IND vs ENG : టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. గత రెండు ఎడిషన్ల రికార్డులు, ఇరు జట్ల బలాబలాలు ఏమిటి? ఈ బిగ్ ఫైట్ లో గెలిచేది ఎవరు?
టీ20 వరల్డ్ కప్ 2026: ఇంగ్లాండ్‌పై రివెంజ్ తీర్చుకుంటుందా? భారత్ సెమీస్ లెక్కలివే!
టీ20 ప్రపంచకప్ 2026 ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన కీలక పోరులో టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మార్చి 5న ముంబైలోని చరిత్రాత్మక వాంఖడే స్టేడియంలో భారత్ తన సెమీఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో తలపడనుంది.
26
ఆరోసారి సెమీఫైనల్‌కు టీమ్ ఇండియా
టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఆరోసారి సెమీఫైనల్‌కు చేరుకుని రికార్డు సృష్టించింది. గత మూడు ఎడిషన్లలో (2022, 2024, 2026) వరుసగా భారత్ సెమీస్ చేరడం విశేషం. ఇది భారత జట్టు స్థిరత్వానికి నిదర్శనం. గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై సాధించిన విజయం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడు అందరి దృష్టి ముంబైలో జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌పైనే ఉంది.
36
హ్యాట్రిక్ సెమీఫైనల్ పోరు
భారత్, ఇంగ్లాండ్ జట్లు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో తలపడటం ఇది వరుసగా మూడోసారి. 2022, 2024 ఎడిషన్లలో కూడా ఈ రెండు జట్లే సెమీఫైనల్‌లో తలపడ్డాయి. ఇప్పుడు 2026లో కూడా ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. ఒకే ప్రత్యర్థితో వరుసగా మూడు సెమీఫైనల్స్ ఆడటం ప్రపంచకప్ చరిత్రలో ఒక అరుదైన అంశంగా మారింది. ఈ రెండు జట్ల మధ్య రికార్డులు కూడా సమానంగా ఉన్నాయి.
2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో అడిలైడ్ లో భారత్, ఇంగ్లాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ మొదట బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 16 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 170 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించారు. ఆ తర్వాత ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి ఇంగ్లాండ్ ఛాంపియన్‌గా నిలిచింది.
56
2024 సెమీఫైనల్: భారత్ ప్రతీకారం
గత ఎడిషన్ (2024)లో భారత్ తన పాత ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. జార్జ్‌టౌన్‌లో జరిగిన సెమీఫైనల్‌లో భారత్ 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు ముప్పతిప్పలు పెట్టారు. దీంతో ఇంగ్లాండ్ కేవలం 103 పరుగులకే కుప్పకూలి 68 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఆ విజయోత్సాహంతో ఫైనల్ చేరిన టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికాను ఓడించి రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది.
66
ఛాంపియన్ సెంటిమెంట్ పునరావృతమవుతుందా?
గత రెండు సెమీఫైనల్స్ ఫలితాలను గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్‌లో ఏ జట్టు గెలిస్తే, ఆ జట్టే ఆ ఏడాది వరల్డ్ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2022లో ఇంగ్లాండ్ గెలిచి కప్పు కొట్టింది, 2024లో భారత్ గెలిచి ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పటివరకు భారత్ (2007, 2024), ఇంగ్లాండ్ (2010, 2022) చెరో రెండుసార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. మార్చి 5న ముంబైలో గెలిచే జట్టు మూడో టైటిల్ దిశగా అడుగులు వేస్తుందో లేదో చూడాలి.