
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్ లో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు ఘోరంగా విఫలమయ్యారు. రోహిత్ 14 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేయగా, కోహ్లీ 8 బంతులు ఆడి ఖాతా కూడా తెరవలేకపోయాడు.
వర్షం ప్రభావంతో సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఫలితం తర్వాత విరాట్, రోహిత్ ఆటకు సిద్ధంగా ఉన్నారా? లేరా? అనే కొత్త చర్చ మొదలైంది. వీరిపై పలువురు విమర్శలు చేస్తున్న సమయంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ క్లారిటీ ఇచ్చారు.
భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ మాట్లాడుతూ.. “రోహిత్, కోహ్లీ ఆస్ట్రేలియాకు రాకముందే పూర్తి సిద్ధతతో ఉన్నారు. వారి విషయంలో ఇప్పుడే ఏదైనా నిర్ణయం తీసుకోవడం తొందరపాటు అవుతుంది. వారు ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కి వీడ్కోలు పలికారు కానీ ఐపీఎల్‌లో కొనసాగుతున్నారు. వారిద్దరి ఫిట్‌నెస్, ప్రాక్టీస్ వివరాలు మాకు బాగా తెలుసు. వారు తరచుగా నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తుంటారు, అక్కడ వారు చేసే ప్రాక్టీస్ ను నేను స్వయంగా గమనిస్తుంటాను” అని వివరించారు.
అలాగే, “ఇలాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ల విషయంలో అనవసర జోక్యం అవసరం లేదు. వారు సరైన మార్గంలో ఉన్నప్పుడు వారిపై దృష్టి పెట్టడం కన్నా స్వేచ్ఛ ఇవ్వడం మంచిది. రోహిత్, కోహ్లీ ఇద్దరికీ తగినంత సమయం లభించింది, వారు పూర్తి సిద్ధతతోనే ఈ సిరీస్‌లోకి అడుగుపెట్టారు” అని ఈ స్టార్ ప్లేయర్ల పై వస్తున్న విమర్శలు, ప్రశ్నలకు కోటక్ చెక్ పెట్టారు.
సితాంశు కోటక్ పెర్త్ మ్యాచ్ ఓటమి పై కూడా మాట్లాడారు. పెర్త్ వాతావరణం ఆటగాళ్లకు పెద్ద సవాలుగా మారిందని చెప్పారు. “వాతావరణ పరిస్థితుల కారణంగా ఆటగాళ్లు పలుమార్లు మైదానాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. అలా అవడం వల్ల బ్యాటర్లు తమ లయను అందుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఇది రోహిత్, కోహ్లీ ప్రదర్శనపై ప్రభావం చూపింది” అని తెలిపారు.
అలాగే, ఈ ఇద్దరు ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత తొలిసారి భారత జట్టులో తిరిగి చేరారనీ, ట్రాక్ లోకి రావడానికి కొంత సమయం పట్టడం సహజమని కోటక్ అన్నారు.
మొదటి వన్డేలో భారత జట్టు ఓటమికి తర్వాత, సీనియర్ బ్యాటర్లు కోహ్లీ, రోహిత్ లు ఫామ్‌లో లేరన్న విమర్శలకు కోటక్ సమాధానం ఇచ్చారు. “నాకు రోహిత్, కోహ్లీ ఆటలో ఎలాంటి రస్ట్‌నెస్ కనిపించలేదు. వారు ఐపీఎల్‌లో ఆడుతూనే ఉన్నారు.. వారి ఆటతీరు, ఫిట్‌నెస్ అద్భుతంగా ఉంది. ఇంత అనుభవం ఉన్న ఆటగాళ్లకు కొంత సమయం అవసరం” అని చెప్పారు.
అలాగే, టీం మేనేజ్‌మెంట్ ఇద్దరి ప్రాక్టీస్, ఫిట్‌నెస్‌పై నిరంతరం అప్‌డేట్‌లు పొందుతూనే ఉందని కోటక్ తెలిపారు. “వారు నేషనల్ అకాడమీకి వెళ్తే మేము వారి ప్రాక్టీస్ వీడియోలు, ఫిట్‌నెస్ రిపోర్టులు చూస్తాం” అని అన్నారు.
ఇద్దరి అనుభవం జట్టుకు గొప్ప బలం అని కోటక్ అన్నారు. “ఆస్ట్రేలియా పిచ్‌లు వేగం, బౌన్స్ కలిగి ఉంటాయి. కానీ రోహిత్, కోహ్లీ వంటి సీనియర్లు వాటిని ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉన్నారు. వారి ఫామ్‌తో భారత్ బ్యాటింగ్ లైన్‌అప్ మరింత బలపడుతుంది” అని వివరించారు.
“టీం మేనేజ్‌మెంట్ బ్యాటర్ల టెక్నిక్, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. రోహిత్, కోహ్లీ తదుపరి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన ఇస్తారనే నమ్మకం ఉంది” అని కోటక్ అన్నారు.
సితాంశు కోటక్ చివరగా హార్దిక్ పాండ్యా గైర్హాజరీ జట్టుకు లోటనే విషయాన్ని కూడా తెలిపారు. “హార్దిక్ వంటి ఆటగాడు లేకపోవడం పెద్ద లోటే. కానీ ఈ పరిస్థితి నీతీశ్ కుమార్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు తెచ్చింది. వారు కూడా భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తారు” అని పేర్కొన్నారు.
యశస్వి జైస్వాల్ గురించి మాట్లాడుతూ, “అతను మంచి ప్రాక్టీస్ లో ఉన్నాడు. అతనికి కూడా సమయం రాగానే అవకాశం లభిస్తుంది. కానీ ప్రస్తుతం కేవలం 11 మందే ఆడగలరు” అని చెప్పారు.
కాగా, భారత జట్టు ఇప్పుడు అడిలైడ్ వన్డేలో గెలిచి సిరీస్‌ను సమం చేయడానికి సిద్ధమవుతోంది. సీనియర్లు రోహిత్, కోహ్లీ తమ అనుభవం, నైపుణ్యంతో తదుపరి మ్యాచ్‌లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.