Whats App
దాదాపు ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్ వాట్సాప్. ఇప్పుడు సైబర్ నేరస్థులు తమ నేరాలకు అడ్డాగా వాట్సాప్‌ను మార్చేశారు. ఈ కొత్త రకం మోసంలో సైబర్ నేరస్థులు మొదట మీకు తెలియని నెంబర్ నుంచి ఒక ఫొటోను పంపిస్తారు. నిజానికి అది ఫొటో రూపంలో ఉన్న ఒక మాల్వేర్. ఆ ఫొటోలో ఏముందో అని క్లిక్ చేశారో అంతే సంగతులు.
ఇమేజ్‌పై క్లిక్ చేసి వెంటనే మీ బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, యూపీఐ సమాచారం మొత్తం నేరస్థుల చేతుల్లోకి వెళ్లిపోతాయి. మీ ఫోన్‌ను కంట్రోల్ చేసే మాల్వేర్ సదరు ఇమేజ్ ద్వారా మీ ఫోన్‌లోకి ప్రవేశిస్తుందన్నమాట. దీనిని ఇమేజ్ స్టెగానోగ్రఫీగా చెబుతుంటారు. మీ వ్యక్తిగత సమాచారాన్ని దోచుకునేందుకు వీలుగా రూపొందించిన డేటాను ఇమేజ్ లోపల నిక్షిప్తం చేస్తారు. పొరపాటున ఆ ఇమేజ్ క్లిక్ చేశారో మీ యాప్స్, ప్రైవేట్ డేటాను అవతలి వ్యక్తి యాక్సెస్ చేసుకోవచ్చు.
సాయం చేయండి అంటూ రూ. 2 లక్షలు కొట్టేశారు
ఇటీవల మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ వ్యక్తి ఇమేజ్ స్టెగానోగ్రఫీ మోసం బారిన పడి రూ. 2 లక్షలు కోల్పోయాడు. వాట్సాప్‌లో ఇమేజ్ పంపించి అందులో ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు సహాయం చేయండి అంటూ మెసేజ్ పెట్టారు. మొదట్లో చూసి చూడనట్లు వదిలేశాడు. అయితే పదే పదే కాల్స్, మెసేజ్ చేయడంతో ఫొటోపై క్లిక్ చేశాడు. దీంతో స్కామర్లు బాధితుడి అకౌంట్‌లో ఉన్న రూ. 2 లక్షలను కాజేశారు.
ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
ఎట్టి పరిస్థితుల్లో మీకు తెలియని నెంబర్ లేదా మీ ఫోన్‌లో సేవ్ లేని నెంబర్ నుంచి వచ్చే మెసేజ్‌లను క్లిక్ చేయకండి. అంతేకాదు వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీడియా ఆప్షన్‌లో ఆటో డౌన్‌లోడ్ ఆఫ్ చేసుకోండి. దీంతో ఆటోమెటిక్‌గా ఫొటోలు డౌన్‌లోడ్ అవ్వవు. ఒకవేళ ఏదైనా నెంబర్ నుంచి ఫొటో వస్తే ముందుగా ఆ నెంబర్‌కి కాల్ చేసి చూడండి. అనుమానాస్పదంగా ఉన్న నెంబర్లను బ్లాక్ చేసి రిపోర్ట్ నొక్కండి. ఒకవేళ మోసపోయారని అనుమానిస్తే వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్‌క్రైమ్.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి.