
హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ ముగిసినా, అక్కడ వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. 15 సిక్సర్లు, కళ్లు చెదిరే స్ట్రైక్ రేట్‌తో అతను ఆడిన ఇన్నింగ్స్ రికార్డు పుస్తకాలను తిరగరాసింది.
కేవలం 14 ఏళ్ల వయసులోనే బీహార్‌కు చెందిన ఈ కుర్రాడు ఇంతటి ఘనత సాధించడంతో, అతన్ని వెంటనే సీనియర్ భారత జట్టులోకి తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, అతను ఎంతటి అద్భుతమైన ఆటగాడైనా, ప్రస్తుతం టీమ్ ఇండియాలో చోటు సంపాదించడం అసాధ్యం. దానికి ప్రధాన కారణం ఐసీసీ (ICC) విధించిన ఒక కఠినమైన నిబంధన.
వైభవ్ సూర్యవంశీ సీనియర్ జట్టులోకి రాకుండా అడ్డుపడుతున్న మొదటి అడ్డంకి ఐసీసీ ప్రవేశపెట్టిన మినిమమ్ ఏజ్ పాలసీ. 2020లో ఐసీసీ ఈ నిబంధనను తీసుకువచ్చింది. యువ క్రీడాకారుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం దీని ప్రధాన ఉద్దేశం. ఈ రూల్ ప్రకారం, ఒక ఆటగాడు అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశానికైనా ప్రాతినిధ్యం వహించాలంటే కనీసం 15 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. వైభవ్ సూర్యవంశీ మార్చి 27, 2011న జన్మించాడు. 2026 ఫిబ్రవరిలో జరిగిన ప్రపంచకప్ నాటికి అతని వయస్సు ఇంకా 14 ఏళ్లే. కాబట్టి అతను సాంకేతికంగా అంతర్జాతీయ సీనియర్ క్రికెట్‌కు ఇంకా అర్హుడు కాలేదు.
వైభవ్ సీనియర్ టీమ్‌కు ఇంకా చిన్నవాడు కాగా, మరోవైపు అతని అండర్-19 కెరీర్ కూడా ముగిసిపోవడం గమనార్హం. దీనికి కారణం బీసీసీఐ అమలు చేస్తున్న వన్ టోర్నమెంట్ పాలసీ. అండర్-19 ప్రపంచకప్‌లో ఒక ఆటగాడు ఒకసారి ఆడితే, వయస్సు ఉన్నా కూడా రెండోసారి ఆడే అవకాశం ఉండదు. యువ ఆటగాళ్లందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి, ఏజ్ గ్రూప్ స్పెషలిస్ట్‌లు తయారు కాకుండా చూడటానికి రాహుల్ ద్రవిడ్ హయాంలో ఈ నియమాన్ని తెచ్చారు. 2026 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన వైభవ్, ఇకపై 2028 లేదా 2030 వరల్డ్ కప్‌లలో ఆడే అవకాశం లేదు.
గత 12 నెలల్లో వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచంలో ఎన్నో అద్భుత రికార్డులను నెలకొల్పాడు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి గమనిస్తే..
వైభవ్ కేవలం జూనియర్ లెవల్‌లోనే కాదు, సీనియర్ డొమెస్టిక్ క్రికెట్‌లోనూ తన సత్తా చాటాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 108 పరుగులతో నాటౌట్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఇండియా-ఏ తరపున యూఏఈపై 32 బంతుల్లోనే టీ20 సెంచరీ బాదాడు. అలాగే యూత్ టెస్టులో కూడా 58 బంతుల్లో సెంచరీ చేసి భారత రికార్డును సొంతం చేసుకున్నాడు. యూత్ వన్డేల్లో 100 సిక్సర్లు కొట్టిన మొదటి బ్యాటర్‌గా కూడా గుర్తింపు పొందాడు. ఈ గణాంకాలు చూస్తుంటే అతను సీనియర్ క్రికెట్‌కు ఎప్పుడో సిద్ధమయ్యాడని అర్థమవుతోంది.
వైభవ్ సూర్యవంశీకి ప్రస్తుతం ఎదురుచూడక తప్పదు. బీసీసీఐ గానీ, సెలెక్టర్లు గానీ అతన్ని టీమ్ ఇండియాలోకి తీసుకోవాలన్నా మార్చి 27, 2026 వరకు ఆగాల్సిందే. ఆ రోజున అతను 15వ ఏట అడుగుపెడతాడు. ఆ తర్వాతే ఐసీసీ నిబంధనల ప్రకారం అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి అనుమతి లభిస్తుంది. 2026 ద్వితీయార్థంలో టీమ్ ఇండియాకు బిజీ షెడ్యూల్ ఉంది. కాబట్టి 15 ఏళ్లు నిండిన వెంటనే యంగ్ స్టార్ బ్లూ జెర్సీలో కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.