Team India: విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. మరోవైపు, టీమిండియా రెగ్యులర్ ప్లేయర్లు రిషభ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు.
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో అనేక మంది యువ, అనుభవజ్ఞులైన క్రికెటర్లకు తమ సత్తాను చాటారు. ఈ టోర్నీలో కొందరు ఆటగాళ్లు పరుగుల వరద పారిస్తూ, వికెట్లు పడగొడుతూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో కొంతమంది టీమిండియా రెగ్యులర్ ప్లేయర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
25
పడిక్కల్ సూపర్ ఫామ్..
కర్ణాటకకు చెందిన దేవదత్ పడిక్కల్ ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు సెంచరీలు సాధించి తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గోవాపై కేవలం 75 బంతుల్లోనే 157 పరుగులతో విధ్వంసం సృష్టించి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఈ టోర్నీలో ఒక సెంచరీతో రాణించి తన సత్తా చాటాడు. బౌలింగ్‌లో బెంగాల్ తరపున ఆడుతున్న వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ కీలక వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతూ, జాతీయ జట్టులో స్థానం కోసం బలమైన పోటీని ఇస్తున్నారు.
35
రెగ్యులర్ ఆటగాళ్లు ఫెయిల్.. యువ ప్లేయర్స్ సూపర్..
అయితే, ఈ ప్రదర్శనల మధ్య, టీమిండియా రెగ్యులర్ జట్టులో భాగమైన కొందరు ఆటగాళ్లు మాత్రం తమ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు. ఢిల్లీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ ఈ టోర్నీలో నిరాశపరిచాడు. అతను నాలుగు మ్యాచ్‌లలో ఆంధ్రాపై 5 పరుగులు, గుజరాత్‌పై 70 పరుగులు, సౌరాష్ట్రపై 22 పరుగులు, ఒడిశాపై 24 పరుగులు కలిపి మొత్తం 121 పరుగులు మాత్రమే చేయగలిగాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు పంత్ ఇలాంటి నిరాశజనక ప్రదర్శన చేయడం అతని ఫామ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
అలాగే, ఆంధ్ర సారథి నితీశ్ కుమార్ రెడ్డి ప్రదర్శన కూడా స్థిరంగా లేదు. అతను ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. రైల్వేస్‌తో మ్యాచ్‌లో మాత్రం నితీశ్ రెడ్డి బ్యాట్‌తో రాణించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 41 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ మ్యాచ్‌లో ఒక వికెట్ కూడా పడగొట్టాడు. అయితే, ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 6 పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే తీయగా, తాజాగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో కూడా అతని ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది.
55
ఎవరికి ఛాన్స్ ఇస్తారు.?
ఈ యువ ఆటగాళ్ల అద్భుతమైన ఫామ్, అనుభవజ్ఞులైన అంతర్జాతీయ ఆటగాళ్ల నిరాశజనక ప్రదర్శన టీమిండియా సెలెక్టర్లకు ఒక క్లిష్టమైన పరిస్థితిని సృష్టించింది. రాబోయే అంతర్జాతీయ సిరీస్‌ల కోసం జట్టును ఎంపిక చేయడంలో వారికి ఇది పెద్ద సవాలుగా మారింది. దేశవాళీ క్రికెట్‌లో మెరిసిన వారికి అవకాశం ఇవ్వాలా, లేదా అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు వారి గత ప్రదర్శనల ఆధారంగా మరికొన్ని అవకాశాలు ఇవ్వాలా అనేది సెలెక్టర్లకు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.