IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్‌తో జరుగుతున్న హై వోల్టేజీ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 27 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసి భారత్‌కు భారీ స్కోరు దిశగా బాటలు వేశాడు. పాక్ బౌలర్లను దంచికొట్టాడు.
IND vs PAK : ఇషాన్ దార్ బ్యాటింగ్.. పాకిస్థాన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్ కిషన్
శ్రీలంకలోని కొలంబోలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-A మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, పాక్ బౌలర్ల అంచనాలను తలకిందులు చేస్తూ భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే బాదుడు మొదలుపెట్టాడు. తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
25
తొలి ఓవర్‌లోనే షాక్.. అభిషేక్ శర్మ డకౌట్
ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే సల్మాన్ ఆఘా బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిదికి క్యాచ్ ఇచ్చి అబిషేక్ పెవిలియన్ చేరాడు. ఎదుర్కొన్న 4 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ అయ్యాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో అభిషేక్ సున్నాకే పరిమితం కావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. కేవలం 1 పరుగు వద్దే భారత్ తొలి వికెట్ కోల్పోవడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
35
ఇషాన్ మెరుపు దాడి.. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
తొలి వికెట్ త్వరగా పడినా ఇషాన్ కిషన్ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతూనే పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. షాహీన్ అఫ్రిది వేసిన ఓవర్‌లో ఒక సిక్సర్, ఒక ఫోర్ బాది 15 పరుగులు పిండుకున్నాడు. అనంతరం అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
తొలి వికెట్ కోల్పోయినప్పటికీ, ఇషాన్ కిషన్ దూకుడు కారణంగా భారత్ పవర్ ప్లే ముగిసే సమయానికి 52/1 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇషాన్ కిషన్‌కు తోడుగా తిలక్ వర్మ కూడా సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 40 బంతుల్లోనే 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా ఇషాన్ స్ట్రైక్ రేట్ 197.14గా ఉండటం అతని ఇన్నింగ్స్ తీవ్రతను తెలియజేస్తోంది.
55
స్పిన్నర్లను ఉతికి ఆరేసిన కిషన్
పాకిస్థాన్ స్పిన్నర్లు అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ వేసిన ఓవర్లలో ఇషాన్ మరింత ప్రమాదకరంగా మారాడు. అబ్రార్ వేసిన ఫుల్ లెంగ్త్ బంతులను నేరుగా బౌలర్ తల మీదుగా ఫోర్లు కొట్టి తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నాడు. షాదాబ్ ఖాన్ వేసిన మొదటి 4 బంతుల్లోనే 14 పరుగులు వచ్చాయి. ప్రస్తుతానికి భారత్ 8.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 77 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ (10*), సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.