
భారత క్రికెట్‌లో ఒక సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. 2026 టీ20 ప్రపంచ కప్ కోసం శనివారం బీసీసీఐ (BCCI) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. అయితే, ఈ ప్రకటనలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఎంపిక కాకపోవడం. ఇటీవలి కాలంలో టీ20 ఫార్మాట్‌లో భారత వైస్ కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ, భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో గిల్ తన స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు.
గిల్ స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. గిల్ ను అవుట్ చేయడం వెనుక ఉన్న కారణాలు, సెలెక్టర్ల వ్యూహం, ఇషాన్, సంజూల ఎంపికకు గల పూర్తి వివరాలను గమనిస్తే..
శుభ్‌మన్ గిల్‌ను జట్టు నుండి మినహాయించడానికి ప్రధాన కారణం అతని ప్రస్తుత ఫామ్, జట్టు కూర్పు అని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. జట్టు ఎంపిక అనంతరం మీడియాతో మాట్లాడిన అగార్కర్, గిల్ ప్రస్తుతం పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడని, అతని ఇటీవలి గణాంకాలు ఆశించిన స్థాయిలో లేవని పేర్కొన్నారు.
అగార్కర్ మాట్లాడుతూ, "కేవలం 15 మందిని మాత్రమే ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు, ఎవరో ఒకరు మిస్ అవ్వక తప్పదు. గిల్ నాణ్యమైన ఆటగాడే అయినప్పటికీ, జట్టు అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని వివరించారు.
మరోవైపు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ నిర్ణయం కేవలం ఫామ్ గురించి మాత్రమే కాదని, జట్టు స్ట్రక్చర్ గురించి అని తెలిపారు. టాప్ ఆర్డర్‌లో వికెట్ కీపర్ ఆప్షన్ ఉండాలనీ, లోయర్ ఆర్డర్‌లో రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్ వంటి ఫినిషర్లకు చోటు కల్పించడం వల్ల గిల్‌కు స్థానం దక్కలేదని ఆయన పేర్కొన్నాడు.
శుభ్‌మన్ గిల్ వన్డే, టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో మాత్రం నిలకడలేమితో సతమతమవుతున్నాడు. 2024లో టీ20ల్లో గిల్ సగటు 26.8, స్ట్రైక్ రేట్ 151.6గా ఉంది. కానీ, 2025లో అతని ప్రదర్శన గణనీయంగా పడిపోయింది. 2025లో అతని సగటు కేవలం 15 కాగా, స్ట్రైక్ రేట్ 126.5కి పడిపోయింది. అంతేకాకుండా, 2025లో గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోవడం గమనార్హం.
గిల్ చివరి 13 టీ20 ఇన్నింగ్స్‌ల స్కోర్లు 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2) గా ఉన్నాయి. ఈ గణాంకాలు గిల్ ఫామ్ లేమిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున పరుగులు చేసినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో ఆ ప్రదర్శనను పునరావృతం చేయడంలో అతను విఫలమయ్యాడు. దీనికి తోడు, ఇటీవల అతనికి కాలి గాయం అయినట్లు వచ్చిన వార్తలు కూడా ఎంపికపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
ఈసారి సెలెక్టర్లు ఇద్దరు వికెట్ కీపర్, ఓపెనర్ల వ్యూహంతో ముందుకెళ్లారు. దీనివల్ల ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌లకు ద్వారాలు తెరుచుకున్నాయి.
సంజు శాంసన్ టాప్ ఆర్డర్‌లో వేగంగా ఆడటంతో పాటు వికెట్ కీపింగ్ చేయగల సామర్థ్యం అతని సొంతం. పవర్ ప్లేలో, మిడిల్ ఓవర్లలో దూకుడుగా ఆడగలడని, ముఖ్యంగా స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోగలడని సెలెక్టర్లు భావించారు.
ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో తిరిగి జట్టులోకి వచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌ను విజేతగా నిలపడమే కాకుండా, అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కడం అతనికి ప్లస్ అయ్యింది. ఎడమచేతి వాటం బ్యాటర్‌గా ఓపెనింగ్‌లో ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టగల సామర్థ్యం ఇషాన్‌కు ఉందని అగార్కర్ తెలిపారు.
ఈ వరల్డ్ కప్ కోసం టీమిండియా మేనేజ్‌మెంట్ టాప్ ఆర్డర్ ఫ్లెక్సిబిలిటీకి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఓపెనర్లుగా వచ్చే వారే వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడితే, తుది జట్టులో ఒక అదనపు బౌలర్ లేదా ఆల్ రౌండర్‌ను తీసుకునే వెసులుబాటు ఉంటుంది. గిల్ కేవలం బ్యాటర్ మాత్రమే కావడంతో, అతని ఎంపిక వల్ల బౌలింగ్ లోతు తగ్గే అవకాశం ఉంది.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్, టాప్ ఆర్డర్‌లో కీపర్లను, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో రింకూ సింగ్ వంటి పవర్ హిట్టర్లను కోరుకుంది. 15 మంది సభ్యుల జట్టులో కేవలం బ్యాటింగ్ కోసం ఒక టాప్ ఆర్డర్ ప్లేయర్‌ను తీసుకువెళ్లడం కష్టమని సెలెక్టర్లు భావించారు. గత టీ20 వరల్డ్ కప్‌లో కూడా కాంబినేషన్ల కారణంగానే గిల్ చోటు కోల్పోయారని, ఇది అతని ప్రతిభపై నమ్మకం లేకపోవడం కాదని అగార్కర్ గుర్తు చేశారు.
శుభ్‌మన్ గిల్ కు జట్టులో చోటు కల్పించకపోవడమనేది మూడు ప్రధాన అంశాల కలయికగా కనిపిస్తోంది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఇటీవలి పేలవమైన ఫామ్, తక్కువ స్ట్రైక్ రేట్ ఒక కారణం. జట్టుకు అవసరమైన వికెట్ కీపర్ ఓపెనర్ పాత్రకు సరిపోకపోవడం, ఇషాన్ కిషన్ సంజూ శాంసన్‌ల అద్భుతమైన ఫామ్ గిల్ కు షాకిచ్చాయి.
సెలెక్టర్లు దీర్ఘకాలిక సామర్థ్యం కంటే, రాబోయే హోమ్ వరల్డ్ కప్ కోసం తక్షణ ఫామ్, వ్యూహాత్మక అవసరాలకే పెద్దపీట వేశారు. గిల్ క్లాస్ ప్లేయర్ అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాకు ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ల దూకుడే కావాలని బీసీసీఐ నిర్ణయించింది.