
IND vs NZ 2nd T20: రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ విధ్వంసం రేపాడు. స్వదేశంలో టీమిండియా ఆడుతున్న 100వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఇది కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌ల విధ్వంసకర బ్యాటింగ్‌తో ధీటుగా ముందుకు సాగింది.
రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులో కలిసిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ కలిసి మైదానంలో పరుగుల వరద పారించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు కేవలం 48 బంతుల్లోనే 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కివీస్ బౌలర్లను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు.
ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తన బ్యాటింగ్ పవర్‌ను చూపించాడు. కేవలం 21 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తద్వారా న్యూజిలాండ్‌పై టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు అభిషేక్ శర్మ (22 బంతులు) పేరిట ఉండేది. బుధవారం జరిగిన తొలి టీ20లో అభిషేక్ ఈ ఘనత సాధించగా, ఇప్పుడు ఇషాన్ దానిని బ్రేక్ చేశాడు.
పవర్ ప్లే ముగిసే సమయానికి ఇషాన్ కిషన్ 23 బంతుల్లో 56 పరుగులతో నిలిచాడు. ఇది పవర్ ప్లేలో భారత బ్యాటర్ చేసిన రెండో అత్యధిక స్కోరు. ఇషాన్ మొత్తం 32 బంతుల్లో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 10వ ఓవర్లో ఈష్ సోధి బౌలింగ్‌లో మ్యాట్ హెన్రీకి క్యాచ్ ఇచ్చి ఇషాన్ పెవిలియన్ చేరాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఓపెనర్లు డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్‌లు శుభారంభం అందించే ప్రయత్నం చేశారు. అయితే భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కివీస్‌ను కట్టడి చేశారు. డెవాన్ కాన్వే 9 బంతుల్లో 19 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఔటయ్యాడు. టిమ్ సీఫెర్ట్ 13 బంతుల్లో 24 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తికి చిక్కాడు. గ్లెన్ ఫిలిప్స్ (19)ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు.
మధ్య ఓవర్లలో కుల్దీప్ యాదవ్ రెండు కీలక వికెట్లు తీసి కివీస్ స్కోరు వేగాన్ని తగ్గించాడు. అయితే, చివర్లో కెప్టెన్ మిచెల్ శాంట్నర్, రచిన్ రవీంద్రలు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. రచిన్ రవీంద్ర 26 బంతుల్లో 44 పరుగులు చేయగా, శాంట్నర్ కేవలం 27 బంతుల్లో 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి దూకుడుతో న్యూజిలాండ్ స్కోరు 200 దాటింది. న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 208 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ మ్యాట్ హెన్రీ వేసిన తొలి ఓవర్లోనే నాలుగో బంతికి సిక్స్ కొట్టినప్పటికీ, తర్వాతి బంతికే రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సంజూ 5 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు.
అలాగే, గత మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. జాకబ్ డఫీ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే భారీ షాట్ ఆడబోయి డెవాన్ కాన్వేకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో అభిషేక్ ఖాతా తెరవకుండానే గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. దీంతో భారత్ స్వల్ప వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలోనే ఇషాన్ కిషన్, సూర్య కుమార్ అద్భుతమైన నాక్ లు ఆడారు.