
టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరోసారి తన సత్తా చాటాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తన సహచర ఆటగాడు, భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టి కోహ్లీ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. మరోవైపు, ఈ సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైన రోహిత్ శర్మ మూడో స్థానానికి పడిపోయాడు. ఇదే సమయంలో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ రెండో స్థానానికి ఎగబాకాడు.
ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పవచ్చని, అదే అతని చివరి సిరీస్ కావచ్చని అనేక రిపోర్టులు వచ్చాయి. 37 ఏళ్ల వయసులో కోహ్లీ కెరీర్ ముగిసిపోయిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, ఆ విమర్శలన్నింటికీ తన బ్యాట్‌తోనే కోహ్లీ గట్టి సమాధానం ఇచ్చాడు.
తనలోని ఛేజ్ మాస్టర్ ను మరోసారి బయటకు తీసి, అద్భుతమైన క్రికెట్ ఆడాడు. ఈ ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ వరుసగా ఐదు సార్లు 50కి పైగా స్కోర్లు సాధించడం విశేషం.
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో కోహ్లీ 93 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను ర్యాంకింగ్స్ పట్టికలో రెండో స్థానం నుంచి ఏకంగా మొదటి స్థానానికి ఎగబాకాడు. తన కెరీర్‌లో విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం ఇది 11వ సారి కావడం గమనార్హం. జూలై 2021 తర్వాత కోహ్లీ మళ్లీ నంబర్ 1 స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి.
కోహ్లీ గత ఐదు వన్డే ఇన్నింగ్స్‌ల స్కోర్లు 74, 135, 102, 65, 93 గా ఉన్నాయి.
మరోవైపు, భారత కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో కేవలం 26 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో అతని ర్యాంకింగ్ పడిపోయింది. ఇదే అదనుగా న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ అద్భుత ప్రదర్శనతో రెండో స్థానానికి చేరుకున్నాడు. వడోదరలో జరిగిన మ్యాచ్‌లో మిచెల్ 84 పరుగులు చేశాడు.
అయితే, భారత్ 301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో అతని పోరాటం వృథా అయ్యింది. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీకి (785 పాయింట్లు), డారిల్ మిచెల్ (784 పాయింట్లు) మధ్య కేవలం ఒక్క పాయింట్ మాత్రమే వ్యత్యాసం ఉంది. మిచెల్ గత ఐదు మ్యాచ్‌ల్లో మూడు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
తాజా ర్యాంకింగ్స్ ప్రకారం టాప్-10 బ్యాటర్ల వివరాలు ఇలా ఉన్నాయి..
1. విరాట్ కోహ్లీ - 785 పాయింట్లు
2. డారిల్ మిచెల్ - 784 పాయింట్లు
3. రోహిత్ శర్మ - 775 పాయింట్లు
4. ఇబ్రహీం జద్రాన్ - 764 పాయింట్లు
5. శుభ్‌మన్ గిల్ - 725 పాయింట్లు
6. బాబర్ ఆజం - 722 పాయింట్లు
7. హ్యారీ హెక్టర్ - 708 పాయింట్లు
8. షాయ్ హోప్ - 701 పాయింట్లు
9. చరిత్ అసలంక - 690 పాయింట్లు
10. శ్రేయాస్ అయ్యర్ - 682 పాయింట్లు
వన్డే క్రికెట్ చరిత్రలో నంబర్ 1 స్థానంలో ఎక్కువ రోజులు కొనసాగిన భారతీయ బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. కోహ్లీ అక్టోబర్ 2013లో తొలిసారి నంబర్ 1 ర్యాంక్ సాధించాడు. ఇప్పటివరకు అతను మొత్తం 825 రోజుల పాటు ఈ స్థానంలో కొనసాగాడు. బాబర్ ఆజం (1359 రోజులు), మైఖేల్ బెవన్ (1361 రోజులు), వివ్ రిచర్డ్స్ (2306 రోజులు) వంటి దిగ్గజాల సరసన కోహ్లీ నిలిచాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే లక్ష్యంగా కోహ్లీ ముందుకు సాగుతున్నాడు.
బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్ విభాగంలోనూ భారత ఆటగాళ్లు మెరుగైన ర్యాంకులు సాధించారు. భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఐదు స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్ ఆటగాడు మెహదీ హసన్ మిరాజ్ కూడా ఇదే స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ భారత్‌పై 4 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతను ఏకంగా 27 స్థానాలు ఎగబాకి 69వ స్థానానికి చేరుకున్నాడు. భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఇదే ర్యాంకులో ఉన్నాడు.