2026లో క్రికెట్ అభిమానులకు పూనకాలే ! గ్రౌండ్ దద్దరిల్లాల్సిందే.. రికార్డులు బద్దలవ్వాల్సిందే. ఒక పక్క వరల్డ్ కప్ వేట, మరో పక్క బ్యాక్ టు బ్యాక్ సిరీస్‌లు. ఊపిరి సలుపని షెడ్యూల్, హై వోల్టేజ్ మ్యాచ్‌లతో టీమిండియా ఈ ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టడానికి రెడీ అయ్యింది. గ్యాప్ లేదు.. మనోళ్లు వచ్చారంటే ఊచకోతే మరి !
మొత్తంగా 2026 లో భారత జట్టు ఫుల్ బిజీగా ఉండనుంది. సొంతగడ్డపై టీ20 వరల్డ్ కప్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లతో పాటు ఆసియా గేమ్స్ వరకు.. కొత్త ఏడాదిలో భారత క్రికెట్ జట్టు పూర్తి షెడ్యూల్ వివరాలు గమనిస్తే..
టీమిండియాకు 2026 క్యాలెండర్ ఇయర్ అత్యంత కీలకమైనది. దాదాపు ఒక దశాబ్దం నిరీక్షణ తర్వాత, భారత్ మరోసారి ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. సొంతగడ్డపై జరిగే సిరీస్‌లు, విదేశీ పర్యటనలు, ప్రధాన ప్రపంచ టోర్నమెంట్‌లతో టీమిండియా డైరీ నిండిపోయింది. టీ20 ప్రపంచ కప్ నిర్వహణ మొదలుకొని, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లలో సవాలుతో కూడిన పర్యటనల వరకు ఆటగాళ్లు మైదానంలో తీరిక లేకుండా గడపనున్నారు.
యువ సారథి శుభ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ల నాయకత్వంలో టీమిండియా ఈ ఏడాది పలు సవాళ్లను ఎదుర్కోనుంది.