T20 World Cup 2026లో ఒకే ఓవర్‌లో 4 వికెట్లు.. తొలి హ్యాట్రిక్‌ ఇదే

Published : Feb 08, 2026, 05:02 PM IST

Romario Shepherd Hat Trick : టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో రోమారియో షెపర్డ్ హ్యాట్రిక్‌తో సంచలనం రేపాడు. ఈ ప్రదర్శనతో స్కాట్లాండ్‌పై వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

PREV
15
వెస్టిండీస్ సంచలనం: హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన రోమారియో షెపర్డ్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో శనివారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ సీ మ్యాచ్‌లో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆల్ రౌండర్ రోమారియో షెపర్డ్ హ్యాట్రిక్ తో అదరగొట్టాడు. స్కాట్లాండ్‌ను వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో చిత్తు చేసింది. పదేళ్ల క్రితం ఇదే గ్రౌండ్ లో రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడిన కరేబియన్ జట్టు, ఇప్పుడు అదే ఉత్సాహంతో టోర్నీని విజయంతో ప్రారంభించింది.

25
హెట్మెయర్ మెరుపు హాఫ్ సెంచరీ

టాస్ గెలిచిన స్కాట్లాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ ఆరంభంలో తడబడింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (35) ఇబ్బంది పడగా, కెప్టెన్ షాయ్ హోప్ (19) తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. 10 ఓవర్లు ముగిసేసరికి విండీస్ 66/2తో నెమ్మదిగా సాగింది. అయితే, షిమ్రాన్ హెట్మెయర్ గేర్ మార్చి స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

కేవలం 36 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్లతో 64 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రోవ్మన్ పావెల్ (24) తో కలిసి హెట్మెయర్ 37 బంతుల్లోనే 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

35
రోమారియో షెపర్డ్ చరిత్రాత్మక హ్యాట్రిక్

183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ ఒక దశలో గట్టి పోటీని ఇచ్చింది. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (42), టామ్ బ్రూస్ (35) కలిసి నాలుగో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. అయితే 17వ ఓవర్‌లో రోమారియో షెపర్డ్ బౌలింగ్‌కు వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 

ఆ ఓవర్ రెండో బంతికి మాథ్యూ క్రాస్‌ను, మూడో బంతికి మైఖేల్ లీస్క్‌ను, నాలుగో బంతికి ఆలివర్ డేవిడ్సన్‌ను అవుట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. అదే ఓవర్ చివరి బంతికి సఫ్యాన్ షరీఫ్‌ను కూడా అవుట్ చేసి, ఒకే ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. షెపర్డ్ తన 3 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.

45
రికార్డుల వేటలో షెపర్డ్, హోల్డర్

ఈ ప్రదర్శనతో రోమారియో షెపర్డ్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన తొలి వెస్టిండీస్ బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో రెండు హ్యాట్రిక్ లు సాధించిన లసిత్ మలింగ, పాట్ కమిన్స్, టిమ్ సౌథీల సరసన చేరాడు. మరోవైపు, వెటరన్ బౌలర్ జేసన్ హోల్డర్ (3/35) స్కాట్లాండ్ కెప్టెన్ వికెట్ తీయడం ద్వారా టీ20 ఐలలో 100 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి వెస్టిండీస్ బౌలర్‌గా నిలిచాడు.

55
వరల్డ్ కప్ హ్యాట్రిక్ వీరుల జాబితా ఇదే

టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు హ్యాట్రిక్ తీసిన బౌలర్ల జాబితాలో రోమారియో షెపర్డ్ 10వ బౌలర్‌గా చేరాడు. గతంలో బ్రెట్ లీ (2007), కర్టిస్ కాంఫర్ (2021), వానిందు హసరంగ (2021), కాగిసో రబాడ (2021), కార్తీక్ మెయ్యప్పన్ (2022), జోష్ లిటిల్ (2022), పాట్ కమిన్స్ (2024 - రెండు సార్లు), క్రిస్ జోర్డాన్ (2024) ఈ ఘనత సాధించారు. 2026 ఎడిషన్‌లో తొలి రోజే ఈ ఫీట్ నమోదు కావడం విశేషం.

స్కాట్లాండ్ పోరాటం వృథా

స్కాట్లాండ్ జట్టు టోర్నీకి కేవలం రెండు వారాల ముందే అర్హత సాధించినప్పటికీ క్రమశిక్షణతో బౌలింగ్ చేసింది. బ్రాడ్ కర్రీ 2 వికెట్లు తీసి రాణించాడు. బ్యాటింగ్‌లో బెరింగ్టన్, బ్రూస్ రాణించినప్పటికీ, షెపర్డ్ ధాటికి ఆ జట్టు 18.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. సరైన ప్రాక్టీస్ లేకపోవడం, మంచు కురుస్తున్న వాతావరణంలో ఇండోర్ శిక్షణ తీసుకోవడం వారిపై ప్రభావం చూపింది.

Read more Photos on
click me!

Recommended Stories