జావెలిన్ కొనడానికి కూడా డబ్బు లేదు.. ఇప్పుడు ఒలింపిక్ రికార్డు సృష్టించాడు.. ఎవ‌డ్రా ఈ అర్ష‌ద్ న‌దీమ్?

First Published | Aug 9, 2024, 5:01 PM IST

Arshad Nadeem : పారిస్ ఒలింపిక్స్ 2024 లో భార‌త గోల్డెబ్ బాయ్ నీర‌జ్ చోప్రాకు షాకిచ్చాడు అర్ష‌ద్ న‌దీమ్. ఏకంగా 92.97 మీట‌ర్లు జావెలిన్ త్రో తో ఒలింపిక్ రికార్డు సృష్టిస్తూ గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్నాడు. అసలు ఎవ‌రీ అర్ష‌ద్ న‌దీమ్? 
 

Arshad Nadeem : జావెలిన్ కొనడానికి కూడా డబ్బు లేని దుర్బ‌ర ప‌రిస్థితుల నుంచి ఇప్పుడు ఒలింపిక్ ఛాంపియ‌న్ గా.. గ‌త రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డంతో పాటు స‌రికొత్త చ‌రిత్ర లిఖించాడు అర్ష‌ద్ న‌దీమ్. పారిస్ ఒలింపిక్స్ 2024 లో భార‌త గోల్డెబ్ బాయ్ నీర‌జ్ చోప్రాకు షాకిచ్చాడు అర్ష‌ద్ న‌దీమ్. ఏకంగా 92.97 మీట‌ర్లు జావెలిన్ త్రో తో ఒలింపిక్ రికార్డు సృష్టిస్తూ గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్నాడు. ఎవ‌రీ అర్ష‌ద్ న‌దీమ్?   

తమ దేశం నుంచి పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లే 7 మంది ఆటగాళ్ల ఖర్చులను ఎవరు భరించాలని పాకిస్థాన్ నేషనల్ స్పోర్ట్స్ బోర్డ్ నిర్ణయించినప్పుడు, అర్షద్ నదీమ్, అతని కోచ్ మాత్రమే అర్హులని గుర్తించింది. కేవ‌లం వీరి ఖ‌ర్చుల‌ను మాత్ర‌మే పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డ్ భరించింది. ఇప్పుడు పాక్ కు పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడ‌ల్ తిరిగొచ్చాడు అర్ష‌ద్ న‌దీమ్. పంజాబ్ ప్రాంతంలోని ఖనేవాల్ గ్రామానికి చెందిన ఈ 27 ఏళ్ల ఆటగాడు గురువారం కొత్త ఒలింపిక్ రికార్డుతో జావెలిన్ త్రోలో బంగారు పతకాన్ని గెలుచుకుని పీసీబీ త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాడు. గోల్డెన్ బాయ్ గా పారిస్ చేరిన భార‌త అథ్లెట్ నీర‌జ్ చోప్రాకు షాకిస్తూ.. 11 మ్యాచ్‌ల్లో అర్షద్ నదీమ్ నీరజ్ చోప్రాను అధిగమించడం ఇదే తొలిసారి. నీరజ్ చోప్రా తన కెరీర్‌లో ఇంకా 90 మీటర్ల జావెలిన్ త్రో చేయలేకపోయాడు, అయితే అర్షద్ నదీమ్ ఇప్పటికే ఈ ఫీట్ సాధించాడు.

Latest Videos


ఒకానొక స‌మ‌యంలో స‌మ‌యంలో అర్షద్ నదీమ్ వ‌ద్ద త‌న కోసం జావెలిన్ కొనడానికి కూడా డబ్బు లేదు. అర్షద్ నదీమ్ తండ్రి మహ్మద్ అష్రఫ్ మాట్లాడుతూ.. 'అర్షద్ ఈ స్థితికి ఎలా చేరుకున్నాడో ప్రజలకు తెలియదు. అతని స్నేహితులు, గ్రామస్థులు, బంధువులు అతని కోసం నిధులు సేకరించేవారు, తద్వారా అతను ఇతర నగరాలకు వెళ్లి శిక్ష‌ణ తీసుకుంటూ పోటీలో పాల్గొన్నాడు' అని తెలిపారు. పాకిస్థాన్ మొత్తం ఏడుగురు ఆటగాళ్లను పారిస్‌కు పంపగా వారిలో ఆరుగురు తమ తమ ఈవెంట్‌ల ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. అర్షద్ నదీమ్ ఫైనల్స్‌కు అర్హత సాధించడంతో పాటు గోల్డ్ మెడ‌ల్ గెల‌వ‌డంతో అత‌నితో ప్రయాణించిన కుటుంబం, గ్రామం, దేశ‌ం ఇప్పుడు సంబ‌రాలు చేసుకుంటోంది.

అర్షద్ నదీమ్ గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. అర్షద్ నదీమ్ గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని, కామన్వెల్త్ గేమ్స్ 2022లో 90.18 మీటర్ల త్రోతో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. కెరీర్‌లో మోచేతి, మోకాలు, వెన్ను సమస్యలతో సతమతమవుతున్నా, ఇతర దేశాల ఆటగాళ్ల మాదిరిగా తగిన సౌకర్యాలు లేకపోయినా అర్షద్ నదీమ్ సాధించిన ఘనత పాకిస్థాన్ క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.

ఒలింపిక్స్‌లో పాకిస్థాన్‌కు 32 ఏళ్ల సుదీర్ఘ మెడల్ కరువును తొల‌గించాడు అర్ష‌ద్ న‌దీమ్. గతంలో పాకిస్థాన్ 1992లో ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ హాకీలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. దీంతో పాటు 40 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్‌లో పాకిస్థాన్‌కు బంగారు పతకాన్ని అందించడంలో అర్షద్ నదీమ్ స‌క్సెస్ అయ్యాడు. పాకిస్థాన్ చివరిసారిగా 1984 ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించింది.

click me!