
ICC Men's T20 World Cup 2026 : స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 టీమిండియా సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటోంది. అసలు ఓటమన్నదే లేకుండా సూపర్-8 కు చేరుకున్న సూర్య సేన జైత్రయాత్రకు సౌతాఫ్రికా బ్రేకులు వేసింది. ఒక్క ఓటమి... కేవలం ఒకే ఒక్క ఓటమి టీమిండియా ఆటతీరుపై అనేక అనుమానాలను రేపింది... అభిమానుల్లో కలవరాన్ని పెంచింది. అసలు భారత్ సెమీ ఫైనల్ కు చేరుకుంటుందా..? సూపర్ 8 నుండే వెనుదిరుగుతుందా..? అనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఈ గురువారం (ఫిబ్రవరి 26) జింబాబ్వేతో జరిగే మ్యాచ్ టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రయాణాన్ని డిసైడ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ లో టీమిండియాలో మార్పులు చేర్పులు ఖాయంగా కనిపిస్తోంది.
అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఫామ్ లో లేరు... కాబట్టి వీరిద్దరిలో ఎవరో ఒకరు జింబాబ్వేతో మ్యాచ్ కు దూరం కానున్నాయి. ఆ స్థానంలో సంజూ శాంసన్ ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్షర్ పటేల్ జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. బౌలర్లలో కూడా మార్పులుచేర్పులు ఉండవచ్చు. మొత్తంగా జింబాబ్వేతో పక్కా విన్నింగ్ టీంను బరిలోకి దింపనున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ ప్లేయింగ్ XI లో ఎవరుండాలి? ఎవరు ఏ స్థానంలో ఆడితే బాగుంటుంది..? అనేది వివరించారు.
ప్రస్తుతం టీమిండియా టాప్-3 బ్యాటర్లు ఎడమచేతి వాటం వాళ్లే. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తో పాటు ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చే తిలక్ వర్మ కూడా ఎడమచేతి వాటం బ్యాటర్లే... టీమిండియా తడబాటుకు ఇదీ ఓ కారణమేనని మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు. కాబట్టి తిలక్ వర్మ ను నెంబర్ 3 లో కాకుండా నెంబర్ 4 లో బ్యాటింగ్ కు పంపించాలని సూచించారు. జింబాబ్వేతో మ్యాచ్ లో బ్యాటింగ్ లైనప్‌లో మార్పు చేయాల్సిందేనని పఠాన్ సూచించారు.
ఫస్ట్ వికెట్ పడగానే తిలక్ వర్మ కాకుండా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వస్తే మరింత మెరుగైన పలితాలు ఉంటాయని పఠాన్ అభిప్రాయపడ్డారు. . దీనివల్ల వరుసగా ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు రాకుండా చూడొచ్చని అన్నారు. బ్యాటింగ్ ఆర్డర్ లో సూర్య ముందుకు, తిలక్ వెనక్కి వెళితే బాగుంటుందని పఠాన్ తెలిపారు.
భారత్ తరఫున టీ20ల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్.. 32 మ్యాచ్‌ల్లో 32 సగటు, 158.53 స్ట్రైక్ రేట్‌తో 864 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇలా ఫస్ట్ డౌన్ లో అంటే మొదటి వికెట్ పడగానే కెప్టెన్ బ్యాటింగ్ కి వస్తే మరింత బాధ్యతగా ఆడగలడు... అతడి రికార్డు కూడా ఈ స్థానంలోనే బాగుంది అని పఠాన్ అభిప్రాయపడ్డారు.
టీమిండియా వైస్ కెప్టెన్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ను సౌతాఫ్రికాతో మ్యాచ్ లో పక్కనబెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాబట్టి జింబాబ్వేతో మ్యాచ్ లో ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఎడమచేతి వాటం బ్యాటర్లపై బాగా బౌలింగ్ చేయగల అనుభవజ్ఞుడైన ఆటగాడు అక్షర్ అని పఠాన్ తెలిపాడు. బ్యాటింగ్‌లో లోయర్ ఆర్డర్‌కు అక్షర్ బలం చేకూర్చగలడని అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 తొలి మ్యాచ్‌లో అక్షర్‌ను ఆడించకపోవడాన్ని పఠాన్ తప్పుబట్టాడు... ఇందుకు టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుందని అన్నాడు.
స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తిరిగి జట్టులోకి తీసుకురావాలని పఠాన్ సూచించాడు. 'వెస్టిండీస్‌తో పెద్ద మ్యాచ్‌కు ముందు జింబాబ్వేపై కుల్దీప్‌కు అవకాశం ఇస్తే మంచిది' అని పఠాన్ అభిప్రాయపడ్డాడు. అతడు జింబాబ్వే బ్యాటర్లను కట్టడి చేయడంలో ఉపయోగపడతాడని పఠాన్ అంటున్నాడు.
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ లేదంటే యువ తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్ ను ఆడించాలనే ఆలోచనలో టీమిండియా మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఇది సరైన నిర్ణయం కాదని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడుతున్నారు. 'సంజూను జట్టులోకి తీసుకోవడం గురించి కూడా టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ జట్టులో ఎక్కువ ప్రయోగాలు వద్దు. ప్లేయింగ్ XIలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లను చేర్చడమే ఇప్పుడు అవసరమైన మార్పు. అంతకుమించి ఏం చేయవద్దు' అని పఠాన్ స్పష్టం చేశాడు.