
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమ్ ఇండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది. ఇషాన్ కిషన్ (77) వీరోచిత బ్యాటింగ్, బౌలర్ల అందరూ రాణించడంతో భారత్ దాయాదిని మట్టికరిపించింది. హై-వోల్టేజ్ ఒత్తిడిలోనూ పక్కా ప్రణాళికతో ఆడిన సూర్య సేన, మరోసారి పాక్‌పై తమ ఆధిపత్యాన్ని చాటుతూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ముందు భారత్ భారీ టార్గెట్ ఉంచింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, భారత్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. అయితే, మిడిల్ ఓవర్లలో పాక్ స్పిన్నర్లు పుంజుకోవడంతో భారత్ 200 పరుగుల మైలురాయిని అందుకోలేకపోయింది.
భారత ఇన్నింగ్స్ ఆరంభం ఆశించిన రీతిలో జరగలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ (0) మరోసారి నిరాశపరిచారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన సల్మాన్ ఆఘా బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిదికి క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగారు. అయితే, మరో ఎండ్ నుంచి ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. షాహీన్ అఫ్రిది వేసిన రెండో ఓవర్‌లో ఒక సిక్స్, ఒక ఫోర్ బాది జోరు పెంచారు. పవర్ ప్లే ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ఇందులో కిషన్ వాటానే 42 పరుగులు కావడం విశేషం. కేవలం 27 బంతుల్లోనే కిషన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నారు. తిలక్ వర్మ (25) నెమ్మదిగా ఆడుతూ కిషన్‌కు సహకరించారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
భారత్ భారీ స్కోరు దిశగా సాగుతున్న వేళ, సైమ్ అయూబ్ పాకిస్థాన్‌ను రేసులోకి తెచ్చారు. ప్రమాదకరంగా మారుతున్న ఇషాన్ కిషన్‌ను (77 పరుగులు, 40 బంతులు, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌కు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత 15వ ఓవర్‌లో సైమ్ అయూబ్ వరుస బంతుల్లో తిలక్ వర్మ (25), హార్దిక్ పాండ్యా (0)లను అవుట్ చేసి హ్యాట్రిక్ అవకాశాన్ని సృష్టించారు.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32) చివర వరకు క్రీజులో ఉండటానికి ప్రయత్నించినా ఉస్మాన్ తారిక్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. చివరి ఓవర్లలో శివం దూబే (27), రింకూ సింగ్ (11*) మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా రింకూ చివరి ఓవర్‌లో ఒక భారీ సిక్సర్ బాదగా, అక్షర్ పటేల్ చివరి బంతికి అవుట్ అయ్యారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ 3 వికెట్లు పడగొట్టగా, ఉస్మాన్ తారిక్ పొదుపుగా బౌలింగ్ చేసి కీలక వికెట్ తీశారు.
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు భారత బౌలర్లు ఆదిలోనే చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే హార్దిక్ పాండ్యా తన పదునైన బౌలింగ్‌తో సాహిబ్‌జాదా ఫర్హాన్ (0)ను రింకూ సింగ్ చేతికి చిక్కేలా చేసి డకౌట్ చేశారు. వెంటనే రెండో ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా తన మార్క్ డెలివరీతో ప్రమాదకరమైన సైమ్ అయూబ్ (6)ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి పాక్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు.
కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా (4) సైతం బుమ్రా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (5) ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేయడంతో పాక్ పతనం వేగవంతమైంది. ఉస్మాన్ ఖాన్ (44) కాసేపు ప్రతిఘటించినా, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ అద్భుత స్టంపింగ్‌తో అతడిని పెవిలియన్‌కు పంపారు. భారత బౌలర్ల ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ ముందు పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బుమ్రా, అక్షర్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యాలు తలా రెండు వికెట్లు తీసుకున్నారు.
చివరకు పాకిస్థాన్ 114 (18 ఓవర్లు) పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. గ్రూప్ ఏ లో భారత్ 6 పాయింట్లతో టాప్ లో నిలిచింది. అలాగే, సూపర్ 8కు అర్హత సాధించింది.