
ముంబై లో శనివారం జరిగిన సమావేశంలో బీసీసీఐ సెలెక్టర్లు టీ20 వరల్డ్ కప్ 2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఈ ఎంపికలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ రీఎంట్రీ. దాదాపు రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న కిషన్, దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో తిరిగి జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.
మరోవైపు, స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ జితేష్ శర్మలకు ఈ మెగా టోర్నీ భారత జట్టులో చోటు దక్కలేదు. ఫినిషర్ పాత్ర కోసం రింకూ సింగ్‌పై సెలెక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు.
గత కొంతకాలంగా టీమిండియా టీ20 ప్రణాళికల్లో ఇషాన్ కిషన్ పేరు ఎక్కడా వినిపించలేదు. వికెట్ కీపర్ల రేసులో సంజూ శాంసన్, జితేష్ శర్మ, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇషాన్ కిషన్ చివరిసారిగా 28 నవంబర్ 2023న ఆస్ట్రేలియాపై టి20 మ్యాచ్ ఆడారు.
ఆ తర్వాత క్రమశిక్షణ చర్యలు, సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం వంటి కారణాలతో ఆయన జట్టుకు దూరమయ్యారు. సుమారు 753 రోజుల పాటు టీమిండియా జెర్సీకి దూరంగా ఉన్న కిషన్, ఆశ వదులుకోకుండా దేశవాళీ క్రికెట్‌లో పరుగులు వరద పారించారు. బుచ్చి బాబు టోర్నమెంట్, రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలో నిలకడగా రాణించారు. ఈ కఠోర శ్రమ ఫలితంగానే ఇప్పుడు నేరుగా వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇషాన్ కిషన్ ఎంపికకు ప్రధాన కారణం ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో అతని ప్రదర్శన. జార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కిషన్, తన జట్టును తొలిసారి ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇషాన్ కేవలం 10 మ్యాచ్‌ల్లో 57.44 సగటుతో ఏకంగా 517 పరుగులు సాధించాడు. ఇందులో ఆయన స్ట్రైక్ రేట్ 197.33గా ఉండటం విశేషం. టోర్నీలో అత్యధికంగా 33 సిక్సర్లు బాదిన రికార్డు కూడా కిషన్ సొంతం. హర్యానాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో జట్టుకు ట్రోఫీని అందించాడు.
ఈ గణాంకాలే సెలెక్టర్లను ఆకర్షించాయి. అజిత్ అగార్కర్, సూర్యకుమార్ యాదవ్ టీమ్ కాంబినేషన్ కోసం ఇషాన్‌ను తీసుకున్నామని చెప్పినప్పటికీ, ఆయన ప్రస్తుత ఫామ్ కీలక పాత్ర పోషించింది.
వరల్డ్ కప్ జట్టు ఎంపికలో శుభ్‌మన్ గిల్, జితేష్ శర్మలకు పెద్ద షాక్ తగిలింది. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో వైస్ కెప్టెన్‌గా ఉన్న గిల్, టి20 ఫార్మాట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం 32 పరుగులు మాత్రమే చేశారు. కటక్‌లో 4 పరుగులు, ముల్లన్‌పూర్‌లో డకౌట్, ధర్మశాలలో 28 బంతుల్లో 28 పరుగులు చేయడం ఆయన ఎంపికపై ప్రభావం చూపింది. గాయం కారణంగా చివరి రెండు మ్యాచ్‌లకు దూరమైన గిల్, నెమ్మదిగా ఆడటం, పేలవ ఫామ్ కారణంగా వరల్డ్ కప్ జట్టులో చోటు కోల్పోయాడు.
మరోవైపు, వికెట్ కీపర్ జితేష్ శర్మ సౌతాఫ్రికా సిరీస్‌లో జట్టులో ఉన్నప్పటికీ, వరల్డ్ కప్ కోసం ఆయన్ను పక్కనపెట్టారు. కిషన్ సూపర్ ఫామ్ కారణంగా జితేష్ తన స్థానాన్ని కోల్పోవలసి వచ్చింది.
2022 నుండి 2024 మధ్య కాలంలో టీమిండియాలో రెగ్యులర్ ఫినిషర్‌గా ఉన్న రింకూ సింగ్, ఇటీవల కాలంలో మల్టీ స్కిల్డ్ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అవకాశాలు కోల్పోయాడు. అయితే, వరల్డ్ కప్ వంటి పెద్ద టోర్నీలో ఒక స్పెషలిస్ట్ ఫినిషర్ అవసరాన్ని గుర్తించిన సెలెక్టర్లు, రింకూ సింగ్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. సౌతాఫ్రికా సిరీస్ సమయంలోనే జట్టుకు ఫినిషర్ కొరత కనిపించడంతో రింకూ ఎంపిక ఖరారైంది.
టీ20 వరల్డ్ కప్ భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనుంది. ఫిబ్రవరి 7న టోర్నీ ప్రారంభం కానుండగా, మార్చి 20న ఫైనల్ జరగనుంది. భారత్ గ్రూప్ ఏ లో ఉంది. ఈ గ్రూప్‌లో పాకిస్థాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ జట్లు కూడా ఉన్నాయి.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.