరింత అభివృద్ధి చేశారు. అదే సమయంలో అమెరికా కూడా "స్కైలాబ్" అనే అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించింది. ఐఎస్‌ఎస్ నిర్మాణం 1998 నవంబర్ 20న మొదలైంది. మొదటి భాగాన్ని రష్యా పంపింది, దీన్ని "జర్యా" (Zarya) మాడ్యూల్ అంటారు. ఇది విద్యుత్, ఇంధనం, ప్రాథమిక కమ్యూనికేషన్ వ్యవస్థలు కలిగిన ప్రాథమిక మాడ్యూల్.
1998 డిసెంబర్ NASA యూనిటీ మాడ్యూల్‌ను పంపింది. ఇది భవిష్యత్తులో అనుసంధానించాల్సిన మాడ్యూళ్లకు ప్రాథమిక కనెక్టింగ్ హబ్‌గా పనిచేసింది. 2000లో రష్యా "జ్వెజ్డా" మాడ్యూల్‌ను పంపింది, ఇది అంతరిక్షంలో నివసించడానికి అవసరమైన ప్రాథమిక వసతులను కలిగి ఉంది. 2000 నవంబర్‌లో మొదటి వ్యోమగాముల బృందం ISSలో ప్రవేశించింది. 2001 నుంచి 2011 మధ్య ISSకు అనేక ప్రయోగశాలలు, సౌకర్యాలు చేర్చారు. డెస్టిని ల్యాబొరేటరీ పేరుతో 2001లో నాసా ఐఎస్‌ఎస్‌లో మొదటి శాస్త్రీయ ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. 2008లో యూరోపియన్ అంతరిక్ష సంస్థ కోలంబర్ ల్యాబొరేటరీ అనే మాడ్యూల్‌ను అభివృద్ధి చేసింది. అనంతరం 2008లో జపాన్ కిబో ల్యాబొరేటరీ పేరుతో పరిశోధన కేంద్రాన్ని పంపించింది. 2009 - 2011లో కొత్త సోలార్ ప్యానెల్స్, హ్యాబిటేషన్ మాడ్యూళ్లు, డాకింగ్ పోర్ట్స్ ఏర్పాటయ్యాయి.
iss
ISSలో పెరిగిన ప్రైవేట్ భాగస్వామ్యం
2012 నుంచి ప్రైవేట్ స్పేస్ కంపెనీలు ISSకు సరఫరా మిషన్లను చేపట్టాయి. SpaceX, Boeing లాంటి సంస్థలు ISSకి సరఫరా రవాణా, వ్యోమగాముల రాకపోకల సేవలు అందించాయి. 2017లో NASA "Deep Space Gateway" ప్రాజెక్ట్ ప్రకటించింది, దీని ద్వారా చంద్రునిపై మానవ మిషన్‌కు ISS వేదికగా పనిచేయగలదు. 2020లో SpaceX Crew Dragon మిషన్ విజయవంతమైంది, ఇది ISSలో వ్యోమగాములను చేర్చిన మొదటి ప్రైవేట్ మిషన్.
iss
అంతరిక్ష కేంద్రం భౌతిక నిర్మాణం ఎలా ఉంటుంది?
అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం సుమారు 420 టన్నుల బరువుతో, 109 మీటర్ల పొడవుతో, 73 మీటర్ల వెడల్పుతో, 400 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. ఇది భూమిని 90 నిమిషాల్లో ఒకసారి చుట్టేస్తుంది. ఇది గంటకు సుమారు 28 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంతరిక్ష కేంద్రంలో ఒకేసారి 6 మంది వ్యోమగాములు నివసించగలరు. వారు అక్కడ శాస్త్రీయ పరిశోధనలు, శరీరంపై భూమి గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల వచ్చే ప్రభావాలపై అధ్యయనం, స్పేస్ వాక్ వంటివి చేస్తుంటారు.