IND vs SA : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న హై-వోల్టేజ్ పోరు ఉత్కంఠను పెంచుతోంది. సూపర్ ఫామ్ లో ఉన్న క్వింటన్ డికాక్ ముప్పు భారత్ కు పొంచి ఉంది. అహ్మదాబాద్ లో జరిగే ఈ మ్యాచ్ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.
నరేంద్ర మోదీ స్టేడియంలో బిగ్ ఫైట్.. సూపర్-8లో భారత్ vs దక్షిణాఫ్రికా ఢీ
టీ20 ప్రపంచకప్ 2026లో అసలైన మజా మొదలైంది. సూపర్-8 దశలో భాగంగా ఫిబ్రవరి 21న న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే, ఆదివారం (ఫిబ్రవరి 22) సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న రెండో మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
2024 ప్రపంచకప్ ఫైనల్ ప్రత్యర్థులు మళ్ళీ తలపడుతుండటంతో ఈ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా మారింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా వరుస విజయాలతో జోరు మీదుండగా, దక్షిణాఫ్రికా కూడా అజేయంగా సూపర్-8కు చేరుకుంది.
25
డేంజర్ జోన్ లో టీమిండియా.. డికాక్ రికార్డులు అమోఘం
దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్ క్వింటన్ డికాక్ ఫామ్ భారత జట్టుకు ఆందోళన కలిగించే అంశం. అంతర్జాతీయ క్రికెట్‌కు కొంత కాలం విరామం ఇచ్చిన తర్వాత రీఎంట్రీ చేసిన డికాక్, గత 14 ఇన్నింగ్స్‌లలో 448 పరుగులు సాధించాడు. ఇందులో విశేషం ఏమిటంటే, అతని స్ట్రైక్ రేట్ 167.79గా ఉంది.
ముఖ్యంగా భారత్‌పై డికాక్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. టీమిండియాపై ఆడిన గత 15 ఇన్నింగ్స్‌లలో డికాక్ 6 హాఫ్ సెంచరీలు బాదాడు. భారత్‌పై అతని సగటు 42.25 కాగా, స్ట్రైక్ రేట్ 149.55గా ఉంది. ఈ మెగా టోర్నీలో కూడా అతను ఇప్పటికే 25, 59, 20, 14 పరుగులతో రాణిస్తూ ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు.
35
అహ్మదాబాద్ పిచ్ కండిషన్స్ ఎవరికి లాభం?
దక్షిణాఫ్రికా జట్టు ఈ టోర్నీలో తన గ్రూప్ దశలోని నాలుగు మ్యాచ్‌లలో మూడు అహ్మదాబాద్‌లోనే ఆడింది. ఇక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులపై తమకు పూర్తి అవగాహన ఉందని డికాక్ తెలిపాడు. "మేము ఇక్కడ డే అండ్ నైట్ మ్యాచ్‌లు ఆడాము, కాబట్టి పరిస్థితులు మాకు తెలుసు. అయితే భారత ఆటగాళ్లకు కూడా ఐపీఎల్ ద్వారా ఈ స్టేడియంపై మంచి పట్టు ఉంది" అని డికాక్ వ్యాఖ్యానించాడు.
ప్రస్తుతానికి ఈ పిచ్‌లు పేసర్లకు అనుకూలిస్తున్నాయని, స్పిన్నర్లకు కొంచెం కష్టంగా మారుతోందని చెప్పాడు. గత ఏడాది ఇదే గ్రౌండ్ లో భారత్ 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించిన సంగతి తెలిసిందే.
భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుత ఫామ్ దక్షిణాఫ్రికా బ్యాటర్లను కలవరపెడుతోంది. గతేడాది చివరిలో జరిగిన టీ20 సిరీస్‌లో వరుణ్ అద్భుతంగా రాణించాడు. దక్షిణాఫ్రికాపై ఆడిన గత 8 మ్యాచ్‌లలో అతను ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు. ఈ విషయాన్ని డికాక్ కూడా అంగీకరించాడు.
"వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలర్, అతని కోసం మా జట్టు ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమైంది" అని డికాక్ వెల్లడించాడు. స్పిన్ ట్రాప్‌లో పడకుండా ఉండేందుకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు ముందస్తు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.
55
పాత గాయాలను మర్చిపోయి.. కొత్త లక్ష్యంతో..
2024 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమిని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మర్చిపోయినట్లు కనిపిస్తున్నారు. "ఆ రోజు తర్వాత మేము దాని గురించి మళ్ళీ మాట్లాడుకోలేదు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఆ బాధ నుంచి బయటపడ్డారు" అని డికాక్ చెప్పాడు.
ప్రస్తుతం జట్టు చాలా ప్రశాంతంగా ఉందని, ఐడెన్ మార్క్రామ్ ఓపెనర్‌గా రాణించడం తమకు కలిసొచ్చే అంశమని పేర్కొన్నాడు. మార్క్రామ్ న్యూజిలాండ్‌పై 44 బంతుల్లో 86 పరుగులు చేసి ఫామ్‌లోకి రావడం విశేషం. అటు భారత్, ఇటు దక్షిణాఫ్రికా రెండు జట్లు అజేయంగా ఉండటంతో, ఈ మ్యాచ్ సెమీస్ అవకాశాలను ప్రభావితం చేయనుంది.