
భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో తిరిగి అడుగుపెట్టారు. దీంతో దేశీయ వన్డే పోటీలు సరికొత్త కళను సంతరించుకున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) స్థాయిలో ఈ టోర్నమెంట్‌కు ఆదరణ గానీ, ఆర్థిక స్థాయి గానీ లేకపోయినప్పటికీ, భారతదేశ వైట్ బాల్ డొమెస్టిక్ స్ట్రక్చర్‌కు ఇది వెన్నెముకగా నిలుస్తుంది. దేశంలోని ఇద్దరు అతిపెద్ద స్టార్లు ఈ టోర్నీలో పాల్గొనడం వల్ల కేవలం మ్యాచ్‌ల పైనే కాకుండా, ఈ పోటీలు ఎలా నిర్వహిస్తారు? ఆటగాళ్లకు పారితోషికం ఎలా చెల్లిస్తారు? అనే విషయాలపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఐపీఎల్‌లో ఆటగాళ్ల జీతాలు వేలం ద్వారా నిర్ణయిస్తే.. విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం సంపాదనకు ఒక స్పష్టమైన విధానం ఉంది. 2025-26 సీజన్‌కు సంబంధించి, ఒక ఆటగాడు ఆడిన లిస్ట్ A మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా మ్యాచ్ ఫీజులను నిర్ణయించారు. ఇక్కడ స్టార్ ఇమేజ్ కంటే అనుభవానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందుకే కోహ్లీ, రోహిత్ వంటి వెటరన్ ఆటగాళ్లు అత్యధిక పారితోషికం పొందే బ్రాకెట్‌లో ఉన్నారు.
బీసీసీఐ నిబంధనల ప్రకారం, 40 కంటే ఎక్కువ లిస్ట్ A మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు సీనియర్ కేటగిరీ కిందకు వస్తారు. వీరు ప్లేయింగ్ 11 లో ఉంటే ఒక్కో మ్యాచ్‌కు రూ. 60,000, ఒకవేళ రిజర్వ్ బెంచ్‌కి పరిమితమైతే రూ. 30,000 పొందుతారు. ఇక 21 నుండి 40 మ్యాచ్‌ల అనుభవం ఉన్నవారిని మిడ్ లెవల్ ఆటగాళ్లుగా పరిగణిస్తారు. వీరికి తుది జట్టులో ఉంటే రూ. 50,000, రిజర్వ్‌లో ఉంటే రూ. 25,000 చెల్లిస్తారు. 20 మ్యాచ్‌ల వరకు ఆడిన జూనియర్ కేటగిరీ ఆటగాళ్లకు తుది జట్టులో ఆడితే రూ. 40,000, బెంచ్‌పై ఉంటే రూ. 20,000 లభిస్తుంది.
ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ, ముంబై తరఫున ఆడుతున్న రోహిత్ శర్మ ఇతర సీనియర్ డొమెస్టిక్ క్రికెటర్ల మాదిరిగానే మ్యాచ్ ఫీజు పొందుతున్నారు. వీరిద్దరూ 40 మ్యాచ్‌ల మార్కును ఎప్పుడో దాటేశారు కాబట్టి, సీనియర్ కేటగిరీ నిబంధనల ప్రకారం ఒక్కో మ్యాచ్‌కు రూ. 60,000 తీసుకుంటున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పోలిస్తే ఇది చాలా తక్కువ మొత్తం అని చెప్పాలి. ఎందుకంటే బీసీసీఐ ఒక్కో వన్డే మ్యాచ్‌కు వీరికి రూ. 6 లక్షలు చెల్లిస్తుంది.
అయితే, విజయ్ హజారే ట్రోఫీలో కేవలం మ్యాచ్ ఫీజు మాత్రమే కాకుండా ఇతర ఆదాయ మార్గాలు కూడా ఉన్నాయి. టోర్నమెంట్ సమయంలో ప్రయాణం, ఆహారం, వసతి కోసం ఆటగాళ్లకు రోజువారీ అలవెన్సులు ఇస్తారు. అంతేకాకుండా, వ్యక్తిగత ప్రదర్శనలకు అదనపు రివార్డులు కూడా ఉంటాయి. సాధారణంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద రూ. 10,000 నగదు బహుమతి ఉంటుంది. టోర్నీలో జట్టు ముందుకు వెళ్లేకొద్దీ వచ్చే ప్రైజ్ మనీని కూడా ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ పంచుకుంటారు.
దేశవాళీ క్రికెట్‌లోకి ఈ ఇద్దరు దిగ్గజాలు తిరిగి రావడం టోర్నమెంట్‌కు ఎంతో విలువను చేకూర్చింది. బుధవారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రోహిత్ శర్మ సెంచరీ చేసినప్పుడు 20,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. అయితే, బెంగళూరు శివార్లలోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) గ్రౌండ్స్‌లో విరాట్ కోహ్లీ ఆడిన మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించలేదు.
తర్వాతి మ్యాచ్ లో ముంబై జట్టు ఉత్తరాఖండ్‌తో, ఢిల్లీ జట్టు గుజరాత్‌తో తలపడనున్నాయి. రోహిత్ శర్మకు ఈ సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఇదే చివరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ కోహ్లీ మాత్రం గుజరాత్‌తో మ్యాచ్ తర్వాత మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ప్రెసిడెంట్ రోహన్ జైట్లీ మాట్లాడుతూ "కోహ్లీ కనీసం మూడు విజయ్ హజారే మ్యాచ్‌లు ఆడతారు" అని స్పష్టం చేశారు.
కోహ్లీ ఆడబోయే మూడవ మ్యాచ్ ఈ ఏడాది ఉండకపోవచ్చు. "కొత్త సంవత్సరం తర్వాత అతను ఒక మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే మూడు మ్యాచ్‌లు ఆడతారని సమాచారం" అని రోహన్ జైట్లీ తెలిపారు. ఢిల్లీ జట్టు జనవరి 3న సర్వీసెస్, జనవరి 6న రైల్వేస్, జనవరి 8న హర్యానాతో తలపడనుంది. క్వార్టర్ ఫైనల్స్ జనవరి 12, 13 తేదీల్లో జరగనున్నాయి. అయితే కోహ్లీ ఏ మ్యాచ్ ఆడతారనేది త్వరలో వెల్లడిస్తామని జైట్లీ పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కోహ్లీ ఆడే మ్యాచ్‌లు కూడా CoE గ్రౌండ్‌లోనే జరిగే అవకాశం ఉంది.
మరోవైపు, రోహిత్ శర్మ రెండు మ్యాచ్‌ల తర్వాత జట్టును వీడనుండగా, ముంబై జట్టులోకి మరికొందరు టీమిండియా ఆటగాళ్లు చేరనున్నారు. "రోహిత్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది" అని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) కార్యదర్శి డాక్టర్ ఉన్మేష్ ఖాన్విల్కర్ తెలిపారు. బీసీసీఐతో చర్చించిన తర్వాత, రోహిత్ వర్క్ లోడ్ దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
జనవరి 11న వడోదరలో న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం కోహ్లీ, రోహిత్ భారత జట్టులో చేరనున్నారు. ఈలోగా టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే ముంబై జట్టులో చేరనున్నారు. జైస్వాల్ ఈ ఏడాదే జట్టుతో కలవనుండగా, సూర్య, దూబే నాకౌట్‌లకు ముందు చివరి రెండు మ్యాచ్‌లకు (హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌పై) అందుబాటులో ఉండే అవకాశం ఉంది.