1 Crore Catch: అదృష్టం అంటే ఇదేరా మావా! ఆ ఒక్క చేతి క్యాచ్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు

Published : Dec 28, 2025, 05:31 PM ISTUpdated : Dec 28, 2025, 06:14 PM IST

1 Crore Catch:  SA20 లీగ్‌లో ర్యాన్ రికెల్టన్ కొట్టిన సిక్సర్‌ను స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమాని ఒక్క చేతితో పట్టి ఏకంగా రూ. 1 కోటి భారీ ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. ఈ ఆసక్తికర ఘటన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
ఒక్క క్యాచ్‌.. రూ. 1 కోటి జాక్‌పాట్! మ్యాచ్ మధ్యలో కళ్లు చెదిరే దృశ్యం.. వీడియో వైరల్

దక్షిణాఫ్రికా లో జరుగుతున్న SA20 లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచే అద్భుత ఘటన చోటుచేసుకుంది. గ్రౌండ్ లో ఆటగాళ్లు పరుగుల వరద పారిస్తుంటే, స్టాండ్స్‌లో కూర్చున్న ఓ సాధారణ అభిమాని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. న్యూలాండ్స్‌ లో ఎంఐ కేప్ టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది. 

ఈ మ్యాచ్‌లో ఎంఐ కేప్ టౌన్ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ అద్భుతమైన సెంచరీతో మెరిసినప్పటికీ, అందరి దృష్టి మాత్రం ఆ ఒక్క అభిమాని మీదే నిలిచింది. రికెల్టన్ కొట్టిన భారీ సిక్సర్‌ను ఈ అభిమాని అద్భుతంగా క్యాచ్ పట్టడంతో అతని దశ తిరిగింది.

26
కోటీశ్వరుడిని చేసిన ఒక్క క్యాచ్

మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎంఐ కేప్ టౌన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 13వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. ర్యాన్ రికెల్టన్ క్రీజులో ఉండగా, బౌలర్ వేసిన బంతిని భారీ షాట్ ఆడాడు. ఆ బంతి నేరుగా స్టాండ్స్‌లోకి దూసుకెళ్లింది. అక్కడ ఉన్న ఓ అభిమాని అద్భుతమైన టైమింగ్‌తో, బంతిని ఒక్క చేతితోనే క్యాచ్ పట్టుకున్నాడు.

దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సంబరాల్లో మునిగిపోయింది. ఈ అద్భుతమైన క్యాచ్ తో  సదరు అభిమాని ఏకంగా 2 మిలియన్ రాండ్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. అంటే భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 1.07 కోట్లు. కేవలం ఒక్క క్యాచ్‌తో ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

36
SA20: ఏంటీ 'క్యాచ్ ఏ మిలియన్' ఆఫర్?

SA20 లీగ్ నిర్వాహకులు అభిమానుల కోసం ప్రత్యేకంగా 'క్యాచ్ ఏ మిలియన్' అనే ప్రమోషనల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని ప్రకారం, మ్యాచ్ జరుగుతున్నప్పుడు బ్యాటర్ కొట్టిన సిక్సర్ నేరుగా స్టాండ్స్‌లోకి వస్తే, దానిని ఏ అభిమాని అయినా ఒక్క చేతితో క్లీన్‌గా పట్టుకుంటే వారికి నగదు బహుమతి లభిస్తుంది.

రికెలన్ కొట్టిన బంతిని సదరు అభిమాని నిబంధనల ప్రకారం ఒక్క చేతితోనే అందుకోవడంతో, అతను 2 మిలియన్ రాండ్ల ప్రైజ్ పూల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుండగా, గ్రౌండ్ లోని ఆటగాళ్ల కంటే ఈ అభిమానికే ఎక్కువ క్రేజ్ లభించింది.

46
పరుగుల వరద పారించిన డర్బన్

మ్యాచ్ విషయానికి వస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 232 పరుగులు చేసింది. ఇది SA20 లీగ్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోరు కావడం విశేషం. గత సీజన్ ఫైనల్ లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ చేసిన 204 పరుగుల రికార్డును డర్బన్ బద్దలు కొట్టింది.

న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లేలో వీరిద్దరూ పోటీపడి పరుగులు రాబట్టారు. విలియమ్సన్ 40 పరుగులు చేసి ఔట్ కాగా, కాన్వే 33 బంతుల్లోనే 64 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివర లో హెన్రిచ్ క్లాసెన్, జోస్ బట్లర్ లతో పాటు మార్క్‌రమ్ (17 బంతుల్లో 35), ఇవాన్ జోన్స్ (14 బంతుల్లో 33 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.

56
రికెల్టన్ సెంచరీ వృథా

భారీ లక్ష్య ఛేదనలో ఎంఐ కేప్ టౌన్ జట్టు చివరి వరకు పోరాడింది. ఓపెనర్ రికెల్టన్ ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 65 బంతుల్లోనే 113 పరుగులు సాధించి, తన రెండో T20 సెంచరీని నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 11 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి.

జేసన్ స్మిత్ కూడా 14 బంతుల్లో 41 పరుగులు చేసి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చాడు. అయితే, రికెల్టన్ ఎంత ప్రయత్నించినప్పటికీ, మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లేకపోవడంతో ఎంఐ జట్టు విజయానికి 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

66
ఆఖరి ఓవర్‌లో ఉత్కంఠ

మ్యాచ్ చివరి ఓవర్లో డ్రామా నెలకొంది. ఎంఐ విజయానికి భారీ పరుగులు అవసరమైన సమయంలో డర్బన్ బౌలర్ ఈథన్ బాష్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కీలకమైన రికెల్టన్ వికెట్ తీసి మ్యాచ్‌ను డర్బన్ వైపు తిప్పాడు. ఈథన్ బాష్ 46 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

చివరకు ఎంఐ కేప్ టౌన్ నిర్ణీత ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. డర్బన్ సూపర్ జెయింట్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. రికెల్టన్ సెంచరీ, డర్బన్ రికార్డు స్కోరు నమోదైనప్పటికీ, మ్యాచ్ మొత్తంలో హైలైట్‌గా నిలిచింది మాత్రం ఆ అభిమాని పట్టిన 'కోటి రూపాయల క్యాచ్' మాత్రమే.

Read more Photos on
click me!

Recommended Stories