టీమిండియా వన్డే క్రికెట్‌కు ఆ ఇద్దరే ప్రాణం.. కోహ్లీ సూపర్ ఫామ్‌కు కారణం ఇదే..

Published : Jan 14, 2026, 10:06 PM IST

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. టెస్టులు, టీ20ల నుంచి వైదొలగి వన్డేలపై పూర్తి ఏకాగ్రతతో ఉండటం వల్లే వింటేజ్ కోహ్లీ తిరిగి వచ్చాడని రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు.  

PREV
15
వన్డేల్లో సూపర్ ఫామ్..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ విమర్శకుల నోళ్లు మూయిస్తున్నాడు. దీంతో కోహ్లీ రిటైర్మెంట్ పై జరుగుతున్న చర్చలన్నిటికీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో కోహ్లీ అద్భుత ఫామ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ఆటతీరు గురించి అశ్విన్ మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ తన కెరీర్ విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చాడని పేర్కొన్నాడు. అది అతని ఆటలో స్పష్టంగా కనిపిస్తోంది. టెస్టులు, టీ20ల నుంచి వైదొలగడం ద్వారా తన పూర్తి శక్తిని, ఏకాగ్రతను కేవలం వన్డే క్రికెట్‌పైనే ఉంచడానికి అతను నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయమే అతన్ని మళ్లీ మునుపటి వింటేజ్ కోహ్లీలా మార్చిందని అశ్విన్ విశ్లేషించాడు.

25
అప్పుడు రిటైర్మెంట్ పై అనేక వార్తలు..

గతంలో కోహ్లీ ఫామ్ కోల్పోయినప్పుడు అతని రిటైర్మెంట్‌పై అనేక వార్తలు వచ్చాయి. దీనిపై అశ్విన్ స్పందిస్తూ, కొంతకాలం క్రితం వరకు అందరూ విరాట్ వయసు మీద పడిందని, అతను తప్పుకోవాలని చర్చించుకున్నారని గుర్తుచేశాడు. కానీ విరాట్ లాంటి పోటీతత్వం ఉన్న ఆటగాడు అలాంటి విమర్శలను తేలిగ్గా తీసుకోడని, 'నన్ను మీరు ఇంకా అనుమానిస్తున్నారా?' అని అడిగేలా అతని ఆట తీరు ఉందని అశ్విన్ అన్నాడు. దక్షిణాఫ్రికాపై వరుస సెంచరీలు, తాజాగా న్యూజిలాండ్‌పై అద్భుత ప్రదర్శన, ఇవన్నీ అతను ఎంత పట్టుదలగా ఉన్నాడో తెలియజేస్తున్నాయని అశ్విన్ తెలిపాడు.

35
కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్

ఇక కోహ్లీ ప్రస్తుతం 37వ ఏట అడుగు పెట్టినప్పటికీ అతని బ్యాటింగ్ టెక్నిక్‌లో వచ్చిన మార్పులను అశ్విన్ గమనించాడు. గత రెండేళ్లతో పోలిస్తే కోహ్లీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇప్పుడు చాలా తక్కువగా ఉందని, ఇది బంతిని టైమింగ్ చేయడంలో, లెంగ్త్‌ ను సరిగ్గా అంచనా వేయడంలో అతనికి ఎంతో సహాయపడుతుందని అశ్విన్ వివరించాడు. అందుకే విజయ్ హజారే ట్రోఫీ లాంటి దేశవాళీ టోర్నీలో ఆడి తన రిథమ్‌ను తిరిగి పొందడం అతని అంకితభావానికి నిదర్శనమని కొనియాడాడు.

45
వన్డే క్రికెట్ భవిష్యత్తు..

అలాగే వన్డే క్రికెట్ భవిష్యత్తు గురించి కూడా అశ్విన్ ఆందోళన వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌కు వెన్నెముక లాంటివారని, వారు ఆడిన ప్రతి మ్యాచ్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య, క్రేజ్ మరెవరికీ రాదని అశ్విన్ అన్నాడు. 2027 ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు రిటైర్ అయితే వన్డే ఫార్మాట్ నెమ్మదిగా తన ఉనికి కోల్పోతుందని అశ్విన్ ఆందోళన వ్యక్తం చేశాడు. అందుకే ఈ ఫార్మాట్‌ను బతికించుకోవాలంటే ఈ ఇద్దరు దిగ్గజాలు వీలైనంతకాలం ఆడాలి అని అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

55
తర్వాతి తరం ఆటగాళ్లకు ఒక పాఠం..

కాగా కోహ్లీ ప్రదర్శన కేవలం పరుగులు చేయడమే కాదని, తర్వాతి తరం ఆటగాళ్లకు ఒక పాఠంలా ఉంటుందని అశ్విన్ అన్నాడు. సుదీర్ఘ కెరీర్ కోసం ఎలాంటి త్యాగాలు చేయాలి, ఎలా కట్టుబడి ఉండాలి అనే విషయాల్లో కోహ్లీ ఒక రోల్ మోడల్ అని ప్రశంసించాడు. మొత్తానికి విరాట్ కోహ్లీ తన కెరీర్ చివరి అంకంలో కూడా మరింత ప్రమాదకరంగా మారాడని, 2027 ప్రపంచకప్ వరకు అతని జోరు కొనసాగడం భారత జట్టుకు అత్యంత అవసరం అని అశ్విన్ అన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories