Hardik Pandya : టీ20 ప్రపంచకప్ 2026 విజయోత్సవాల్లో జాతీయ జెండాను అవమానించారంటూ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై పూణేలో కేసు నమోదైంది. ఈ స్టార్ ఆల్ రౌండర్ కు జైలు శిక్ష తప్పదా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారత క్రికెట్ జట్టు సాధించిన చరిత్రాత్మక టీ20 ప్రపంచకప్ 2026 విజయోత్సవాలు ఒక చట్టపరమైన చిక్కుల్లో పడ్డాయి. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. పాండ్యాపై జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో పూణేలో ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం జరిగిన వేడుకల్లో పాండ్యా ప్రవర్తన జాతీయ చిహ్నం గౌరవాన్ని తగ్గించేలా ఉందనేది ఫిర్యాదులో ఆరోపణలు చేశారు.
25
న్యాయపరమైన ఫిర్యాదు వివరాలు ఇవే
పూణేకు చెందిన అడ్వకేట్ వాజిద్ ఖాన్ బిద్కర్, శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదును సమర్పించారు. తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి మైదానంలో వేడుకలు జరుపుకుంటున్న సమయంలో పాండ్యా త్రివర్ణ పతాకానికి అగౌరవం కలిగించారని ఆయన పేర్కొన్నారు. జాతీయ జెండాను తన వీపుకు కట్టుకుని, పతాకాన్ని ధరించి మైదానంలో పడుకోవడం వంటి చర్యలు జాతీయ గౌరవానికి భంగం కలిగించాయని ఖాన్ ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "టీ20 ప్రపంచకప్ విజయానంతరం హార్దిక్ పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి వేడుకల్లో మునిగిపోయారు. ఆ సమయంలో ఆయన వీపుపై జాతీయ జెండా కట్టి ఉంది. 1971 నేషనల్ ఫ్లాగ్ యాక్ట్ సెక్షన్ 2 ప్రకారం, జాతీయ జెండా గౌరవాన్ని కాపాడాలి. కానీ పాండ్యా విజయ గర్వంలో జెండాను ధరించి ఆమెతో కలిసి స్టేజ్ మీద పడుకున్నారు. ఇది ముమ్మాటికీ జాతీయ జెండాను అవమానించడమే" అని పేర్కొన్నారు.
35
ఫిర్యాదు అంశం పై చర్చలు.. పోలీసుల స్పందన ఏమిటి?
ఫిర్యాదు దాఖలు చేసే సమయంలో అధికార పరిధికి సంబంధించిన చర్చ జరిగింది. ఈ ఘటన అహ్మదాబాద్‌లో జరిగింది కదా, పూణేలో ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారని పోలీసులు ప్రశ్నించారు. దీనిపై వాజిద్ ఖాన్ స్పందిస్తూ, "జాతీయ జెండా అనేది దేశం మొత్తానికి చిహ్నం. దేశంలో ఎక్కడ అపచారం జరిగినా ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు" అని సమాధానం ఇచ్చారు. శివాజీనగర్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి, కాపీని అందజేశారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.
న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో భారత్ విజయం సాధించిన తర్వాత సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అందులో హార్దిక్ పాండ్యా, మహికా శర్మతో కలిసి ట్రోఫీతో ఫోజులిస్తూ, డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఒక క్లిప్‌లో, వారిద్దరూ పోడియంపై కలిసి పడుకుని ఉండటం, ఆ సమయంలో పాండ్యా ఒంటిపై జాతీయ జెండా కప్పి ఉండటం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది కేవలం ఆనందంతో చేసిన పని అని సమర్థిస్తుంటే, మరికొందరు జాతీయ జెండా విషయంలో కనీస గౌరవం పాటించాలని విమర్శిస్తున్నారు.
55
శిక్షార్హమైన నేరం.. చట్టం ఏం చెబుతోంది?
ఈ ఫిర్యాదును ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, 1971 కింద దాఖలు చేశారు. ఈ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం.. ఎవరైనా బహిరంగంగా జాతీయ జెండాను తగులబెట్టడం, వికృతీకరించడం, తొక్కివేయడం లేదా ఇతరత్రా అగౌరవపరచడం వంటి పనులు చేస్తే అది నేరం. నేరం రుజువైతే జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి పోలీసులు ఈ వేడుకలకు సంబంధించిన వీడియో ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు లభిస్తే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా త్వరలోనే ఐపీఎల్ లో ఆడనున్నాడు. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ లోపు ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి.