Aman Sehrawat, Indian Wrestler
Aman Sehrawat : భారత యంగ్ స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ ప్యారిస్ ఒలింపిక్స్ లో అద్భుతమైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్నాడు. గురువారం జరిగిన పురుషుల 57 కేజీల క్వార్టర్‌ఫైనల్‌లో అమన్ సెహ్రావత్ 12-0 తేడాతో అల్బేనియాకు చెందిన జెలిమ్‌ఖాన్ అబాకనోవ్‌పై టెక్నికల్ సుపీరియారిటీతో విజయం సాధించాడు. ఈ విజయంతో మెడల్ రౌండ్ సెమీ ఫైనల్ లోకి చేరాడు. తన తర్వాతి మ్యాచ్ లో జపాన్‌కు చెందిన రీ హిగుచితో తలపడనున్నాడు. మొదటి-సీడ్ జపనీస్‌పై విజయం సాధిస్తే అమన్ కు కనీసం రజతం ఖాయమవుతుంది. ఒకవేళ ఓడిపోతే బ్రాంజ్ మెడల్ కోసం పోటీ పడతాడు.
Aman Sehrawat, Indian Wrestler
ఎవరీ అమన్ సెహ్రావత్?
అమన్ సెహ్రావత్ హర్యానాలోని ఝజ్జర్‌కు చెందిన ప్రతిభావంతులైన భారతీయ రెజ్లర్. 21 సంవత్సరాల వయస్సులోనే అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. రెజ్లింగ్ ప్రపంచంలో అనేక విజయాలు అందుకున్నారు. అతను రెజ్లింగ్ 57 కిలోల బరువు విభాగంలో పోటీ పడుతున్నాడు. అతని రెజ్లింగ్ కెరీర్ విజయాలు గమనిస్తే.. 2022 ఆసియా క్రీడలలో కాంస్య పతకం, 2023 కజకిస్తాన్‌లోని అస్తానాలో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
Aman Sehrawat, Indian Wrestler
అమన్ సెహ్రావత్ హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని బీరోహార్ ప్రాంతానికి చెందిన రెజ్లర్. జాట్ కుటుంబానికి చెందిన అమన్.. చిన్నతనంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. 10 సంవత్సరాల వయస్సులో తన తల్లిని కోల్పోయాడు. ఒక సంవత్సరం తర్వాత తండ్రిని కూడా కోల్పోయాడు. అమన్, అతని చెల్లెలు పూజా సెహ్రావత్ లు వారి పెద్ద మేనమామ సుధీర్ సెహ్రావత్ సంరక్షణలో పెరిగారు. తీవ్ర నిరాశతో మొదలైన అతని జీవితం ముందుకు సాగుతున్న క్రమంలో రెజ్లింగ్‌పై తన అభిరుచిని చూపించాడు. కోచ్ లలిత్ కుమార్ వద్ద శిక్షణ పొందడం ప్రారంభించాడు. అమన్ 2021లో తన మొదటి జాతీయ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
Aman Sehrawat, Indian Wrestler
అక్కడి నుంచి అనేక పెద్ద టోర్నీలలో విజయాలు అందుకుంటూ యంగ్ స్టార్ రెజ్లర్ గా గుర్తింపు సాధించాడు. 2022 ఆసియా గేమ్స్‌లో 57 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. 2023 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించాడు. జనవరి 2024లో, అతను జాగ్రెబ్ ఓపెన్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే పారిస్ 2024 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఒకేఒక్క భారత పురుష రెజ్లర్ గా నిలిచాడు. ఇప్పుడు తనదైన దూకుడు ఆటతో పారిస్ ఒలింపిక్స్ 2024 లో సెమీస్ చేరుకున్నాడు.