T20 World Cup 2026 Final : సూర్య భాయ్ స్కెచ్ రెడీ.. కివీస్‌పై భారత్ గెలిచే ఛాన్స్ ఎంత?

Published : Mar 08, 2026, 11:08 AM IST

India vs New Zealand : అహ్మదాబాద్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. గత రికార్డులు, ప్లేయర్స్ ఫామ్ పరిశీలిస్తే టీమిండియా హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

PREV
15
T20 వరల్డ్ కప్ ఫైనల్: కివీస్‌తో భారత్ అమీతుమీ.. సూర్యసేన చరిత్ర సృష్టిస్తుందా?

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల్ పోరుకు సమయం ఆసన్నమైంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు మరోసారి విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్, ఈ టోర్నీలో అజేయంగా దూసుకుపోతూ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన జోరులో ఉన్న టీమ్ ఇండియా, కివీస్‌ను ఓడించి మూడోసారి ట్రోఫీని ముద్దాడాలని చూస్తోంది.

25
నాకౌట్ పోరులో భారత్ రికార్డులు

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో నాకౌట్ (సెమీఫైనల్, ఫైనల్) మ్యాచ్‌లలో భారత జట్టు రికార్డు అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 8 నౌకౌట్ మ్యాచ్‌లలో భారత్ 5 సార్లు విజయం సాధించగా, కేవలం 3 సార్లు మాత్రమే ఓటమిని చవిచూసింది. 2007లో తొలిసారి జరిగిన వరల్డ్ కప్‌లో సెమీస్, ఫైనల్ గెలిచి భారత్ విజేతగా నిలిచింది. 2014లో సెమీస్‌లో గెలిచినా, ఫైనల్‌లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. 2016, 2022 సెమీఫైనల్స్‌లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, 2024లో అద్భుత పునరాగమనం చేస్తూ సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను, ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి కప్‌ను గెలుచుకుంది. ఇప్పుడు 2026లో కూడా సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై భారీ విజయం సాధించి అదే ఆత్మవిశ్వాసంతో ఫైనల్ బరిలోకి దిగుతోంది.

35
భారత్ vs న్యూజిలాండ్ హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి?

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్‌పై భారత్‌కు ఇప్పటివరకు విజయం దక్కకపోవడం గమనార్హం. ఈ టోర్నీలో ఇరుజట్లు మూడుసార్లు తలపడగా, మూడింటిలోనూ కివీస్ జట్టునే విజయం వరించింది. అయితే, ఓవరాల్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల రికార్డులను పరిశీలిస్తే భారత్ పైచేయి సాధించింది. ఇప్పటివరకు జరిగిన 30 టీ20 మ్యాచ్‌లలో భారత్ 18 సార్లు గెలవగా, న్యూజిలాండ్ 11 సార్లు విజయం సాధించింది, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. అన్ని ఫార్మాట్లలో కలిపి ఐసీసీ టోర్నమెంట్‌లలో అత్యధిక విజయాలు సాధించిన జట్లలో భారత్ (121 విజయాలు) రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా (122 విజయాలు) అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆస్ట్రేలియా రికార్డును సమం చేసే అవకాశం భారత్‌కు ఉంది.

45
IND vs NZ : కీలక ఆటగాళ్లు.. ఫామ్ అంశాలు ఇవే

ప్రస్తుత టోర్నీలో భారత ఓపెనర్ సంజూ శాంసన్ విధ్వంసకర ఫామ్‌లో ఉన్నాడు. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 87 పరుగులు, అంతకుముందు వెస్టిండీస్‌పై 97 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా కివీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో శాంసన్ కీలకం కానున్నాడు. మరోవైపు న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాపై కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. గతంలో ఇక్కడ జరిగిన 6 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో 4 సార్లు 185 కంటే ఎక్కువ పరుగులు నమోదయ్యాయి. లక్ష మందికి పైగా ప్రేక్షకుల సపోర్టు భారత్‌కు అదనపు బలం కానుంది.

55
IND vs NZ ఫైనల్ ఫైట్.. తుది జట్లు ఇవే

భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్ (కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కోల్ మెక్కాన్చీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లోకీ ఫెర్గూసన్.

Read more Photos on
click me!

Recommended Stories