Harmanpreet Kaur: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బిగ్ షాక్ ఇచ్చారు. క్రికెట్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశారు. టీమ్ శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయమని సోషల్ మీడియాలో తెలిపారు.
భారత మహిళా క్రికెట్ జట్టు సుదీర్ఘకాల సారథి, 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఇలా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక సుదీర్ఘమైన, భావోద్వేగంతో కూడిన పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకోవడం తనకు ఎంతమాత్రం సులభం కాదని, ఏళ్లకు ఏళ్లు పెనవేసుకున్న జ్ఞాపకాలు, త్యాగాలు, భావోద్వేగాలు తనతోనే ఉండిపోతాయని పేర్కొన్నారు.
25
టీమ్ కోసం నా వ్యక్తిగత గేమ్‌ను త్యాగం చేశా
కెప్టెన్‌గా ఉన్న సమయంలో భారత క్రికెట్ కోసం తన సర్వస్వం ఇచ్చానని హర్మన్‌ప్రీత్ గుర్తుచేసుకున్నారు. "నేను ఈ టీమ్‌కి, భారత మహిళా క్రికెట్‌కు నా రక్తం, స్వేదం, సమయం ఇచ్చాను. చాలా సందర్భాల్లో నా వ్యక్తిగత రికార్డులను, నా ఆశయాలను, నా స్వంత గేమ్‌ను కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది" అని రాసుకొచ్చారు. జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని భావించి, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకున్నానని తెలిపారు. ఆ నిర్ణయాలు అందరికీ నచ్చకపోయినా, కొన్నింటికి వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించినా, జట్టును బలోపేతం చేయడానికే ప్రాధాన్యం ఇచ్చానని చెప్పారు.
35
బీసీసీఐ రివ్యూ మీటింగ్ తర్వాతే ఈ నిర్ణయం
గౌహతిలో జరిగిన బీసీసీఐ రివ్యూ మీటింగ్ తర్వాతే హర్మన్‌ప్రీత్ ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో హెడ్ కోచ్ అమోల్ మజుందార్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా టీమ్ ప్రదర్శనపై చర్చించిన అనంతరం ఈ మార్పు చోటుచేసుకుంది. 2016లో టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హర్మన్, 2022లో వన్డేలకు, 2023లో అన్ని ఫార్మాట్లకు పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యారు. దాదాపు దశాబ్ద కాలం పాటు భారత్‌ను ముందుండి నడిపించారు.
హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా అనేక అద్భుత విజయాలను సాధించింది. ఆమె నాయకత్వంలోనే గతేడాది నవంబర్‌లో భారత మహిళల జట్టు తన మొదటి వన్డే వరల్డ్ కప్‌ను ముద్దాడింది. అలాగే ఇటీవల ఆసియా గేమ్స్‌లో వరుసగా రెండోసారి టీ20 గోల్డ్ మెడల్ సాధించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. నంబర్ల పరంగా చూస్తే.. 155 టీ20ల్లో 92 విజయాలు, 51 వన్డేల్లో 30 విజయాలు, 5 టెస్టుల్లో 4 విజయాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిసి 9,000 పైగా పరుగులు చేశారు.
55
కెప్టెన్సీ ముగిసింది.. ఆట ఇంకా ఉంది
కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, భారత్ తరఫున ప్లేయర్‌గా కొనసాగుతానని హర్మన్ స్పష్టం చేశారు. "నా బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వహించానని భావిస్తున్నా. గుండె నిండా భావోద్వేగాలు ఉన్నా, మనసులో మాత్రం ఎంతో ప్రశాంతత ఉంది. ఇప్పుడు ఈ జట్టులో మంచి టాలెంట్, నెగ్గాలనే నమ్మకం ఉన్నాయి. ఇకపై ఎలాంటి ప్రెజర్ లేకుండా కేవలం క్రికెట్‌పై ఉన్న ప్రేమ కోసమే మళ్లీ బ్యాట్ పడతా. కెప్టెన్సీ ముగిసింది కానీ నా జర్నీ ఇంకా ఉంది" అని ముగించారు. టీమ్‌మేట్స్, కోచ్‌లు, బీసీసీఐ, కుటుంబం, అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.