IND vs NZ : సిరీస్ పాయే.. టీమిండియాను ముంచింది ఈ ఐదుగురే !

Published : Jan 19, 2026, 03:05 PM IST

India vs New Zealand : న్యూజిలాండ్ చేతిలో భారత్ తొలిసారి వన్డే సిరీస్ ఓడిపోయింది. రోహిత్, జడేజా సహా ఈ 5 గురు ఆటగాళ్ల పేలవ ప్రదర్శనే దీనికి ప్రధాన కారణం. వారి గణాంకాలు, వైఫల్యాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
IND vs NZ: భారత్ ఓటమికి కారణమైన ఐదుగురు ఆటగాళ్లు.. వీరి ఫ్లాప్ షో వల్లే సిరీస్ కోల్పోయిన టీమిండియా

భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు అద్భుత ప్రదర్శనతో కొత్త చరిత్రను లిఖించింది. భారత గడ్డపై టీమిండియాను ఓడించి, తొలిసారిగా ఇక్కడ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. సొంతగడ్డపై ఎంతో బలంగా ఉండే భారత జట్టుకు ఇది ఊహించని షాక్ అని చెప్పాలి.

ఈ చారిత్రాత్మక విజయంతో కివీస్ జట్టు సంబరాలు చేసుకుంటుండగా, భారత జట్టు మాత్రం తన వైఫల్యాలను సరిచూసుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ సిరీస్‌లో టీమిండియా ఓటమికి ఐదుగురు కీలక ఆటగాళ్ల వైఫల్యమే ప్రధాన కారణమని గణాంకాలు చెబుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఈ స్టార్ ప్లేయర్లు అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ సిరీస్ విజయానికి పరోక్షంగా కారణమైన ఆ ఐదుగురు భారత ఆటగాళ్లు ఎవరంటే?

26
1. రోహిత్ శర్మ - కేవలం 61 పరుగులు

సీనియర్ ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌కు ముందు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతని నుండి అభిమానులు, జట్టు భారీ స్కోర్లను ఆశించారు. అయితే, ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ ప్రదర్శన అత్యంత పేలవంగా సాగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అతను ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు.

అంతేకాకుండా, మూడు మ్యాచ్‌లలోనూ భారత్ కోల్పోయిన మొదటి వికెట్ రోహిత్ శర్మదే కావడం గమనార్హం. ఓపెనర్‌గా జట్టుకు శుభారంభం ఇవ్వాల్సిన బాధ్యతను ఆయన నెరవేర్చలేకపోయాడు. ఈ మొత్తం సిరీస్‌లో రోహిత్ చేసిన పరుగులు కేవలం 61 మాత్రమే. ఇందులో అతని అత్యధిక స్కోరు 26 పరుగులు. ఈ మూడు ఇన్నింగ్స్‌లలో అతని బ్యాట్ నుండి కేవలం 9 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే వచ్చాయి. సీనియర్ ఆటగాడి వైఫల్యం జట్టు స్కోరుపై తీవ్ర ప్రభావం చూపింది.

36
2. రవీంద్ర జడేజా - 43 పరుగులు, 0 వికెట్లు

ఈ సిరీస్ ఓటమికి టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను అతిపెద్ద కారణంగా భావించవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ కీలక పాత్ర పోషించాల్సిన జడేజా, ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లో ఆదుకుంటాడని భావించినా, అతను 3 ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 43 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

మరోవైపు బౌలింగ్‌లోనూ అతని ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదు. సిరీస్ మొత్తం బౌలింగ్ చేసినా, ఒక్క మ్యాచ్‌లో కూడా జడేజాకు కనీసం ఒక వికెట్ కూడా దక్కలేదు. స్పిన్ ఆల్ రౌండర్‌గా జట్టులో ఉన్న జడేజా, అటు పరుగుల పరంగానూ, ఇటు వికెట్ల పరంగానూ జట్టుకు ఎలాంటి సహకారం అందించలేకపోవడంతో భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

46
3. కుల్దీప్ యాదవ్ - కేవలం 3 వికెట్లు

భారత బౌలింగ్ విభాగంలో ఎక్స్-ఫ్యాక్టర్ గా పరిగణించే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఈ సిరీస్‌లో ప్రభావం చూపలేకపోయాడు. 3 మ్యాచ్‌లలో కలిపి 25 ఓవర్లు వేసిన కుల్దీప్, బౌలర్లందరిలో అత్యధికంగా 182 పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్ల వేటలో వెనుకబడిన కుల్దీప్ ఖాతాలో పడింది కేవలం 3 వికెట్లు మాత్రమే.

ముఖ్యంగా న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా, అతనిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. కుల్దీప్ ఈ సిరీస్‌లో ఏకంగా 60.66 సగటుతో పరుగులు ఇచ్చాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాల్సిన ప్రధాన స్పిన్నర్ ఇలా ధారాళంగా పరుగులు ఇవ్వడం జట్టు ఓటమికి మరో ప్రధాన కారణమైంది.

56
4. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ - 135 పరుగులు

కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ మీద ఈ సిరీస్‌లో అదనపు బాధ్యత ఉంది. అయితే, అతను కూడా జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. సిరీస్ మొత్తంలో గిల్ రెండు హాఫ్ సెంచరీలు సాధించినప్పటికీ, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి అతను 135 పరుగులు మాత్రమే చేశాడు.

మొదటి రెండు వన్డేల్లో అతను మంచి ఆరంభాలను పొందాడు. కానీ, క్రీజులో కుదురుకున్నాక వికెట్ పారేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అతని అత్యధిక స్కోరు 56 పరుగులు. ఏ ఒక్క సందర్భంలోనూ తనకు లభించిన మంచి స్టార్ట్‌ను మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌గా లేదా భారీ సెంచరీగా మార్చలేకపోయాడు. కెప్టెన్సీ ఒత్తిడి అతని బ్యాటింగ్ మీద ప్రభావం చూపిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

66
5. శ్రేయస్ అయ్యర్ - 60 పరుగులు

మిడిల్ ఆర్డర్‌లో వెన్నెముకగా భావించే శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన కూడా నిరాశపరిచింది. నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్ చేసే అయ్యర్ నుండి జట్టు ఎప్పుడూ ఒక భరోసాతో కూడిన ఇన్నింగ్స్‌ను ఆశిస్తుంది. తొలి మ్యాచ్‌లో 49 పరుగులు చేసి పర్వాలేదనిపించినా, ఆ తర్వాత అతను పూర్తిగా చతికిలపడ్డాడు.

మిగిలిన రెండు మ్యాచ్‌లలో కలిపి శ్రేయస్ అయ్యర్ కేవలం 11 పరుగులు మాత్రమే జోడించగలిగాడు. మొత్తం సిరీస్‌లో అతని స్కోరు 60 పరుగులు మాత్రమే. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం, క్రీజులో నిలదొక్కుకోలేకపోవడం వల్ల మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. జట్టుకు అత్యంత అవసరమైన స్థానంలో ఆడుతున్న అయ్యర్ విఫలమవడం టీమిండియాకు పెద్ద దెబ్బగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories