దేవుడు పాకిస్థాన్ వైపు ఉన్నాడు: నీరజ్ చోప్రా

First Published | Aug 9, 2024, 11:08 AM IST

పాకిస్థాన్ వైపు దేవుడు ఉన్నాడని.. అర్షద్ నదీమ్‌కే స్వర్ణం దక్కడం దేవుడి నిర్ణయమని భారత్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా వ్యాఖ్యానించారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో రజతం సాధించిన అనంతరం ‘ఏసియానెట్‌’తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు.

పారిస్ ఒలింపిక్స్- 2024లో భార‌త్ మ‌రో పతకం గెలిచింది. ఇండియన్‌ స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రోలో రెండో మెడల్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. తన తిరుగులేని ప్రదర్శనతో జావెలిన్ త్రోలో రజతం సాధించాడు. పారిస్‌ గడ్డపై జరిగిన ఈ పోరులో 89.45 మీటర్లు విసిరి.. వరుసగా రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించిన భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పాడు.

పాకిస్థాన్‌ అథ్లెట్‌ అర్షద్ నదీమ్.. ఒలింపిక్ రికార్డును బ్రేక్ చేస్తూ ఏకంగా 92.97 మీటర్లు విసిరాడు. పారిస్‌ ఒలింపిక్స్‌- 2024లో తిరుగులేని విజేతగా నిలిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అలాగే, గ్రెనడాకు చెందిన పీటర్‌ 88.54 మీటర్లు విసిరి కాంస్యం దక్కించుకున్నాడు.

పారిస్‌ ఒలింపిక్స్‌- 2024లో రజత పతకం సాధించిన అనంతరం భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా ఏసియానెట్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడాడు. ‘దేశానికి పతకం సాధించడం గర్వకారణం. అర్షద్ నదీమ్‌కే స్వర్ణం దక్కడం దేవుడి నిర్ణయం. అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన నదీమ్‌కు అభినందనలు. ప్రపంచ క్రీడా వేదికపై మన జాతీయ గీతం వినిపించలేకపోయినందుకు బాధగా ఉంది. దేశం కోసం నేనింకా సాధించాల్సింది చాలా ఉంది. దేశానికి మరిన్ని సాధిస్తా..’ అని నీరజ్‌ చోప్రా తెలిపారు.


అర్షద్ 92.97 మీటర్లు విసిరినప్పుడు నీరజ్ చోప్రా కూడా 90 మీటర్లు దాటుతాడని అంతా భావించారు. కానీ ఫౌల్స్ కారణంగా అది సాధ్యం కాలేదు. ఇంకా అవకాశం ఉందనే నమ్మకం ఉంది. అతని అత్యుత్తమ ప్రదర్శన ఇంకా రాలేదు. కానీ తాను అత్యుత్తమ భారత అథ్లెట్‌గా మారానని తాను అనుకోవడం లేదని చెప్పాడు నీరజ్. ఆరు అవకాశాల్లో ఐదు ఫౌల్ చేసినా.. మిగిలిన ఒక్క అవకాశంలోనే నీరజ్ రజతం సాధించాడు. కానీ, 90 మీటర్లు దాటలేకపోవడంతో గోల్డ్ మిస్సయింది. పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరిన అర్షద్ నదీమ్... పాకిస్థాన్ తరఫున అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం సాధించాడు. దీంతో పాకిస్థాన్ 32 ఏళ్ల పతకాల నిరీక్షణకు తెరపడింది. టోక్యో ఒలింపిక్స్‌ 2020లో నీరజ్ చోప్రా భారతదేశం గర్వపడేలా ప్రదర్శన ఇచ్చాడు. అప్పుడు అర్షద్ నదీమ్‌ ఐదో స్థానంలో ఉన్నాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో అర్షద్ జావెలిన్‌లో 90 మీటర్లు విసిరి తన ప్రతిభను చాటుకున్నాడు. పారిస్‌లో జరిగిన ఫైనల్‌లో అర్షద్ మొదటి ఐదు దూరాల్లో మూడింటిని గెలుచుకున్నాడు. రెండుసార్లు 90 మీటర్లు దాటాడు. కాగా, జావెలిన్‌లో చెక్ స్టార్ జాన్ జెలెజ్నీ 98.48 మీటర్లు విసిరి.. ప్రపంచ రికార్డు సాధించాడు.

నీరజ్ చోప్రా ఎవరు?

ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో ఇండియాకి తొలి గోల్డ్ మెడ‌ల్ సాధించినన స్టార్ అథ్లెట్‌ నీర‌జ్ చోప్రా. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్- 2024లో మరో మెడల్‌ సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో భారత్‌కు మొదటి బంగారు పతకాన్ని అందించి చరిత్ర సృష్టించాడు. నీరజ్‌ స్వస్థలం హరియాణాలోని పానిపట్ సమీపంలోని ఖండ్రా గ్రామం. 1997 డిసెంబర్ 24న రైతు కుటుంబంలో జన్మించాడు. చండీగఢ్‌లోని దయానంద్ ఆంగ్లో- వేద కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాడు. క్రీడ‌ల్లోకి రాక‌ముందు నీర‌జ్.. భారీ కాయంతో ఉండేవాడు. దీంతో అత‌ని కుంటుంబం స్పోర్ట్స్‌ వైపు ప్రోత్సహించింది. అలా, క్రీడ‌ల్లోకి అడుగుపెట్టిన నీరజ్‌.. జావెలిన్ త్రో అథ్లెటిక్‌గా మారాడు. పానిపట్‌లోని శివాజీ స్టేడియంలో శిక్షణ మొదలుపెట్టాడు. ఏడాది శిక్షణ అనంతరం పంచకులలోని తౌ దేవి లాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చేరాడు. కోచ్ నసీమ్ అహ్మద్ పర్యవేక్షణలో జావెలిన్ త్రోతో పాటు లాంగ్ రన్నింగ్‌లో శిక్షణ పొందాడు.

నీరజ్ చోప్రా విజయ పరంపర...

నీరజ్ చోప్రా 2012 చివ‌ర‌లో అండ‌ర్-16 జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. 2014లో బ్యాంకాక్‌లో జరిగిన యూత్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్‌లో తొలిసారి అంతర్జాతీయ పతకం సాధించాడు. 2015లో చెన్నైలో జరిగిన ఇంటర్-స్టేట్ ఈవెంట్‌లో 77.33 మీటర్లు జావెలిన్‌ విసిరి జాతీయ సీనియర్ ఛాంపియన్‌షిప్‌లో తొలి మెడల్‌ గెలిచాడు. అదే ఏడాది కోల్‌కతాలో నేషనల్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. గౌహతిలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో 82.23 మీటర్లు జావెలిన్‌ విసిరి.. స్వర్ణ పతకం గెలిచాడు. 2016లో నమోదు చేసుకున్న ఈ విజయం నీరజ్‌ కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది. ఆ తర్వాత, 2018, 2022 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఛాంపియన్‌గా నిలవడంతో పాటు టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించాడు. 2022 డైమండ్ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.

Latest Videos

click me!