Lionel Messi: వంతారాలో మెస్సి సందడి.. అనంత్ అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ చూసి ఫిదా !

Published : Dec 16, 2025, 11:07 PM IST

Lionel Messi Visits Vantara : అనంత్ అంబానీ స్థాపించిన ‘వంతారా’ను ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి సందర్శించారు. అక్కడ హిందూ సంప్రదాయ పూజల్లో పాల్గొన్న మెస్సి, గాయపడిన ఏనుగు పిల్ల మణిలాల్‌తో ఫుట్‌బాల్ ఆడి సందడి చేశారు.

PREV
15
మెస్సి మనసు గెలుచుకున్న ‘వంతారా’.. మళ్లీ వస్తానంటూ ప్రశంసలు

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి భారతదేశంలోని జామ్‌నగర్‌కు విచ్చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా స్థాపించిన వన్యప్రాణుల రక్షణ, పునరావాస, సంరక్షణ కేంద్రమైన ‘వంతారా’ను మెస్సి ప్రత్యేకంగా సందర్శించారు. ప్రకృతి పట్ల గౌరవం, సకల జీవరాశుల పట్ల ప్రేమను బోధించే సనాతన ధర్మం ప్రకారం ఈ కేంద్రంలో ఏ కార్యమైనా ఆశీర్వాదాలతో ప్రారంభమవుతుంది.

ఈ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ, మెస్సి తన పర్యటనను హిందూ సంప్రదాయ పూజలతో ప్రారంభించారు. ఈ పర్యటనలో ఆయన సంరక్షణ కేంద్రంలోని వన్యప్రాణులను పరిశీలించడమే కాకుండా, అక్కడ పనిచేసే కేర్‌టేకర్లు, కన్జర్వేషన్ బృందాలతో ముచ్చటించారు. అనంత్ అంబానీతో మెస్సికి ఉన్న స్నేహ బంధం, వన్యప్రాణుల సంరక్షణ పట్ల వారిద్దరికీ ఉన్న ఉమ్మడి లక్ష్యం ఈ పర్యటనలో స్పష్టంగా కనిపించింది. మెస్సి తన విలక్షణమైన వినయం, మానవతా విలువలతో అందరినీ ఆకట్టుకున్నారు.

25
వంతారాలో మెస్సి కి ఘన స్వాగతం

లియోనల్ మెస్సి తన ఇంటర్ మియామి సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌లతో కలిసి జామ్‌నగర్ చేరుకున్నారు. వీరికి భారతీయ సంప్రదాయ పద్ధతిలో అత్యంత ఘన స్వాగతం లభించింది. జానపద సంగీత వాయిద్యాల నడుమ, ఆశీర్వాదాలకు, స్వచ్ఛతకు ప్రతీకగా వారిపై పూల వర్షం కురిపించారు. ఆ తర్వాత వారికి సంప్రదాయ హారతి ఇచ్చి ఆహ్వానించారు.

భారతీయ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ, మెస్సి దేవాలయంలో జరిగిన మహా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అంబే మాత పూజ, గణేశ పూజ, హనుమాన్ పూజ, శివాభిషేకంలో ఆయన పాలుపంచుకున్నారు. సకల జీవరాశుల పట్ల గౌరవం అనే భారతీయ తత్వాన్ని అనుసరిస్తూ, ప్రపంచ శాంతి, ఐక్యత కోసం ఆయన ప్రార్థనలు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మెస్సికి భారతీయ సంస్కృతిపై ఉన్న గౌరవాన్ని చాటిచెప్పాయి.

35
వంతారా ఎకోసిస్టమ్, ఆసుపత్రి సందర్శనలో మెస్సి

సాంప్రదాయ స్వాగతం అనంతరం, మెస్సి వంతారాలోని విస్తారమైన కన్జర్వేషన్ ఎకోసిస్టమ్‌ను సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా రక్షించిన పెద్ద పులులు, ఏనుగులు, శాకాహార జంతువులు, సరీసృపాలు, జంతు పిల్లలకు ఈ కేంద్రం ఆశ్రయం కల్పిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా మెస్సి గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్, ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ కాంప్లెక్స్‌ను కూడా సందర్శించారు. అక్కడి కార్యకలాపాల స్థాయిని, అనంత్ అంబానీ విజన్‌ను చూసి మెస్సి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సింహాలు, చిరుతపులులు, పులులు, ఇతర అంతరించిపోతున్న జాతుల కోసం ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రంలో మెస్సి జంతువులతో గడిపారు. ప్రకృతిసిద్ధమైన వాతావరణంలో పెరుగుతున్న అనేక జంతువులు మెస్సిని చూసి కుతూహలంతో దగ్గరకు వచ్చాయి. అనంతరం ఆయన హెర్బివోర్ కేర్ సెంటర్, రెప్టైల్ కేర్ సెంటర్‌లను సందర్శించారు. అక్కడ జంతువులకు అందిస్తున్న ప్రత్యేక వెటర్నరీ సేవలు, పోషకాహారం, బిహేవియరల్ ట్రైనింగ్ వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు.

వన్యప్రాణుల సంక్షేమంలో వంతారా ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తోందని ఆయన కొనియాడారు. మల్టీ స్పెషాలిటీ వన్యప్రాణి ఆసుపత్రిని సందర్శించిన మెస్సి, అక్కడ జరుగుతున్న క్లినికల్, సర్జికల్ ప్రొసీజర్‌లను ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం ఒకాపీలు, ఖడ్గమృగాలు, జిరాఫీలు, ఏనుగులకు స్వయంగా ఆహారాన్ని తినిపించారు. భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణకు భారత ప్రధానమంత్రి ఇస్తున్న సపోర్టును కూడా మెస్సి ఈ సందర్భంగా ప్రశంసించారు.

45
సింహం కూనకు ‘లియోనల్’ అని పేరు

అనాథగా మారిన, ప్రమాదంలో ఉన్న జంతు పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోస్టర్ కేర్ సెంటర్‌ను మెస్సి సందర్శించారు. అక్కడ పెరుగుతున్న జంతువుల స్థితిగతులు, అవి కోలుకుంటున్న తీరు గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అనంత్ అంబానీ, రాధికా అంబానీ కలిసి ఒక సింహం కూనకు లియోనల్ అని నామకరణం చేశారు. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి గౌరవార్థం ఈ పేరు పెట్టారు. ఈ పేరు భవిష్యత్తుపై ఆశకు, ప్రయాణానికి నిదర్శనంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

ఏనుగు పిల్ల మణిలాల్‌తో ఫుట్‌బాల్ ఆడిన మెస్సి

మెస్సి పర్యటనలో అత్యంత ఆకర్షణీయమైన ఘట్టం ఎలిఫెంట్ కేర్ సెంటర్‌లో చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం కలప పరిశ్రమలో కఠినమైన పరిస్థితుల నుంచి రక్షించిన ‘మణిలాల్’ అనే ఏనుగు పిల్లను మెస్సి కలిశారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లి ప్రతిమతో పాటు మణిలాల్‌ను వంతారా బృందం రక్షించింది.

అందరి మనసులను హత్తుకునేలా, మెస్సి మణిలాల్‌తో కలిసి కాసేపు ఫుట్‌బాల్ ఆడారు. ఆట అనేది విశ్వవ్యాప్త భాష అని నిరూపిస్తూ, మెస్సి చేసిన ఈ ప్రయత్నానికి ఏనుగు పిల్ల ఉత్సాహంగా స్పందించింది. మణిలాల్ కూడా బంతిని తన్నుతూ తన నైపుణ్యాలను ప్రదర్శించడం విశేషం. ఈ దృశ్యం మెస్సి భారత పర్యటనలోనే అత్యంత గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా నిలిచింది.

55
మెస్సి ప్రశంసలు.. ముగింపుగా ఘనమైన వేడుకలు

వన్యప్రాణుల పట్ల, మానవాళి పట్ల నిస్వార్థ సేవ చేస్తున్నందుకు అనంత్ అంబానీకి మెస్సి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మెస్సి స్పానిష్ భాషలో స్పందిస్తూ, "వంతారా చేస్తున్న పని నిజంగా అద్భుతం. ఇక్కడ జంతువులకు అందిస్తున్న సేవ, వాటిని రక్షించి సంరక్షిస్తున్న తీరు ఎంతో గొప్పగా ఉంది. ఇది నిజంగా ఆకట్టుకునే విషయం. మేం ఇక్కడ చాలా అద్భుతమైన సమయాన్ని గడిపాము, ఎంతో హాయిగా అనిపించింది. ఈ అనుభవం ఎప్పటికీ మాతో ఉంటుంది. ఈ గొప్ప పనికి సపోర్టు చేయడానికి, స్ఫూర్తిని నింపడానికి మేము కచ్చితంగా మళ్లీ ఇక్కడికి వస్తాము" అని పేర్కొన్నారు.

పర్యటన ముగింపులో శుభప్రదమైన ఆరంభాలకు, సద్భావనకు ప్రతీక అయిన నారియల్ ఉత్సర్గ్, మట్కా ఫోడ్ వంటి సంప్రదాయ ఆచారాలలో మెస్సి పాల్గొన్నారు. శాంతి, శ్రేయస్సు కోసం చేసిన మంత్రోచ్చారణలతో ఈ కార్యక్రమం ముగిసింది. సోషల్ కాజ్, విద్య, ఆరోగ్యం, పిల్లల సంక్షేమం కోసం పనిచేస్తున్న లియో మెస్సి ఫౌండేషన్ లక్ష్యాలు, వంతారా మిషన్‌తో సరిపోలుతున్నాయని మెస్సి తెలిపారు. సైన్స్ ఆధారిత జంతు సంరక్షణ పట్ల వంతారాకు ఉన్న విజన్‌ను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు.

Read more Photos on
click me!

Recommended Stories