
స్పిన్‌కు సహకరించిన పిచ్ మీద అజేయ హాఫ్ సెంచరీతో తనపై విమర్శలు చేసిన భారత ప్లేయర్లకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావూమా. కష్టాల్లో కూరుకుపోయిన సౌతాఫ్రికా జట్టును ఒంటరిగా ముందుగా లాగుతూ.. భారత బౌలర్లను చిత్తు చేస్తూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మరుగుజ్జు అంటే మటాష్ చేసి చూపించాడు టెంబా బావూమా !
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత జట్టు ఊహించని రీతిలో కుప్పకూలింది. కేవలం 124 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితుల్లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే ఆలౌట్ అయింది. స్పిన్‌కు సహకరించిన పిచ్‌పై భారత బ్యాటర్లు లైన్, లెంగ్త్ మీద కంట్రోల్ కోల్పోవడంతో సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత 15 ఏళ్లలో భారత్ మైదానంలో సఫారీ జట్టుకు ఇది తొలి టెస్ట్ విజయం కావడం విశేషం.
ప్రారంభం నుంచే ఒత్తిడిలో పడిన టీమిండియా, యశస్వి జైస్వాల్ డకౌట్ అయిన క్షణం నుండి మళ్లీ నిలబడలేకపోయింది. కేఎల్ రాహుల్ కూడా ఒకే పరుగు చేసి వెనుదిరగడంతో జట్టుకు బిగ్ షాక్ తగిలింది. జురెల్ (13), రిషభ్ పంత్ (2) త్వరగా ఔటవగా, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ కూడా ప్రభావం చూపలేకపోయింది.
సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ మొత్తం మ్యాచ్‌లో ఎనిమిది కీలక వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్‌ను శాసించాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడు. అతని స్పిన్ సవాలుకు భారత బ్యాటర్లు సమాధానం కనుగొనలేకపోయారు.
అతనికి తోడు మార్కో జెన్సెన్, కేశవ్ మహారాజ్ చెరో రెండు వికెట్లు తీసి భారత్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టారు. భారత తరఫున వాషింగ్టన్ సుందర్ (31), అక్షర్ పటేల్ (26), రవీంద్ర జడేజా (18) కొంతవరకు పోరాడినా, జట్టును గెలుపు దిశగా నడిపేంతగా ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లలేదు.
సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా ఆచితూచి ఆడి 55 పరుగులతో అజేయంగా నిలిచిన తన ఇన్నింగ్స్ తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. ఒక దశలో 75/6 వద్ద కష్టాల్లో ఉన్న తన జట్టును పదునైన డిఫెన్స్, స్థిరమైన ఆటతో ముందుకు నడిపాడు. అతని ఇన్నింగ్స్ వల్లే సౌతాఫ్రికా 153 పరుగులు చేసింది.
ఈ పిచ్‌లో బ్యాటింగ్ అసాధ్యం కాదని, సహనంతో ఆడితే అవకాశాలు ఉన్నాయని బవూమా నిరూపించాడు. అక్షర్ దూకుడుగా ఆడుతున్న సమయంలో అతని క్యాచ్‌ను మిడ్‌వికెట్ వద్ద పరిగెత్తుకుంటూ బవూమా అద్భుతంగా పట్టుకోవడం సౌతాఫ్రికా విజయంలో కీలకంగా మారింది.
మొదటి రోజు ఆటలో బుమ్రా డీఆర్‌ఎస్ చర్చ సందర్భంగా బవూమాను మరుగుజ్జు అంటూ కామెంట్ చేసిన ఘటన స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకిందికి రావచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.
అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత బుమ్రా బవూమాకు క్షమాపణలు చెప్పిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ మాట్లాడుకుని హ్యాండ్‌షేక్ చేసుకోవడంతో వివాదం ముగిసినట్టే భావించారు అభిమానులు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన టెంబా బవూమా, ఈ విజయం తన కెప్టెన్సీ కంటే జట్టు సమిష్టి కృషి ఫలితమని అన్నాడు. “పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. మా బౌలర్లు వరుసగా మమ్మల్ని ఆటలోకి తీసుకొచ్చారు. ఉదయం బోష్‌తో చేసిన భాగస్వామ్యం మా గెలుపుకు పునాది” అని వ్యాఖ్యానించాడు.
రబడా లేకుండానే సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్ అద్భుత ప్రదర్శన సౌతాఫ్రికా బౌలింగ్ దళాన్ని మరింత బలంగా చేసిందని ప్రశంసించాడు. తన పై విమర్శలు, బాడీ షేమింగ్ కామెంట్స్ చేసిన వారికి తన బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. బావూమా పై పంత్, బుమ్రా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. క్రికెట్ సర్కిల్ లో కొత్త చర్చకు దారితీశాయి. అయితే, బావూమా ఈ విషయాలను ప్రస్తావించకుండానే కూల్ గా ఉంటూ తన ఆటతో భారత్ కు షాకిచ్చాడు.