IND vs PAK : భారత్ దెబ్బకు వరల్డ్ కప్ నుండి పాకిస్థాన్ అవుట్.. చితక్కొట్టిన కుర్రాళ్లు!

Published : Feb 01, 2026, 09:56 PM IST

India beat Pakistan : అండర్-19 వరల్డ్ కప్ 2026 సూపర్-6 పోరులో పాకిస్థాన్‌పై 58 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్ దెబ్బతో పాకిస్తాన్ టోర్నీ నుంచి అవుట్ అయింది.

PREV
16
IND vs PAK : పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. సెమీస్‌కు యంగ్ ఇండియా గ్రాండ్ ఎంట్రీ !

భారత్ పాకిస్తాన్ ను చిత్తు చేసింది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో ఆదివారం జరిగిన హై-వోల్టేజ్ పోరులో భారత అండర్-19 జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 58 పరుగుల తేడాతో ఓడించి, ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌కు టీమ్ ఇండియా ఘనంగా చేరుకుంది. ఈ ఓటమితో పాకిస్థాన్ టోర్నీ నుంచి అవుట్ అయింది. భారత్ తన అజేయమైన జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

26
పాకిస్థాన్ వ్యూహాత్మక తప్పిదం

ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 252 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, సెమీఫైనల్ రేసులో నిలవాలంటే పాకిస్థాన్ ఈ లక్ష్యాన్ని 33.3 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంది. కానీ, పాక్ బ్యాటర్లు ఆ లక్ష్యం వైపు కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకుని సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, వారు కేవలం భారత్‌ను ఓడించడమే లక్ష్యంగా ఆడి చివరకు అందులోనూ విఫలమయ్యారు. పాక్ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

36
పోరాడిన భారత్.. నిలబడ్డ వేదాంత్

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (30) వేగంగా ఆడినా, ఆయుష్ మాత్రే సున్నాకే వెనుదిరిగాడు. ఆరోన్ జార్జ్ కూడా త్వరగానే అవుట్ కావడంతో భారత్ 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వేదాంత్ త్రివేది (68) అత్యంత ఓపికగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. పిచ్ నెమ్మదిగా ఉండటంతో పరుగులు తీయడం కష్టమైనా, విహాన్ మల్హోత్రా (21)తో కలిసి 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

46
మెరిసిన కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్

చివరి ఓవర్లలో కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్ మెరుపులు మెరిపించారు. వీరిద్దరూ కేవలం 31 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి భారత్ స్కోరును 250 దాటించారు. కనిష్క్ 29 బంతుల్లో 35 పరుగులు చేయగా, ఖిలాన్ 15 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులు చేయగలిగింది. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3 వికెట్లతో రాణించాడు.

56
భారత్ బౌలింగ్ దెబ్బకు కుప్పకూలిన పాక్ బ్యాటింగ్

253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. భారత బౌలర్లు ఖిలాన్ పటేల్, ఆయుష్ మాత్రే తలో మూడు వికెట్లు తీసి పాక్ నడ్డి విరిచారు. కనిష్క్ చౌహాన్ బ్యాటింగ్‌తోనే కాకుండా బౌలింగ్‌లోనూ ఒక వికెట్ తీసి పాక్ ను దెబ్బకొట్టాడు. పాకిస్థాన్ చివరకు 194 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 58 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.

66
అజేయంగా సెమీఫైనల్‌కు భారత్

ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. అమెరికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, జింబాబ్వే, ఇప్పుడు పాకిస్థాన్‌పై వరుస విజయాలతో టీమ్ ఇండియా జోరు మీదుంది. ఫిబ్రవరి 4న బులవాయోలోనే జరిగే సెమీఫైనల్‌లో భారత్, అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కూడా ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. యువ భారత్ ఇదే ఫామ్ కొనసాగిస్తే మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడటం ఖాయంగా కనిపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories