పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐదు ప్రధాన డిమాండ్లను ఐసీసీ ముందు ఉంచగా.. వాటిలో కొన్నింటికి మాత్రమే సానుకూల స్పందన లభించింది. ముఖ్యంగా భారత్‌తో సంబంధం ఉన్న డిమాండ్లను ఐసీసీ తోసిపుచ్చింది.
1. బంగ్లాదేశ్‌కు ఆర్థిక జరిమానా వద్దు: టీ20 ప్రపంచకప్‌లో పాల్గొననందున బంగ్లాదేశ్‌కు జరిమానా విధించవద్దని, వారి రెవెన్యూ వాటాను పూర్తిగా చెల్లించాలని పీసీబీ కోరింది. దీనికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఎలాంటి పెనాల్టీ ఉండదని, ఇది తమ మునుపటి నిర్ణయమేనని ఐసీసీ స్పష్టం చేసింది.
2. బంగ్లాదేశ్‌కు పరిహారంగా మరో ఈవెంట్: వచ్చే సైకిల్‌లో బంగ్లాదేశ్‌కు అదనపు ఐసీసీ ఈవెంట్ కేటాయించాలని పీసీబీ డిమాండ్ చేసింది. వచ్చే సైకిల్‌లో అండర్-19 ప్రపంచకప్ నిర్వహణ బాధ్యతను బంగ్లాదేశ్‌కు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది.
3. భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్: భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగేలా ఐసీసీ చొరవ తీసుకోవాలని పీసీబీ గట్టిగా కోరింది. ఈ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. ద్వైపాక్షిక సిరీస్‌లు తమ పరిధిలోకి రావని, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్‌లో కూడా తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
4. ట్రై సిరీస్ : భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య ట్రై-సిరీస్ నిర్వహించాలని పీసీబీ ప్రతిపాదించింది. తమ అధికార పరిధిలో ఈ అంశం లేదని పేర్కొంటూ ఐసీసీ ఈ ప్రతిపాదనను కూడా తిరస్కరించింది.
5. 2026లో బంగ్లాదేశ్‌లో భారత్ పర్యటన: 2026లో భారత్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించేలా ఐసీసీ హామీ ఇవ్వాలని పీసీబీ కోరింది. పర్యటనలు అనేవి రెండు బోర్డుల మధ్య జరిగే ద్వైపాక్షిక ఒప్పందాలని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని ఐసీసీ స్పష్టం చేసింది.