
ఇండోర్ లో ఆదివారం (జనవరి 18) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా న్యూజిలాండ్ జట్టు భారత్‌లో తొలిసారిగా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను కివీస్ 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ విజయంతో భారత్‌లో వన్డే సిరీస్ గెలవాలన్న న్యూజిలాండ్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. మూడో వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడినా, టీమిండియా 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఇండోర్ వన్డేలో గెలవడానికి భారత జట్టుకు 338 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించారు. అయితే, ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత జట్టు విఫలమైంది. 46 ఓవర్లలోనే 296 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయ్యింది. పరుగుల వేటలో విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశారు. కోహ్లీ 124 పరుగులతో మెరుపు సెంచరీ సాధించగా, హర్షిత్ రాణా అర్థ సెంచరీతో రాణించారు. వీరిద్దరి పోరాటం కేవలం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే పరిమితమైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ 137 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 106 పరుగులతో చెలరేగి జట్టుకు భారీ స్కోరును అందించారు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలో మరో అనూహ్యమైన, నిరాశాజనకమైన రికార్డు నమోదైంది. అక్టోబర్ 2024లో కోచింగ్ బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే, సొంతగడ్డపై కనీసం మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్ అయిన తొలి భారత కోచ్‌గా గంభీర్ నిలిచారు. 1955-56లో తొలిసారి భారత్‌లో పర్యటించిన న్యూజిలాండ్, అప్పటి వరకు ఎప్పుడూ భారత్‌లో టెస్ట్ సిరీస్ గెలవలేదు. కానీ గంభీర్ కోచింగ్‌లో ఆ జట్టు 3-0తో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2024లో న్యూజిలాండ్‌పై జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-3తో ఓడిపోయింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత జట్టు సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ కావడం అదే తొలిసారి. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లోనూ అదే తరహా ఫలితం పునరావృతమైంది. గంభీర్ కోచింగ్‌లో వన్డే సిరీస్ చేజారిపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
భారత గడ్డపై వన్డే సిరీస్ గెలవడానికి న్యూజిలాండ్ ఏకంగా 37 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. ఏడు వన్డే సిరీస్‌ల తర్వాత కివీస్ ఈ ఘనతను సాధించింది. ఇరు దేశాల మధ్య 50 ఓవర్ల సిరీస్ చరిత్ర 1988 డిసెంబర్‌లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 7 ద్వైపాక్షిక సిరీస్‌లు జరగ్గా, ప్రతీసారీ భారత్ ఆధిక్యం ప్రదర్శించింది.
న్యూజిలాండ్ జట్టు 1987 ప్రపంచ కప్ కోసం భారత్‌కు వచ్చినప్పటికీ, అది మల్టీ-నేషన్ టోర్నమెంట్. ద్వైపాక్షిక సిరీస్ పరంగా చూస్తే, 1988లో జరిగిన 4 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 4-0తో కివీస్‌ను చిత్తు చేసింది. జనవరి 2023లో జరిగిన వన్డే సిరీస్‌లోనూ భారత్ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఈసారి కథ మారింది. వడోదరలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ గెలిచినప్పటికీ, ఆ తర్వాత రాజ్‌కోట్, ఇండోర్‌లలో జరిగిన మ్యాచ్‌లలో న్యూజిలాండ్ విజయం సాధించి 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
భారత గడ్డపై జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల ఫలితాలు:
• 1988/89: భారత్ 4-0తో న్యూజిలాండ్‌ను ఓడించింది.
• 1995/96: భారత్ 3-2తో సిరీస్ గెలుచుకుంది.
• 1999/00: భారత్ 3-2 తేడాతో విజయం సాధించింది.
• 2010/11: భారత్ 5-0తో కివీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
• 2016/17: భారత్ 3-2తో సిరీస్ కైవసం చేసుకుంది.
• 2017/18: భారత్ 2-1తో గెలుపొందింది.
• 2023: భారత్ 3-0తో న్యూజిలాండ్‌ను ఓడించింది.
• 2026: న్యూజిలాండ్ 2-1తో సిరీస్‌ను గెలుచుకుంది.