చెన్నై : 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. 2003 ప్రపంచ కప్ నుండి, ఆస్ట్రేలియా తమ ప్రారంభ మ్యాచ్‌లన్నింటిలో విజయం సాధించింది. ICC ODI క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఆదివారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో అత్యంత ప్రతిభకనబరిచిన టీమ్ ఇండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. రాహుల్ 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో వన్డే ప్రపంచ కప్‌లలో అంతకుముందు ఎమ్మెస్ ధోనీ పేరిట ఉన్న రికార్డును కేఎల్ రాహుల్ బద్దలు కొట్టాడు. ఎమ్మెస్ ధోని పేరిట ఉన్న 91 పరుగులు నాటౌట్ రికార్డును కేఎల్ రాహుల్ అధిగమించాడు.
అదే సమయంలో భారత వికెట్ కీపర్ చేసిన రెండవ అత్యధిక స్కోరుగానూ రికార్డ్ సాధించాడు. రాహుల్ ద్రవిడ్ 1999లో శ్రీలంకపై 145 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ద్వయం 4వ వికెట్ కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ నాలుగో వికెట్‌కు 165 పరుగులు నమోదు చేశారు, ఇది ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఓ వికెట్ పైనా సాధించిన అత్యధిక భాగస్వామ్యం. ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. అర్థశతకాన్ని దాటి దూసుకుపోయాడు. అలా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రపంచ కప్‌లో తన తొమ్మిదవ యాభై-ప్లస్ స్కోర్‌ను నమోదు చేశాడు.
ప్రపంచ కప్‌లో ఓ భారత ఆటగాడు చేసిన రెండవ అత్యధిక స్కోరు ఇది. రెండో స్థానాన్ని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో పంచుకున్నాడు. ప్రపంచకప్ లో 21 ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌లతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. వన్డేల్లో నాన్ ఓపెనర్‌గా బరిలోకి దిగి అత్యధికంగా యాభైకి పైగా స్కోర్లు చేసిన కుమార సంగక్కర (112) సంఖ్యను విరాట్ కోహ్లీ (113) అధిగమించాడు.
ఇక, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రపంచ కప్‌లో 1000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డును అధిగమించాడు. ప్రపంచ కప్‌లో అతి తక్కువ 20 ఇన్నింగ్స్‌లలో 1,000 పరుగులు పూర్తి చేసిన సచిన్ రికార్డును అధిగమించాడు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ 19 ఇన్నింగ్స్‌లలో 50 ప్రపంచకప్ వికెట్లు పూర్తి చేశాడు. ఇన్నింగ్స్‌లో వేగంగా 50 వికెట్లు పూర్తి చేసిన బౌలర్. శ్రీలంక ఆటగాడు లసిత్ మలింగ 25 ఇన్నింగ్స్‌లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు.