Virat Kohli : సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

Published : Jan 14, 2026, 07:53 PM IST

Virat Kohli breaks Sachin Tendulkar record : రాజ్‌కోట్ వన్డేలో విరాట్ కోహ్లీ సంచలనం సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న భారీ రికార్డును బద్దలు కొట్టి, న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా ఘనత సాధించాడు.

PREV
16
సచిన్ రికార్డ్ గల్లంతు.. విరాట్ కోహ్లీ ఊచకోత!

రాజ్‌కోట్ లో బుధవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌ లో  టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపిస్తూ, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును బద్దలు కొట్టాడు.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా, భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

26
సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ

క్రికెట్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రికార్డులలో ఒకదాన్ని విరాట్ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు, భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ కొనసాగుతున్నారు. సచిన్ టెండూల్కర్ కివీస్ జట్టుపై ఆడిన 42 వన్డే మ్యాచ్‌లలో 46.05 సగటుతో మొత్తం 1750 పరుగులు సాధించారు. అయితే, రాజ్‌కోట్ వన్డేలో విరాట్ కోహ్లీ ఈ రికార్డును అధిగమించాడు.

ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందు సచిన్ రికార్డును బ్రేక్ చేయడానికి కోహ్లీకి కేవలం ఒక పరుగు మాత్రమే అవసరమైంది. క్రీజులోకి వచ్చిన వెంటనే తను ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాదిన కోహ్లీ, సచిన్‌ను వెనక్కి నెట్టాడు. తాజా గణాంకాల ప్రకారం, విరాట్ కోహ్లీ ఇప్పుడు న్యూజిలాండ్‌పై కేవలం 35 మ్యాచ్‌లలోనే 55.40 సగటుతో 1773 పరుగులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. కాగా, ఈ జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ (1971 పరుగులు) ప్రపంచవ్యాప్తంగా టాప్ లో కొనసాగుతున్నాడు.

36
ముగిసిన కోహ్లీ వరుస హాఫ్ సెంచరీ జోరు

గత కొంతకాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, లిస్ట్-ఏ క్రికెట్‌లో వరుసగా 50కి పైగా పరుగులు చేస్తూ వస్తున్నాడు. అయితే రాజ్‌కోట్ వన్డేలో ఆ పరంపరకు బ్రేక్ పడింది. గత ఎనిమిది ఇన్నింగ్స్‌లలో నిలకడగా హాఫ్ సెంచరీలు లేదా సెంచరీలు బాదిన కోహ్లీ, ఈ మ్యాచ్‌లో మాత్రం 29 బంతుల్లో 23 పరుగులు (2 ఫోర్లు) చేసి అవుటయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్ క్రిస్టియన్ క్లార్క్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

కోహ్లీ ఇటీవల ఆస్ట్రేలియాపై అజేయంగా 74 పరుగులు, దక్షిణాఫ్రికాపై 135, 102, అజేయంగా 65 పరుగులు సాధించాడు. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రాపై 131, గుజరాత్‌పై 77 పరుగులు, కీవీస్‌తో జరిగిన మొదటి వన్డేలో 93 పరుగులు చేశాడు. ఇలా వరుసగా ఎనిమిది భారీ ఇన్నింగ్స్‌ల తర్వాత, తొలిసారిగా అతను 50 పరుగుల లోపు పెవిలియన్ చేరాడు.

46
స్వదేశంలో కివీస్‌పై కోహ్లీ ఆధిపత్యం

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే వన్డేల్లో విరాట్ కోహ్లీ రికార్డులు అసాధారణంగా ఉన్నాయి. గణాంకాల ప్రకారం, కోహ్లీ సొంతగడ్డపై కివీస్‌తో ఆడిన 20 వన్డేల్లో ఏకంగా 72.82 సగటుతో 1238 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 98.64గా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మరే ఇతర బ్యాటర్ కూడా ఒక దేశంలో న్యూజిలాండ్‌పై కనీసం 900 పరుగులు కూడా చేయలేదు. న్యూజిలాండ్‌పై కోహ్లీ సాధించిన ఆరు వన్డే సెంచరీలలో ఐదు సెంచరీలు భారత గడ్డపైనే నమోదయ్యాయి.

56
తిరిగి నంబర్ 1 స్థానానికి కింగ్ కోహ్లీ

ఈ రికార్డులే కాకుండా, ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కూడా విరాట్ కోహ్లీ తిరిగి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. జనవరి 14న ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లీ మళ్లీ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. జూలై 2021 తర్వాత కోహ్లీ అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. రోహిత్ శర్మ నుండి ఈ స్థానాన్ని కోహ్లీ దక్కించుకున్నాడు.

37 ఏళ్ల వయసులో కూడా కోహ్లీ చూపిస్తున్న ఫిట్‌నెస్, ఫామ్ అద్భుతం. ఇప్పటివరకు కోహ్లీ మొత్తం 825 రోజుల పాటు నంబర్ 1 స్థానంలో కొనసాగాడు. భారత బ్యాటర్లలో అత్యధిక రోజులు ఈ స్థానంలో ఉన్నది కోహ్లీనే కావడం విశేషం. ఇదే సమయంలో బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ 5 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నాడు.

66
అంతర్జాతీయ క్రికెట్‌లో మరో మైలురాయి

ఇటీవల జరిగిన మొదటి వన్డేలో కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను అతను కేవలం 624 ఇన్నింగ్స్‌లలోనే సాధించి, సచిన్ టెండూల్కర్ (644 ఇన్నింగ్స్‌లు) రికార్డును బద్దలు కొట్టాడు.

అంతేకాకుండా, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (28,016 పరుగులు)ను అధిగమించి, అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు (53) చేసిన ఘనత కోహ్లీ పేరిట ఉండగా, అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సచిన్ (18,426) తర్వాత కోహ్లీ (14,673) రెండో స్థానంలో ఉన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories