India vs South Africa : కటక్ లో టీమిండియా అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్మురేపుతూ సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది. బౌలర్ల దెబ్బతో 74 పరుగులకే ఆలౌట్ అయింది. బ్యాటింగ్ లో హార్దిక్ పాండ్యా రీఎంట్రీ కూడా అదిరిపోయింది.
74 పరుగులకే ఆలౌట్.. ఇండియా బౌలింగ్ దాటికి వణికిపోయిన దక్షిణాఫ్రికా !
బారాబతి స్టేడియంలో జరిగిన తొలి టీ20 పోరులో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. బ్యాటింగ్‌లో హార్దిక్ పాండ్యా విధ్వంసం సృష్టిస్తే, బౌలింగ్‌లో భారత బౌలర్లు కలిసికట్టుగా రాణించి దక్షిణాఫ్రికా వెన్ను విరిచారు. ఫలితంగా పర్యాటక జట్టు కేవలం 74 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసి సిరీస్‌లో శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పలు రికార్డులను తిరగరాయడం విశేషం.
26
హార్దిక్ పాండ్యా: ఆపద్బాంధవుడి ఇన్నింగ్స్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభం అంత గొప్పగా లభించలేదు. టాపార్డర్ విఫలమైన వేళ, క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. క్లిష్టమైన పిచ్‌పై సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా (రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్ తర్వాత) హార్దిక్ నిలిచాడు. జితేష్ శర్మ (10*), శివమ్ దూబే (11) అందించిన సహకారంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగుల పోరాడే స్కోరును సాధించింది.
36
అర్ష్‌దీప్ సింగ్ సూపర్ స్పెల్
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ గట్టి షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే డేంజరస్ బ్యాటర్ క్వింటన్ డికాక్‌ను డకౌట్‌గా పెవిలియన్ పంపి భారత్‌కు డ్రీమ్ స్టార్ట్ అందించాడు. తన స్వింగ్ బౌలింగ్‌తో సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన అర్ష్‌దీప్, తన కోటాలో కేవలం 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతని ధాటికి సఫారీలు పవర్ ప్లేలోనే ఒత్తిడిలో పడ్డారు.
పేసర్లు వేసిన బాటలో స్పిన్నర్లు కూడా చెలరేగిపోయారు. వరుణ్ చక్రవర్తి (3-1-19-2), అక్షర్ పటేల్ (2-0-7-2) తమ స్పిన్ మాయాజాలంతో దక్షిణాఫ్రికా మిడిలార్డర్‌ను చిత్తు చేశారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి వేసిన గూగ్లీలకు మార్కో యాన్సెన్, ఫెర్రీరా వంటి హిట్టర్లు సమాధానం చెప్పలేకపోయారు. అక్షర్ పటేల్ తన కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో ఐడెన్ మార్క్రామ్ (14), నోర్జే వికెట్లను తీసి సఫారీ పతనాన్ని శాసించాడు.
56
జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడం ద్వారా, అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ (టెస్టులు, వన్డేలు, టీ20లు) 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది బౌలర్ల జాబితాలో (మలింగ, సౌథీ, షాకిబ్, షాహీన్ ఆఫ్రిది) బుమ్రా చేరాడు. బుమ్రా 3 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
66
చరిత్రలో నిలిచిపోయే విజయం
భారత బౌలర్ల దాటికి దక్షిణాఫ్రికా కేవలం 12.3 ఓవర్లలోనే 74 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీ20 క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ప్రతి భారత బౌలర్ వికెట్ తీయడం ఈ మ్యాచ్ ప్రత్యేకత. చివరి వికెట్‌ను శివమ్ దూబే పడగొట్టడంతో భారత్ 101 పరుగుల రికార్డు విజయాన్ని అందుకుంది. వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు ఇంతటి పటిష్టమైన ప్రదర్శన చేయడం అభిమానుల్లో కొత్త జోష్ నింపింది.