Year Ender 2025: వైభవ్ సూర్యవంశీ నుంచి ఆయుష్ మ్హత్రే వరకు.. టాప్ 7 భారత యంగ్ క్రికెటర్లు వీరే !

Published : Dec 29, 2025, 11:15 PM IST

Top 7 Young Indian Cricketers : 2025లో భారత యువ క్రికెటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే, అభిజ్ఞాన్ కుందు వంటి ఏడుగురు యంగ్ ప్లేయర్లు దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ లో సంచలనాలు సృష్టించారు. 

PREV
18
టీమిండియా భవిష్యత్తు వీరే.. 2025లో రికార్డులు బద్దలు కొట్టిన యువ సంచలనాలు !

భారత క్రికెట్ చరిత్రలో 2025వ సంవత్సరం అత్యంత కీలకమైన ఏడాదిగా నిలిచిపోనుంది. ఈ ఏడాది సీనియర్ ఆటగాళ్లే కాకుండా, దేశవాళీ, యువజన టోర్నీలలో యువ ఆటగాళ్లు తమ సత్తా చాటారు. ముఖ్యంగా అండర్-19 ఆసియా కప్, ఐపీఎల్, దేశవాళీ టోర్నీలలో భారత యువ రక్తం ఉప్పొంగింది. తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించి, భవిష్యత్తు స్టార్లుగా తమను తాము ప్రకటించుకున్నారు.

వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే, అభిజ్ఞాన్ కుందు వంటి వారు రికార్డుల మోత మోగించగా, ఆరోన్ జార్జ్, దీపేష్ దేవేంద్రన్ వంటి వారు తమ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. 2025లో తమ ప్రదర్శనతో ప్రత్యేకంగా నిలిచిన ఆ ఏడుగురు యువ భారతీయ క్రికెటర్ల గురించి, వారి రికార్డుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

28
1. వైభవ్ సూర్యవంశీ: 14 ఏళ్ల సంచలనం

భారత క్రికెట్ లో నెక్స్ట్ బిగ్ థింగ్ గా గుర్తింపు పొందుతున్న యంగ్ స్టార్ వైభవ్ సూర్యవంశీ. బీహార్‌కు చెందిన ఈ 14 ఏళ్ల ఈ కుర్రాడు 2025లో అసాధారణమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది అతనికి నిజంగానే ఒక కలల సంవత్సరం. తన అరంగేట్రం ఐపీఎల్ సీజన్ లోనే క్రికెట్ విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచేలా బ్యాటింగ్ చేశాడు.

కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ సహాయంతో ఏకంగా 252 పరుగులు సాధించాడు. ఐపీఎల్ మెగా టోర్నీలో 36 సగటుతో పరుగులు రాబట్టడం అతని ప్రతిభకు నిదర్శనం. ఐపీఎల్ లో చూపించిన జోరును అతను యూత్ వన్డే, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్‌లలోనూ కొనసాగించాడు.

ఐపీఎల్ తర్వాత కూడా సూర్యవంశీ తన ఫామ్ ను కోల్పోలేదు. ఆసియా కప్ ఎమర్జింగ్ స్టార్స్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా, అండర్-19 ఆసియా కప్‌లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్రపై 108 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో బీహార్, అరుణాచల్ ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 84 బంతుల్లోనే 190 పరుగులు చేసి రికార్డుల పుస్తకాలను తిరగరాశాడు.

38
2. ఆయుష్ మ్హత్రే: చెన్నై సూపర్ కింగ్స్ యువ కెరటం

ముంబైకి చెందిన ఆయుష్ మ్హత్రే 2025లో తన నాయకత్వ లక్షణాలతో, బ్యాటింగ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడిన ఆయుష్, ఏడు మ్యాచ్‌ల్లో 34.28 సగటుతో 240 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. ఈ ప్రదర్శన అతనికి భారత అండర్-19 జట్టు పగ్గాలు దక్కేలా చేసింది.

18 ఏళ్ల ఆయుష్ మ్హత్రే సారథ్యంలో భారత అండర్-19 జట్టు ఇంగ్లాండ్‌పై సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా, ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన యూత్ వన్డే, టెస్ట్ సిరీస్‌లను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

దేశవాళీ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆయుష్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. విదర్భ, ఆంధ్రా జట్లపై వరుసగా రెండు సెంచరీలు బాదాడు. ఈ ఫార్మాట్‌లో బ్యాక్-టు-బ్యాక్ సెంచరీలు సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

ప్రస్తుతం మణికట్టు గాయంతో బాధపడుతున్నప్పటికీ, ఈ ఏడాది యూత్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆయుష్ నిలిచాడు. ఏడు ఇన్నింగ్స్‌లలో 54.00 సగటుతో 378 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీలు ఉన్నాయి.

48
3. ఆరోన్ జార్జ్: కేరళ నుంచి వచ్చిన ఆణిముత్యం

ఇప్పటి వరకు భారత క్రికెట్ వర్గాల దృష్టిలో పడని పేరు ఆరోన్ జార్జ్. కానీ, ఇటీవల ముగిసిన అండర్-19 ఆసియా కప్ 2025లో తన ప్రదర్శనతో అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. కేరళకు చెందిన ఆరోన్ జార్జ్, యూత్ స్థాయిలో ఆడిన తన తొలి పెద్ద టోర్నీ ఇదే కావడం విశేషం.

ఆసియా కప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో వచ్చిన అవకాశాన్ని ఆరోన్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. యూఏఈ, పాకిస్తాన్, శ్రీలంక జట్లపై వరుసగా మూడు అర్ధ సెంచరీలు సాధించి హ్యాట్రిక్ కొట్టాడు. కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 76 సగటుతో 228 పరుగులు చేసి సత్తా చాటాడు.

ఆసియా కప్ 2025లో అతని నిలకడైన ప్రదర్శన అతనికి జనవరి 15న జరగనున్న అండర్-19 ప్రపంచ కప్ జట్టులో చోటు సంపాదించి పెట్టింది. కేవలం ఒకే ఒక్క టోర్నీతో ఆరోన్ జార్జ్ ఒక నమ్మకమైన టాప్-ఆర్డర్ బ్యాటర్‌గా తనను తాను నిరూపించుకున్నాడు.

58
4. అభిజ్ఞాన్ కుందు: డబుల్ సెంచరీ వీరుడు

ముంబైకి చెందిన మరో యువ సంచలనం అభిజ్ఞాన్ కుందు. అండర్-19 ఆసియా కప్ 2025లో మలేషియాపై రికార్డు స్థాయి ప్రదర్శన చేసే వరకు ఇతని పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, ఆ ఒక్క ఇన్నింగ్స్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. మలేషియాతో జరిగిన మ్యాచ్ లో 17 ఏళ్ల కుందు 125 బంతుల్లో 209 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు.

కేవలం 121 బంతుల్లోనే ద్విశతకాన్ని పూర్తి చేయడం విశేషం. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. మలేషియా బౌలర్లపై విరుచుకుపడిన కుందు 167.20 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు.

అండర్-19 ఆసియా కప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కుందు నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల్లో ఏకంగా 138.00 సగటుతో 276 పరుగులు సాధించాడు. ఈ ఏడాది యూత్ వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా కూడా నిలిచాడు. 10 మ్యాచ్‌ల్లో 56.16 సగటుతో 337 పరుగులు చేశాడు. టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్‌లలో 38.40 సగటుతో 192 పరుగులు సాధించాడు.

68
5. దీపేష్ దేవేంద్రన్: బౌలింగ్ లో భవిష్యత్తు ఆశాకిరణం

బ్యాటింగ్ లోనే కాదు, బౌలింగ్ లోనూ భారత యువకులు సత్తా చాటారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు దీపేష్ దేవేంద్రన్. తమిళనాడుకు చెందిన ఈ పేసర్ అండర్-19 ఆసియా కప్‌లో బంతితో మాయ చేశాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

ఐదు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. టోర్నీ అంతటా ప్రతి మ్యాచ్‌కు సగటున మూడు వికెట్లు తీయడం అతని సామర్థ్యానికి నిదర్శనం. దేవేంద్రన్ అద్భుతమైన బౌలింగ్ వల్లే టీమ్ ఇండియా ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఫైనల్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి పాలైంది.

యూత్ వన్డేల్లో దీపేష్ దేవేంద్రన్ 8 మ్యాచ్‌ల్లో 6 ఎకానమీ రేటుతో 12 వికెట్లు పడగొట్టాడు. సగటు 28.50. టెస్టుల్లోనూ తన సత్తా చాటాడు. మూడు మ్యాచ్‌ల్లో 20.66 సగటు, 3.62 ఎకానమీ రేటుతో 12 వికెట్లు తీశాడు. ఇందులో ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన ఘనత కూడా ఉంది.

78
6. విహాన్ మల్హోత్రా: నిలకడైన వైస్ కెప్టెన్

భారత అండర్-19 జట్టు వైస్ కెప్టెన్ గా విహాన్ మల్హోత్రా తన బాధ్యతలకు 100 శాతం న్యాయం చేశాడు. కెప్టెన్ ఆయుష్ మ్హత్రేకు డిప్యూటీగా వ్యవహరిస్తూ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. నాయకత్వ బాధ్యతలే కాకుండా, బ్యాటింగ్ లోనూ ముందుండి జట్టును నడిపించాడు.

అండర్-19 ఆసియా కప్ 2025లో టీమ్ ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా విహాన్ నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల్లో 39 సగటుతో 156 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

ఈ ఏడాది యూత్ వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విహాన్ రికార్డు సృష్టించాడు. 12 మ్యాచ్‌ల్లో 46.45 సగటుతో ఏకంగా 511 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లోనూ 4 మ్యాచ్‌ల్లో 54.00 సగటుతో 315 పరుగులు చేసి, రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

88
7. కనిష్క్ చౌహాన్: నమ్మదగ్గ ఆల్ రౌండర్

ఆధునిక క్రికెట్ లో ఆల్ రౌండర్ల ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఆ కొరతను తీర్చేలా కనిష్క్ చౌహాన్ ఎదిగాడు. టీమ్ ఇండియా అండర్-19 జట్టులో కనిష్క్ ఒక నమ్మదగ్గ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. 19 ఏళ్ల ఈ కుర్రాడు బ్యాట్, బాల్ రెండింటితోనూ ఆకట్టుకున్నాడు. యూత్ వన్డేల్లో భారత జట్టుకు మంచి సమతుల్యతను తీసుకొచ్చాడు.

అండర్-19 ఆసియా కప్‌లో ఐదు మ్యాచ్‌లాడిన కనిష్క్, 24.25 సగటుతో 97 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 24.42 సగటు, 5.02 ఎకానమీతో ఏడు వికెట్లు పడగొట్టాడు.

ఈ ఏడాది యూత్ వన్డేల్లో కనిష్క్ ఆల్ రౌండ్ షో అద్భుతం. 12 మ్యాచ్‌ల్లో 27 సగటుతో 216 పరుగులు చేయడమే కాకుండా, బౌలింగ్ లోనూ సత్తా చాటాడు. 22 సగటు, 4.28 ఎకానమీ రేటుతో 20 వికెట్లు తీశాడు. విశేషమేమిటంటే, ఈ ఏడాది యూత్ వన్డేల్లో టీమ్ ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కనిష్క్ చౌహానే కావడం గమనార్హం.

ఈ ఏడుగురు యువ ఆటగాళ్లు 2025లో తమ ప్రదర్శనతో భారత క్రికెట్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని చాటిచెప్పారు. రాబోయే రోజుల్లో వీరు సీనియర్ జట్టులో కూడా స్థానం సంపాదించి అదరగొట్టాలని చూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories