సైలెంట్‌గా సైడ్ చేసేశారుగా.. షమీ కెరీర్ ఇక ముగిసినట్టేనా..?

Published : Nov 07, 2025, 07:43 PM IST

Mohammad Shami: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు మహమ్మద్ షమీని ఎంపిక చేయకపోవడం అతని కెరీర్‌పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ, 34 ఏళ్ల ఈ పేసర్‌ను సెలెక్టర్లు పక్కన పెట్టారు.  

PREV
15
షమీ స్పీడ్, స్వింగ్ చూస్తే..

భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ భవిష్యత్తుపై ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయకపోవడం ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. షమీ స్పీడ్, స్వింగ్ చూస్తే ఎవరైనా "ఏం బౌలింగ్" అనక తప్పదంటూ ప్రశంసలు కురిపిస్తారు. మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ ఎన్నో చేసి భారత జట్టుకు విజయాలు అందించిన షమీ, గత కొంతకాలంగా జట్టుకు దూరమయ్యాడు.

25
ఫిట్‌నెస్ లేదంటూ విమర్శలు

ఫిట్‌నెస్ లేదంటూ విమర్శలు ఎదుర్కొన్న షమీ, గతంలోనే ఏకంగా ఏడు వికెట్లు తీసి సెలక్టర్లకే సవాల్ విసిరాడు. అయినప్పటికీ, బీసీసీఐ సెలెక్టర్లు అతనికి మరోసారి షాక్ ఇచ్చారు. ఈనెల 14 నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు మహమ్మద్ షమీని పక్కన పెట్టారు. ఈ నిర్ణయంతో షమీ టెస్ట్ కెరీర్ ముగిసినట్లేనా అనే చర్చ మొదలైంది.

35
సెలెక్టర్లు మొండిచెయ్యి

ప్రస్తుతం షమీకి 34 ఏళ్లు. పూర్తి ఫిట్‌గా, అద్భుతమైన ఫాంలో ఉన్నప్పటికీ భారత సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్‌ల తర్వాత తాజాగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లకు కూడా అతన్ని దూరం పెట్టారు. షమీ చివరిసారిగా 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ ఆడాడు. అయితే, ఐపీఎల్ 2025లో ఆశించిన మేర రాణించలేకపోవడంతో భారత జట్టుకు దూరమయ్యాడు.

45
దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన

అయితే, ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో షమీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. బెంగాల్ తరఫున ఆడిన మూడు రంజీ మ్యాచ్‌లలో 15 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ముఖ్యంగా, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లు తీసి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. ఇంత అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ, దక్షిణాఫ్రికా-ఏతో తలపడే ఇండియా-ఏ జట్టులో కూడా షమీకి చోటు దక్కకపోవడం గమనార్హం. అదే సమయంలో గాయం నుంచి కోలుకున్న ఆకాశ్ దీప్ మాత్రం టీమిండియాకు ఎంపికయ్యాడు.

55
భారత టెస్ట్ టీం ప్రణాళికల్లో..

దీన్నిబట్టి చూస్తే, మహమ్మద్ షమీ భారత టెస్ట్ టీం ప్రణాళికల్లో లేడని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నప్పటికీ, వెటరన్ పేసర్‌ను సెలెక్టర్లు పక్కన పెట్టడం రెడ్ బాల్ క్రికెట్‌లో అతని భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షమీ లాంటి మ్యాచ్ విన్నర్‌కు మళ్లీ టెస్ట్ జట్టు నుంచి పిలుపు వస్తుందా లేదా అనేది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్రంగా వినిపిస్తున్న ప్రశ్న.

Read more Photos on
click me!

Recommended Stories