IND vs PAK : పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన కుర్రాళ్లు ! భారత్ సూపర్ విక్టరీ

Published : Dec 14, 2025, 08:27 PM IST

Ind vs Pak U19: అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆరోన్ జార్జ్ బ్యాటింగ్, కనిష్క్ చౌహాన్ ఆల్‌రౌండ్ షోతో భారత్ అదరగొట్టింది.

PREV
16
పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా... 5 ఏళ్ల తర్వాత ప్రతీకారం!

పాకిస్తాన్ ను భారత్ చిత్తుగా ఓడించింది. దుబాయ్ లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్ 2025లో భారత యువ జట్టు సత్తా చాటింది. ఆదివారం దుబాయ్ ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.

గ్రూప్-ఏ లో జరిగిన ఈ మ్యాచ్ నంబర్-5లో భారత్ 90 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ పాకిస్థాన్ ముందు 241 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ జట్టు కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో అండర్-19 ఆసియా కప్‌లో 5 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌ను ఓడించిన రికార్డును భారత్ సొంతం చేసుకుంది.

26
భారత బౌలర్ల ఆధిపత్యం.. పాకిస్థాన్ ఇన్నింగ్స్ పతనం

241 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు ఆరంభం నుంచే తడబడింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో పాక్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా భారత పేసర్ దీపేశ్ దేవేంద్రన్ పాక్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. జట్టు స్కోరు 21 పరుగుల వద్ద ఓపెనర్ సమీర్ మిన్హాస్ (9 పరుగులు)ను దీపేశ్ పెవిలియన్‌కు పంపాడు.

ఆ తర్వాత వెంటనే అలీ హసన్ బలూచ్‌ను ఖాతా తెరవకుండానే అవుట్ చేశాడు. అహ్మద్ హుస్సేన్ (4 పరుగులు) కూడా దీపేశ్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో పాకిస్థాన్ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించిన మరో ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ (16 పరుగులు)ను కనిష్క్ చౌహాన్ అవుట్ చేయడంతో భారత్‌కు నాలుగో వికెట్ దక్కింది.

36
కనిష్క్ చౌహాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన

ఈ మ్యాచ్‌లో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది ఆల్‌రౌండర్ కనిష్క్ చౌహాన్. బ్యాటింగ్‌లో 46 పరుగులతో రాణించడమే కాకుండా, బౌలింగ్‌లోనూ మూడు కీలక వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. పాక్ మిడిల్ ఆర్డర్‌లో అబ్దుల్ సుభాన్ (6 పరుగులు), హుఫైజా అహ్సాన్‌లను అవుట్ చేసి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు.

పాకిస్థాన్ తరఫున హుఫైజా అహ్సాన్ ఒక్కడే పోరాడాడు. అతను 83 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. అయితే అతనికి మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు. చివర్లో మహ్మద్ సయ్యామ్ (2 పరుగులు), అలీ రజా (6 పరుగులు)లను కిషన్ కుమార్ సింగ్ అవుట్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ 41.2 ఓవర్లలో 150 పరుగుల వద్ద ముగిసింది. భారత్ తరఫున దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

46
టీమిండియా బ్యాటింగ్: ఆరోన్ జార్జ్ అద్భుత ఇన్నింగ్స్

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వైభవ్ సూర్యవంశీ (5 పరుగులు) వికెట్ కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన వైభవ్ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అయితే ఆయుష్ మ్హాత్రే, ఆరోన్ జార్జ్ రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

ఆయుష్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత విహాన్ మల్హోత్రా (12), వేదాంత్ త్రివేది (7) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. 113 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుండు (22 పరుగులు) ఐదో వికెట్‌కు 60 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆరోన్ జార్జ్ 88 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 85 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

56
చివర్లో మెరిసిన కనిష్క్

ఆరోన్ జార్జ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కనిష్క్ చౌహాన్ భారత స్కోరును గౌరవప్రదమైన స్థితికి తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నాడు. అతను దూకుడుగా ఆడుతూ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. దీనివల్ల భారత్ 240 పరుగుల మార్కును అందుకోగలిగింది. చివర్లో ఖిలాన్ పటేల్ (6), హెనిల్ పటేల్ (12), దీపేశ్ (1) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ సయ్యామ్ అత్యధికంగా 3 వికెట్లు తీసుకోగా, అబ్దుల్ సుభాన్, నకాబ్ షఫీక్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

66
గ్రూప్ లో టాప్ లో భారత్

ఈ విజయంతో గ్రూప్-ఎలో భారత్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. తన తొలి మ్యాచ్‌లో యూఏఈని 234 పరుగుల తేడాతో ఓడించిన భారత్, ఇప్పుడు పాక్‌పై కూడా భారీ విజయం సాధించింది. మరోవైపు పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో మలేషియాను 297 పరుగుల తేడాతో ఓడించి భారత్ చేతిలో ఓడిపోయింది.

ఇప్పుడు భారత్ తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో డిసెంబర్ 16న మలేషియాతో తలపడనుంది. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్థాన్, యూఏఈ, మలేషియా పోటీపడుతుండగా.. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ ఉన్నాయి. రెండు గ్రూపుల నుంచి టాప్-2 జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 21న జరగనుంది.

Read more Photos on
click me!

Recommended Stories