పాక్ క్రికెట్‌ను దారిలో పెట్టాలంటే.. కచ్చితంగా భారత్ విజయాలను అధ్యయనం చేయాల్సిందే

Published : Dec 26, 2025, 07:05 PM IST

Pakistan Cricket: పాకిస్థాన్ చీఫ్ సెలెక్టర్ అకిబ్ జావేద్ భారత వైట్ బాల్ క్రికెట్ విజయాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. పాకిస్థాన్ క్రికెట్ ను మెరుగుపరచడానికి భారత్ లోని వ్యవస్థాగత విజయాలను పాఠాలుగా తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

PREV
15
వైట్ బాల్ క్రికెట్‌లో భారత్‌కు తిరుగులేదు..

భారత జట్టు వైట్ బాల్ క్రికెట్‌లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అకిబ్ జావేద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ క్రికెట్‌ను సరైన దారిలో పెట్టడానికి తాను భారత విజయాలను నిశితంగా గమనిస్తున్నానని ఆయన తెలిపారు. పాక్ క్రికెట్‌ను మరింత మెరుగుపరచడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నామని జావేద్ పేర్కొన్నారు. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ పోడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు.

25
నిలకడగా ఆడుతున్న భారత్..

అన్ని టోర్నమెంట్లలో భారత్ నిలకడగా రాణిస్తుండటం ఏ దేశానికైనా దీర్ఘకాలిక విజయానికి స్పష్టమైన పాఠాలను అందిస్తుందని జావేద్ అన్నారు. ఇటీవలి కాలంలో భారత్ వరుస విజయాలు సాధిస్తోంది. గత ఏడాది కరేబియన్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024ను భారత్ సొంతం చేసుకుంది.

35
ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచింది..

ఈ ఏడాది దుబాయ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలిచింది. ఇక ఇటీవల సెప్టెంబర్ లో జరిగిన ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్థాన్ ను ఓడించిన విషయం తెలిసిందే. భారత్ కనబరిచిన ఈ నిలకడైన ప్రదర్శన వ్యక్తుల కంటే వ్యవస్థల నుంచి వస్తుందని తాను నమ్ముతున్నట్లు అకిబ్ వివరించారు. పాకిస్థాన్ క్రికెట్ వ్యవస్థలో ప్రాథమిక విషయాలను కూడా సరిగ్గా చేయడంలో వెనుకబడిపోయాం అని తాను అనుకుంటున్నట్లు ఆయన అంగీకరించారు.

45
వ్యవస్థ మారాలి.. అప్పుడే.!

కెప్టెన్, కోచ్ లేదా సెలెక్టర్‌గా ఎవరిని నియమించినా, నాణ్యమైన ప్రతిభ లేకపోతే ఏమీ మారదని జావేద్ స్పష్టం చేశారు. అలాంటి ప్రతిభ మంచి మౌలిక సదుపాయాలు, పోటీతత్వంపై ఆధారపడి ఉంటుందని, అవి సరిగ్గా ఉంటేనే మంచి ప్రతిభ బయటకు వస్తుందని ఆకిబ్ జావేద్ వివరించారు. పాక్ క్రికెట్ లో గతంలో లోపాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం పయనిస్తున్న దిశ సానుకూలంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

55
2026 టీ20 ప్రపంచకప్ మాకు అనుకూలం..

2026లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ సమయం తమకు చాలా అనుకూలంగా ఉందని ఆయన చెప్పారు. తమ మ్యాచ్ లన్నీ శ్రీలంకలో ఆడటం పాకిస్థాన్ కు అనుకూలంగా ఉంటుందని జావేద్ పేర్కొన్నారు. ప్రపంచకప్ ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికాలో జరిగి ఉంటే, తను భిన్నంగా ఆలోచించి ఉండేవాడినని, కానీ జట్టు బాగా రాణించడానికి ఇదే సరైన సమయం అని ఆయన చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ క్రికెట్ ను తిరిగి ఉన్నత స్థితికి తీసుకురావడానికి భారత్ విజయాలను అధ్యయనం చేయడం కీలకమని అకిబ్ జావేద్ స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories