Jemimah Rodrigues: 2022 ప్రపంచ కప్‌లో చోటు కోల్పోయిన తర్వాత జెమీమా రోడ్రిగ్స్ మానసిక సవాళ్లను అధిగమించి తిరిగి రాణించింది. పడిలేచిన కెరటంలా ఎంతో మందికి ప్రేరణాత్మక కథగా నిలిచింది.
జెమీమా రోడ్రిగ్స్: అప్పుడు పక్కన పెడితే.. ఇప్పుడు కప్పుకు చేరువ చేసింది !
ప్రతి క్రీడాకారుడి కెరీర్‌లో ఎత్తుపల్లాలు కనిపిస్తుంటాయి. భారత మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ కూడా అలాంటి ప్రయాణంలోనే ముందుకు సాగింది. కానీ, ఆ ప్రయాణంలో ఎంతో ప్రత్యేకం. ఇప్పుడు కోట్లాది మంది నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఆమె జీవితంలో ఎన్నో కఠినమైన పరీక్షలు, నిరాశలు, ఆత్మవిశ్వాసం కోల్పోవడం అన్నీ చోటు చేసుకున్నప్పటికీ, ఆమె తిరిగి రాణించిన తీరు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ఒకప్పుడు టీమ్ నుంచి పక్కన పెడితే.. ఇప్పుడు కప్పుకు చేరువ చేసింది జెమీమా రోడ్రిగ్స్ !
25
జెమీమా రోడ్రిగ్స్: బాల్యంలో కఠోర శ్రమ
జెమీమా రోడ్రిగ్స్ చిన్న వయస్సు నుండే కఠోర శ్రమతో తన ప్రయాణం సాగించారు. ముంబైలో పుట్టి పెరిగిన ఆమె ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటలకు లేచి, సోదరులతో కలిసి ముంబై లోకల్ రైలులో ప్రయాణించి ప్రాక్టీస్‌కు వెళ్ళేది.
పురుషుల మధ్య శిక్షణ పొందిన జెమీమా కేవలం 8 ఏళ్ల వయస్సులోనే 24, 28 ఏళ్ల ఆటగాళ్లతో పోటీ పడింది. శారీరకంగా చిన్నదైన ఆమెకు కండబలం పెద్దగా లేకపోవడం వల్ల టెక్నిక్, టైమింగ్‌పైనే ఆధారపడింది. ఇదే ఆమెను ప్రత్యేకమైన ప్లేయర్ గా మార్చింది.
35
జెమీమా రోడ్రిగ్స్: 2022 ప్రపంచ కప్ నుండి అవుట్
2022 మహిళల వన్డే ప్రపంచ కప్ స్క్వాడ్ నుండి తన పేరును తొలగించడం జెమీమా రోడ్రిగ్స్ కెరీర్‌లోని అత్యంత బాధాకరమైన క్షణం. ఆమె కలల వేదికగా భావించిన ప్రపంచ కప్ ఆడే అవకాశం కోల్పోయింది.
ఆ సమయంలో తాను ఆశ వదులుకోవాలని అనుకున్నానని, దేశం కోసం మరోసారి ఆడగలనో లేదో అన్న సందేహం కలిగిందని ఆమె తెలిపింది. తల్లిదండ్రుల ముందు ధైర్యంగా కనిపించేందుకు ప్రయత్నించినా, లోలోపల తీవ్ర నిరాశతో తల్లడిల్లింది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. ప్రాక్టీస్‌కు వెళ్లాలంటే కూడా భయం వేసిన క్షణాలను అనుభవించారు.
ఒక రోజు వంటగదిలో టీ చేస్తుండగా, ఆమె తల్లి "జెమ్, నేను నీ తల్లిని. నీకు ఇప్పుడెలా ఉందో నాకు తెలుసు" అని అన్న మాటలతో ఆమె కన్నీరు పెట్టుకుందని తెలిపారు. ఆ క్షణం ఆమె జీవితాన్ని మార్చిన మలుపుగా మారింది. అప్పటి నుంచి మళ్లీ తిరిగి ట్రాక్ లోకి వచ్చింది.
జెమీమా రోడ్రిగ్స్ తన మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి కృషి చేసింది. ఒక వారం విరామం తీసుకుని, కొత్త ఉత్సాహంతో తిరిగి శిక్షణ ప్రారంభించింది. ప్రతి వారం బాగా ప్రాక్టీస్ చేసినందుకు, ఆమె తనకు తాను చిన్న బహుమతులు ఇచ్చుకునేది.. అంటే ఒక కాఫీ, చీట్ మీల్ లేదా షాపింగ్ లాంటి సాధారణ ఆనందాలు ఇందులో ఉన్నాయి.
ఆ సమయం ఆమెకు తన ఆటను, తన ఆలోచనలను మరింతగా అర్థం చేసుకోవడానికి సహాయపడింది. “ఒక్కోసారి బాగా లేకపోవడం కూడా పెద్ద సమస్య కాదు.. ఏం పర్వాలేదు” అని అంగీకరించడం ఆమెను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లింది.
55
జెమీమా రోడ్రిగ్స్: ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన క్షణం
తన ప్రయాణం గురించి జెమీమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ అనుకునేదాన్ని, విజయం లభించినప్పుడు మాత్రమే గొప్పగా భావిస్తారు. కానీ నిజమైన పరీక్ష, మనకు అనుకూలంగా లేని సమయంలో మనం ఎలా నిలబడతామన్నదే. పడిపోయిన తర్వాత లేవడం నేర్చుకోవడం అత్యంత ముఖ్యమైనది” అని అన్నారు.
ఈ ఆత్మవిశ్వాసం ఆమెను మళ్లీ భారత జట్టులో స్థానం సంపాదించేలా చేసింది. కష్టపడి, అంకితభావంతో పనిచేస్తే ఫలితం తప్పక లభిస్తుందనేది ఆమె జీవితం ఇచ్చిన గొప్ప పాఠం ఇది. జెమీమా రోడ్రిగ్స్ కథ కేవలం క్రీడాకారిణి విజయగాథ మాత్రమే కాదు.. అది ప్రతి కష్టంలోనూ నిలబడి, కొత్తగా ప్రారంభించే ధైర్యానికి ప్రతీక అని చెప్పవచ్చు. తన ఆటను ప్రేమించిన ఆమె, మళ్లీ మైదానంలో అడుగుపెట్టి, “విఫలం అంతం కాదు, కొత్త ప్రారంభం మాత్రమే” అని నిరూపించింది.