
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ తన రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ పోరుపై భారీ అంచనాలు ఉన్నాయి. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ, అందరి దృష్టి ఇప్పుడు ఒక యంగ్ ప్లేయర్ పైనే ఉంది. అతడే తెలుగు తేజం తిలక్ వర్మ. ముంబై మిడిల్ ఆర్డర్‌లో వెన్నెముకలా మారిన తిలక్, గత కొన్ని సీజన్లుగా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. అయితే, ఈ స్థాయికి చేరుకోవడానికి అతను దాటి వచ్చిన కష్టాలు, ఎదుర్కొన్న అనారోగ్యం వివరాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
23 ఏళ్ల తిలక్ వర్మ 2022 ఐపీఎల్ అరంగేట్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ ఆ మెరుపుల వెనుక ఒక భయంకరమైన చీకటి ఉంది. ఇటీవల బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, తను అనుభవించిన నరకాన్ని తిలక్ వివరించాడు. అతనికి రాబ్డోమియోలిసిస్ అనే అరుదైన, ప్రమాదకరమైన వ్యాధి సోకింది. ఈ పరిస్థితిలో శరీరంలోని కండరాలు వేగంగా విచ్ఛిన్నమై, మయోగ్లోబిన్ అనే హానికరమైన పదార్థాన్ని రక్తంలోకి విడుదల చేస్తాయి. దీనివల్ల తీవ్రమైన కండరాల నొప్పి, బలహీనత కలగడమే కాకుండా, కిడ్నీలు పూర్తిగా దెబ్బతిని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది.
తనకు ఆ వ్యాధి రావడానికి గల కారణాన్ని తిలక్ నిజాయితీగా అంగీకరించాడు. "నేను టెస్ట్ టీమ్‌లో చోటు దక్కించుకోవాలని చాలా కష్టపడేవాడిని. దేశవాళీ క్రికెట్ ఆడుతూనే, రెస్ట్ తీసుకునే రోజుల్లో కూడా జిమ్‌లో తీవ్రంగా వర్కౌట్లు చేసేవాడిని. ప్రపంచంలోనే అత్యంత ఫిట్‌గా ఉండే ప్లేయర్ కావాలని కలలు కనేవాడిని. నా శరీరం తట్టుకోలేనంతగా ఒత్తిడికి గురిచేశాను. కేవలం ఐస్ బాత్ తీసుకుని నిద్రపోతే రికవరీ అయిపోతుందని భావించాను, కానీ అది సరిపోదని అప్పుడు తెలియదు" అని తిలక్ అన్నారు.
2022 చివరలో ఇండియా-ఏ తరఫున బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నప్పుడు ఈ సమస్య ముదిరింది. ఒక మ్యాచ్‌లో 101 బంతుల్లో 33 పరుగులు చేసిన తర్వాత, తిలక్ చేతులు పూర్తిగా బిగుసుకుపోయాయి. కనీసం వేళ్లు కూడా కదిలించలేని స్థితికి చేరుకున్నాడు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, అతని చేతికి ఉన్న గ్లౌజులను కత్తెరతో కోసి తీయాల్సి వచ్చింది. ఆ సమయంలో ముంబై ఇండియన్స్ యజమాని ఆకాష్ అంబానీ వెంటనే స్పందించి, బీసీసీఐ అధికారులతో మాట్లాడారు. తిలక్‌ను యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.
వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం, చికిత్స అందడం మరికొన్ని గంటలు ఆలస్యమైతే తిలక్ ప్రాణాలు దక్కేవి కావు. అతని కండరాలు ఎంత గట్టిగా బిగుసుకుపోయాయంటే, ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు సూదులు కూడా విరిగిపోయాయట. దాదాపు నెల రోజుల పాటు తిలక్ కదలలేని స్థితిలో బెడ్‌కే పరిమితమయ్యాడు. ఆ సమయంలో అతని తల్లి అతనికి అన్నం తినిపించాల్సి వచ్చింది. "ఆ వయసులో అది చాలా భయంకరమైన అనుభవం. నేను మళ్లీ క్రికెట్ ఆడతానో లేదో అని కాదు, కనీసం బతికితే చాలు అని దేవుడిని ప్రార్థించాను" అని తిలక్ ఆ క్షణాలను గుర్తు చేసుకున్నాడు.
సకాలంలో చికిత్స అందడంతో తిలక్ కోలుకున్నాడు. ఆ తర్వాత 2023 ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 46 బంతుల్లో 84 పరుగులు చేసి అద్భుతమైన రీఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి తిలక్ వెనక్కి తిరిగి చూడలేదు. 2025 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై 69 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అలాగే భారత్ గెలిచిన టీ20 వరల్డ్ కప్ 2026లోనూ కీలక పాత్ర పోషించాడు. నేడు ఐపీఎల్ 2026లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 5 ఏళ్ల టైటిల్ కరవును తీర్చుకోవాలంటే తిలక్ వర్మ ఫామ్ అత్యంత కీలకం కానుంది. మరి హైదరాబాద్ స్టార్ ఏం చేస్తాడో చూడాలి మరి.