IND vs NZ : వన్డేల్లో కొట్టారు.. టీ20ల్లో తగ్గేదేలే ! న్యూజిలాండ్ పై ప్రతీకారానికి భారత్ రెడీ !

Published : Jan 20, 2026, 11:42 PM IST

IND vs NZ T20 : భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ బుధవారం నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్‌కు ముందు జరుగుతున్న ఈ సిరీస్ లైవ్ స్ట్రీమింగ్, జట్ల ప్లేయర్లు, పూర్తి షెడ్యూల్ వివరాలు మీకోసం.

PREV
16
IND vs NZ: టీ20 ప్రపంచ కప్‌కు ముందు టీమిండియాకు అసలైన పరీక్ష

వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమిని పక్కనపెట్టి, టీ20 ఫార్మాట్‌లో సత్తా చాటేందుకు టీమిండియా సిద్ధమైంది. బుధవారం (జనవరి 21) నాగ్‌పూర్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కివీస్ జట్టు ఇటీవలే భారత్‌లో చరిత్రాత్మక వన్డే సిరీస్ (2-1) విజయాన్ని నమోదు చేసి, రెట్టింపు ఉత్సాహంతో పొట్టి ఫార్మాట్‌లోకి అడుగుపెడుతోంది.

మరోవైపు, ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు.. ఇరు జట్లకు ఇదే చివరి సన్నాహక సిరీస్ కావడం విశేషం. ప్రపంచ కప్‌కు కేవలం మూడు వారాల సమయం మాత్రమే ఉండటంతో, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్‌కు ఈ సిరీస్ ఒక డ్రెస్ రిహార్సల్ లాంటిది.

26
IND vs NZ T20: మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్ బుధవారం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టాస్ రాత్రి 6:30 గంటలకు వేస్తారు.

అభిమానులు ఈ మ్యాచ్‌ను టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానల్స్‌లో వీక్షించవచ్చు. డిజిటల్ మీడియాలో చూడాలనుకునే వారికి జియో హాట్‌స్టార్ (JioHotstar) యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌లూ ఇదే ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం కానున్నాయి.

36
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా

2024లో టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ 72 శాతానికి పైగా విజయాలు సాధించింది. అయితే, కెప్టెన్‌గా సక్సెస్ అవుతున్నా, బ్యాటర్‌గా సూర్య ఫామ్ కాస్త ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ కప్‌కు ముందు తన బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించడానికి సూర్యకు ఇదొక మంచి అవకాశం.

ఈ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో కొన్ని మార్పులు జరిగాయి. పొత్తికడుపు శస్త్రచికిత్స కారణంగా యువ బ్యాటర్ తిలక్ వర్మ మొదటి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతనికి కవర్‌గా శ్రేయస్ అయ్యర్‌ను బీసీసీఐ జట్టులోకి తీసుకచ్చింది. టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించగా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన ఇషాన్ కిషన్, రింకూ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చారు. వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా తప్పుకోగా, రవి బిష్ణోయ్ అతని స్థానాన్ని భర్తీ చేశాడు.

46
కివీస్ దళం సిద్దం.. మరింత బలంగా బౌలింగ్ విభాగం

భారత గడ్డపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలిచిన న్యూజిలాండ్, అదే ఊపును టీ20ల్లోనూ కొనసాగించాలని చూస్తోంది. మిచెల్ శాంట్నర్ నాయకత్వంలోని కివీస్ జట్టులో సీనియర్ బౌలర్లు మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ తిరిగి చేరారు. గత ఏడాది కివీస్ తరఫున అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచిన డఫీ రాకతో వారి బౌలింగ్ బలం పెరిగింది.

ఆల్ రౌండర్లు రచిన్ రవీంద్ర, జిమ్మీ నీషమ్ కూడా జట్టులోకి వచ్చారు. అయితే, కీలక ఆటగాడు మైఖేల్ బ్రేస్‌వెల్ గాయంతో బాధపడుతుండటంతో, వన్డేల్లో ఆకట్టుకున్న క్రిస్టియన్ క్లార్క్‌ను మొదటి మూడు టీ20లకు జట్టుతో పాటే ఉంచారు.

56
IND vs NZ T20 సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇదే

ఈ సిరీస్ జనవరి 21 నుండి జనవరి 31 వరకు జరుగుతుంది. పూర్తి షెడ్యూల్ వివరాలు గమనిస్తే..

1. మొదటి టీ20: జనవరి 21 (బుధవారం) - నాగ్‌పూర్, రాత్రి 7 గంటలకు.

2. రెండవ టీ20: జనవరి 23 (శుక్రవారం) - రాయ్‌పూర్, రాత్రి 7 గంటలకు.

3. మూడవ టీ20: జనవరి 25 (ఆదివారం) - గౌహతి, రాత్రి 7 గంటలకు.

4. నాలుగవ టీ20: జనవరి 28 (బుధవారం) - విశాఖపట్నం, రాత్రి 7 గంటలకు.

5. ఐదవ టీ20: జనవరి 31 (శనివారం) - తిరువనంతపురం, రాత్రి 7 గంటలకు.

66
IND vs NZ T20 సిరీస్ లో ఇరు జట్ల రికార్డులు ఎలా ఉన్నాయి?

టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ఇప్పటివరకు 25 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 12 సార్లు గెలవగా, న్యూజిలాండ్ 10 సార్లు విజయం సాధించింది. మూడు మ్యాచ్‌లు టైగా ముగిశాయి. 2023లో భారత్‌లో జరిగిన చివరి సిరీస్‌ను టీమ్ ఇండియా 2-1తో గెలుచుకుంది.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా.

న్యూజిలాండ్ జట్టు: మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ రాబిన్సన్, జిమ్మీ నీషమ్, ఇష్ సోధీ, జాక్ ఫౌల్క్స్, మార్క్ చాప్‌మన్, మైఖేల్ బ్రేస్‌వెల్, రచిన్ రవీంద్ర, కైల్ జేమిసన్, మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ, క్రిస్టియన్ క్లార్.

Read more Photos on
click me!

Recommended Stories