Paris Olympics 2024 - Telangana Athletes: గతంలో కంటె ఎక్కువ మంది అథ్లెట్లతో పారిస్ ఒలింపిక్స్ లో భారత్ పాల్గొంది.గత ఒలింపిక్స్ లో గెలుచుకున్న మెడల్స్ ను ఈ సారి డబులు చేయాలని చూస్తోంది. ఈ సారి తెలంగాణ నుంచి కూడా ముగ్గురు క్రీడాకారులు పారిస్ ఒలింపిక్స్ లో పోటీ పడుతున్నారు. భారత్ కు మెడల్స్ తీసుకురావడమే లక్ష్యంగా పారిస్ కు చేరుకున్నారు. వారి వివరాలు గమనిస్తే..
నిఖత్ జరీన్ :
రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో పారిస్ ఒలింపిక్స్ లో పోటీ పడుతోంది. తెలంగాణకు చెందిన ఈ సంచలన బాక్సర్ 2022లో 52 కేజీల విభాగంలో తన మొదటి ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణాన్ని గెలుచుకుంది. అదే సంవత్సరం లైట్-ఫ్లైవెయిట్ విభాగంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించింది. 2023 హాంగ్‌జౌ ఆసియన్ గేమ్స్‌లో కాంస్యం సాధించిన తర్వాత పారిస్‌కు అర్హత సాధించడానికి ముందు నిఖత్ 2023లో 50 కిలోల విభాగంలో మరో ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణాన్ని కూడా గెలుచుకుంది. చెక్ రిపబ్లిక్‌లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్‌లో విజయం సాధించడానికి ముందు మేలో స్ట్రాండ్జా మెమోరియల్‌లో రజతం, ఎలోర్డా కప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న నిఖత్ జరీన్ పారిస్ లో మెడల్ కొట్టడం పక్కా అని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈషా సింగ్ :
పారిస్ ఒలింపిక్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కులలో హైదరాబాద్‌కు చెందిన ఈషా సింగ్ ఒకరు. ఈ తెలంగాణ స్టార్ షూటర్ కు ఇది తొలి ఒలింపిక్ ప్రయాణం. ఇప్పటికే ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో అద్భుతమైన ప్రదర్శనతో ఒలింపిక్స్ లో అడుగుపెట్టింది. చివరిసారిగా భారత్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో పతకాలు గెలుచుకుంది. ఆ తర్వాత నిరాశే మిగిలింది. అయితే, ఈ సారి స్టార్ షూటర్ మను భకర్ తో పాటు ఇషా సింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 2014లో షూటింగ్ కెరీర్ లోకి వచ్చిన ఇషా.. అద్భుతమైన ప్రదర్శనతో ఛాంపియన్ షూటర్లకు షాకిచ్చి గోల్డ్ గెలుచుకుంది. పారిస్ ఒలింపిక్స్ లో మెడల్ గెలుస్తాననే ధీమాతో ఉంది ఈషా సింగ్.
Image credit: PTI
శ్రీజ ఆకుల :
పారిస్ ఒలింపిక్స్ 2024 కోసం ఫ్రాన్స్ లో అడుగుపెట్టిన భారత టేబుల్ టెన్నిస్ జట్టులో తెలంగాణ క్రీడాకిరిణి ఆకుల శ్రీజ కూడా ఉన్నారు. శ్రీజ ఇది తొలి ఒలింపిక్స్. ఇటీవలి కాలంలో అద్భుతమైన ఆటతో సత్తాచాటుతున్న శ్రీజ పై భారత్ మెడల్ ఆశాలు పెట్టుకుంది. సింగిల్స్‌తోపాటు డబుల్స్, టీమ్ ఈవెంట్లలో బరిలోకి దిగుతున్న శ్రీజ ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉంది. భారత టెబుల్ టెన్నిస్ లో శ్రీజ మహిళల సింగిల్స్‌లో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ ర్యాకింగ్స్ లో 24వ స్థానంలో ఉంది.2022 కామన్వెల్త్ గేమ్స్‌లో శరత్ కమల్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచారు. 2024 తో 2 డబ్ల్యూటీటీ టైటిల్స్ కూడా సాధించింది.