Shikhar Dhawan : టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన ప్రియురాలు సోఫీ షైన్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. వీరి వివాహం ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగే అవకాశం ఉంది.
రెండో పెళ్లికి సిద్ధమైన శిఖర్ ధావన్.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్
భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, గబ్బర్ గా అభిమానులు పిలుచుకునే శిఖర్ ధావన్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తన ప్రేయసి సోఫీ షైన్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు ధావన్ అధికారికంగా ప్రకటించారు. సోమవారం (జనవరి 12న) ఇన్‌స్టాగ్రామ్ లో ఈ జంట తమ నిశ్చితార్థ ఉంగరాలను చూపిస్తున్న ఫోటోను పంచుకున్నారు. ఈ ప్రకటనతో నెట్టింట్లో శుభాకాంక్షల వెల్లువ మొదలైంది.
26
సోషల్ మీడియాలో శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్
శిఖర్ ధావన్, సోఫీ షైన్ తమ ఎంగేజ్మెంట్ విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించారు. "చిరునవ్వులను పంచుకోవడం నుంచి కలలను పంచుకోవడం వరకు.. మా ఈ ప్రయాణంలో మీ ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటాయని ఆశిస్తున్నాం. మేము శాశ్వతంగా ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నాం" అని రాసుకొచ్చారు. గత ఏడాది మే 1న సోషల్ మీడియాలో వీరిద్దరూ తమ ప్రేమ బంధాన్ని అధికారికం చేశారు. ఇప్పుడు నిశ్చితార్థంతో ఆ బంధాన్ని మరింత బలపరుచుకున్నారు.
36
ఎవరీ సోఫీ షైన్?
సోఫీ షైన్ ఐర్లాండ్‌కు చెందినవారు. ఆమె సోషల్ మీడియాలో దాదాపు 3,47,000 మంది ఫాలోవర్లతో ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు. అయితే ఆమె కేవలం సోషల్ మీడియా సెలబ్రిటీ మాత్రమే కాదు, ఉన్నత విద్యావంతురాలు కూడా. పలు రిపోర్టుల ప్రకారం.. ఆమె లిమరిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందారు. ప్రస్తుతం అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో సెకండ్ వైస్ ప్రెసిడెంట్‌గా (ప్రొడక్ట్ కన్సల్టెంట్) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా, ఆమె శిఖర్ ధావన్ ఫౌండేషన్ బాధ్యతలను కూడా పర్యవేక్షిస్తున్నారు. ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఫన్నీ వీడియోలలో సోఫీ తరచుగా కనిపిస్తూ ఉంటారు.
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. శిఖర్ ధావన్, సోఫీ షైన్ ఫిబ్రవరిలో వివాహం చేసుకోనున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ వేడుక జరిగే అవకాశం ఉంది. ఈ వివాహ వేడుకకు క్రికెట్ ప్రపంచం, బాలీవుడ్ నుంచి అనేక మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ భారీ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. గతంలో దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా, అలాగే పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో సోఫీ, ధావన్‌తో కలిసి కనిపించారు.
56
శిఖర్ ధావన్ : ఘనమైన క్రికెట్ కెరీర్
40 ఏళ్ల శిఖర్ ధావన్ ఆగస్టు 24, 2024న అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరిగా పేరుగాంచిన ధావన్, 167 వన్డేల్లో 44.11 సగటుతో 6793 పరుగులు చేశారు. ఇందులో 17 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే 68 టీ20 మ్యాచ్‌లలో 126.36 స్ట్రైక్ రేట్‌తో 1759 పరుగులు సాధించారు.
టెస్టుల్లోనూ తనదైన ముద్ర వేసిన ధావన్, 34 మ్యాచ్‌లలో 40.61 సగటుతో 2315 పరుగులు చేశారు. 2013లో ఆస్ట్రేలియాపై మొహాలీలో జరిగిన తన అరంగేట్రం టెస్టులోనే 174 బంతుల్లో 187 పరుగులు చేసి, కేవలం 85 బంతుల్లోనే సెంచరీ సాధించి వేగవంతమైన టెస్ట్ అరంగేట్రం సెంచరీ రికార్డును నెలకొల్పారు. రోహిత్ శర్మతో కలిసి ధావన్ 115 వన్డేల్లో 5148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు, ఇది సచిన్-గంగూలీ జోడీ తర్వాత రెండో అత్యుత్తమ రికార్డు.
66
శిఖర్ ధావన్ గత వైవాహిక జీవితం
శిఖర్ ధావన్ గతంలో ఆస్ట్రేలియాకు చెందిన అయేషా ముఖర్జీని 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, మనస్పర్థల కారణంగా 2023 అక్టోబర్‌లో వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
2025 ఫిబ్రవరిలో ధావన్ తన కుమారుడిని చూడలేకపోవడంపై భావోద్వేగానికి లోనైనట్లు వార్తలు వచ్చాయి. కోర్టు ధావన్‌కు వీడియో కాల్స్ ద్వారా కుమారుడితో మాట్లాడే అనుమతి ఇచ్చినప్పటికీ, సంప్రదింపులు జరపడంలో ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం.