Rohit Sharma: శుభ్‌మాన్ గిల్, శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో భారత వన్డే జట్టు కెప్టెన్సీపై చర్చ మొదలైంది. రోహిత్ శర్మ మళ్లీ పగ్గాలు చేపడతాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
దక్షిణాఫ్రికాతో మరికొద్ది రోజుల్లో జరగనున్న వన్డే సిరీస్‌కు సంబంధించి టీమ్ ఇండియా కెప్టెన్సీపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రధాన ఆటగాళ్లైన శుభ్‌మాన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ల అందుబాటుపై నెలకొన్న అనిశ్చితి ఈ చర్చకు దారితీసింది. శుభ్‌మాన్ గిల్ ఇటీవల మూడు ఫార్మాట్లలో నిరంతరం ఆడుతున్నందున, అతనికి సఫారీలతో జరిగే వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. అదే సమయంలో, శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియా పర్యటనలోనే గాయపడి, ప్రస్తుతం ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. దీంతో అతను కూడా వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.
25
ఇద్దరూ దూరమే..
ఈ పరిస్థితుల్లో రెగ్యులర్ కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరూ అందుబాటులో లేకపోతే జట్టును ఎవరు నడిపిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో రోహిత్ శర్మ మళ్లీ భారత వన్డే జట్టు పగ్గాలు చేపట్టాలనే చర్చ ఊపందుకుంది. అయితే, క్రికెట్ నిపుణులు మాత్రం రోహిత్ దీనికి అంగీకరించకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీని వదులుకున్న తర్వాత మళ్లీ ఆ బాధ్యతలు తీసుకోకుండా ఆటగాడిగా జట్టుకు తన సేవలను అందించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
35
కెప్టెన్సీకి రోహిత్ దూరం..
రోహిత్ శర్మ కూడా సీనియర్‌గా సలహాలు అందిస్తాడే తప్ప, మళ్లీ కెప్టెన్సీ చేపట్టకపోవచ్చని నిపుణుల వాదన. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రోహిత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ, సెంచరీ, అర్ధసెంచరీలతో దూకుడుగా ఆడాడు. ఆటను ఆస్వాదిస్తున్న ప్రస్తుత తరుణంలో ఒకసారి వదిలేసిన కెప్టెన్సీ పగ్గాలను మళ్లీ అందుకోవడానికి ఎవరూ ఇష్టపడరని నిపుణులు పేర్కొంటున్నారు. కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. శుభ్‌మాన్ గిల్ ఆడకపోతే కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతోంది.
మరోవైపు, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అతను బెంగళూరులో ఫిట్‌నెస్ సాధించడంపై దృష్టి సారించాడు. టీమ్ ఇండియాలోకి తిరిగి రావడానికి ముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరపున ఆడటానికి సిద్ధమవుతున్నాడు. ఈ నెల 26న బరోడా తరపున ఆడకపోయినా, 28న జరిగే రెండో మ్యాచ్‌లో ఆడటం ఖాయమని కథనాలు వస్తున్నాయి. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్‌కు మాత్రం అతను అందుబాటులోకి రావచ్చని అంచనాలున్నాయి.
55
జట్టు కూర్పు ఇలా..
జట్టు కూర్పు విషయానికొస్తే, ఆస్ట్రేలియాతో ఆడిన జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. గిల్ లేకపోతే రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలున్నాయి. వన్ డౌన్‌లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను తీసుకోవచ్చని చర్చ జరుగుతోంది. శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డిలలో ఒకరికి అవకాశం దొరకవచ్చు. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సిరాజ్, అర్ష్‌దీప్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇస్తే, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ కూడా జట్టులో చోటు కోసం పోటీలో ఉంటారని చెబుతున్నారు.