Ravichandran Ashwin: భారత మహిళల వన్డే ప్రపంచకప్ విజయంలో తెలుగమ్మాయి శ్రీచరణి కీలక పాత్ర పోషించింది. కడప జిల్లాకు చెందిన ఈ 21 ఏళ్ల స్పిన్నర్ 14 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచింది. రవిచంద్రన్ అశ్విన్ శ్రీచరణిని ప్రశంసించారు.
భారత మహిళల వన్డే ప్రపంచ కప్ విజయం దేశవ్యాప్తంగా అద్భుతమైన ఉత్సాహాన్ని నింపింది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో విజయం సాధించి, భారత మహిళల క్రికెట్ జట్టు తమ తొలి ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. ఈ అపురూప విజయానికి పలువురు క్రీడాకారులు కృషి చేయగా, వారిలో తెలుగు తేజం నల్లపరెడ్డి శ్రీచరణి ప్రదర్శన అత్యంత కీలకమైనదిగా నిలిచింది.
25
ప్రపంచ కప్ ఆడిన తొలి క్రికెటర్‌గా..
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల ఈ యువ స్పిన్నర్ టోర్నీ అంతటా తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కలవరపెట్టింది. మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 కీలక వికెట్లు పడగొట్టి, జట్టు విజయంలో భాగస్వామి అయ్యింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచ కప్ ఆడిన తొలి క్రికెటర్‌గా శ్రీచరణి గుర్తింపు పొందింది. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుపై లీగ్ మ్యాచ్‌తో పాటు సెమీఫైనల్లో ఆమె అద్భుత ప్రదర్శన కనబరిచి ఆసిస్ పతనాన్ని శాసించింది.
35
శ్రీచరణి ప్రదర్శన అద్భుతం
సెమీఫైనల్ ఓటమి తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ కూడా శ్రీచరణి ప్రమాదకరమైన బౌలర్ అని అనడం.. శ్రీచరణి ఎంత డేంజర్ బౌలర్ అని చెప్పడానికి నిదర్శనం. భారత మహిళల జట్టు సాధించిన ఈ చారిత్రక విజయంపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా శ్రీచరణి ప్రదర్శన అద్భుతమని, భవిష్యత్తులో ఆమె తప్పకుండా సూపర్‌స్టార్ బౌలర్ అవుతుందని అశ్విన్ జోస్యం చెప్పారు.
శ్రీచరణి బౌలింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉందని కొనియాడిన ఆయన, ఆమె బంతిని తిప్పే విధానం, వేగం, బౌలింగ్ టెక్నిక్‌ను ప్రపంచంలోని గొప్ప స్పిన్నర్లయిన సోఫీ ఎక్లిస్టోన్, జెస్ జొనాసెన్ వంటి టాప్ బౌలర్లతో పోల్చారు. భారత మహిళల జట్టు సాధించిన ఈ విజయాన్ని అశ్విన్ ఇతర ప్రపంచ విజయాల కంటే ఎంతో గొప్పదిగా అభివర్ణించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఉమెన్స్ జట్టు ప్రపంచ కప్ ట్రోఫీని నేరుగా తీసుకువెళ్లి మాజీ దిగ్గజ క్రికెటర్లయిన మిథాలీరాజ్, ఝులన్ గోస్వామి వంటి వారికి అందించడాన్ని అశ్విన్ ప్రత్యేకంగా అభినందించారు.
55
పరోక్షంగా పురుషుల జట్టుపై విమర్శలు
భారత పురుషుల జట్టు గతంలో ఇలా ఎప్పుడూ చేయలేదని, మాజీ ఆటగాళ్లకు క్రెడిట్ ఇవ్వడాన్ని చూడలేదని అశ్విన్ పరోక్షంగా పురుషుల జట్టు వైఖరిని ప్రస్తావించారు. భారత మహిళల జట్టు సాధించిన ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ కాదని, ఇది దేశంలో మహిళా క్రికెట్ భవిష్యత్తుకు ఒక మైలురాయని అశ్విన్ పేర్కొన్నారు.