India vs South Africa : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8లో భాగంగా భారత్, సౌతాఫ్రికా తలపడుతున్నాయి. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి సఫారీలను చెడుగుడు ఆడుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ముగ్గురు మొనగాళ్లతో భారత్ సూపర్ మాస్ జాతర మొదలుపెట్టింది.
టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తర దశకు చేరుకుంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా, ఇప్పుడు సూపర్-8 రౌండ్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి.
గ్రూప్-Aలో పాకిస్థాన్, యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్‌పై ఘనవిజయాలు సాధించిన సూర్యకుమార్ యాదవ్ సేన, అదే జోరును సూపర్-8లోనూ కొనసాగించాలని భావిస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాను 4-1తో ఓడించిన రికార్డు భారత్‌కు అదనపు బలాన్ని ఇస్తోంది. అయితే, ముగ్గురు భారత మొనగాళ్లు సౌతాఫ్రికాను చెడుగుడు ఆడుకునేందుకు రెడీ అయ్యారు.
24
ప్రోటీస్ బౌలర్లకు ఇషాన్ కిషన్ సింహస్వప్నం
ఈ టోర్నమెంట్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఊహించని రీతిలో చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 202 స్ట్రైక్ రేట్‌తో 176 పరుగులు సాధించాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన హై-ప్రెజర్ మ్యాచ్‌లో కేవలం 44 బంతుల్లోనే 77 పరుగులు చేసి సత్తా చాటాడు.
పవర్ ప్లే ఓవర్లలో ఫీల్డింగ్ నిబంధనలను ఆసరాగా చేసుకుని ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటంలో ఇషాన్ దిట్ట. ఈ సూపర్ 8 మ్యాచ్‌లో కూడా ఇషాన్ కిషన్ శుభారంభం ఇస్తే, సౌతాఫ్రికాకు కష్టాలు తప్పవు. అహ్మదాబాద్‌లోని ఫ్లాట్ పిచ్‌పై ఇషాన్ బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది.
34
ఆల్ రౌండ్ షోతో అదరగొట్టనున్న హార్దిక్ పాండ్యా
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు అహ్మదాబాద్ స్టేడియం సొంత మైదానం లాంటిది. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఇక్కడ అనేక మ్యాచ్‌లు ఆడిన అనుభవం అతనికి ఉంది. ఈ పిచ్ స్వభావం, బౌండరీల కొలతలపై హార్దిక్‌కు పూర్తి అవగాహన ఉంది.
ప్రస్తుత ప్రపంచకప్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పాండ్యా కీలక పాత్ర పోషిస్తున్నాడు. క్లిష్ట సమయాల్లో వికెట్లు తీయడం, చివర్లో మెరుపు వేగంతో పరుగులు రాబట్టడంలో హార్దిక్ కింగ్. సఫారీలతో జరిగే కీలక పోరులో పాండ్యా భారత్‌కు అతిపెద్ద మ్యాచ్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది.
వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్‌కు సఫారీలు బలి కావాల్సిందే
సౌతాఫ్రికా బ్యాటర్లకు వరుణ్ చక్రవర్తి ఒక అంతుచిక్కని ప్రశ్నగా మారాడు. గణాంకాల ప్రకారం, టీ20 ఫార్మాట్‌లో సౌతాఫ్రికాపై అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా వరుణ్ రికార్డు సృష్టించాడు. కేవలం 8 మ్యాచ్‌ల్లోనే ప్రోటీస్ జట్టుపై 22 వికెట్లు పడగొట్టాడు.
ఈ ప్రపంచకప్‌లోనూ వరుణ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి టీమిండియా లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. మిడిల్ ఓవర్లలో వరుణ్ వేసే మిస్టరీ బంతులను ఎదుర్కోవడం సౌతాఫ్రికా బ్యాటర్లకు పెను సవాలుగా మారనుంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు రాణిస్తే భారత్ విజయం ఖాయం.