Team India : టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మస్తు జోష్ లో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ను కూడా ఫిక్స్ చేశారు. దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో విజయం సాధించి, 2026 టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని భారత్ ముద్దాడింది. ఈ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, తన అసలు సవాలు ఇంకా ముందుందని ఆయన స్పష్టం చేశారు.
26
టీ20ల్లో 300 పరుగుల మార్కుపై కన్ను
వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న గంభీర్, టీమిండియా బ్యాటింగ్ లైనప్‌పై తన ఆకాంక్షను బయటపెట్టారు. "మేము ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇది ముగింపు కాదు, కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఇప్పటివరకు మేము టీ20ల్లో 300 పరుగుల మార్కును తాకలేదు. కానీ, ఏదో ఒక రోజు నా జట్టు ఆ ఘనతను కూడా సాధిస్తుంది" అని గంభీర్ ధీమా వ్యక్తం చేశారు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని ఈ జట్టు భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.
36
ప్రతికూలతలను అధిగమించి భారత్ విజయం
ఈ టోర్నీలో భారత జట్టు అనేక సవాళ్లను ఎదుర్కొంది. స్టార్ ప్లేయర్ హర్షిత్ రాణా టోర్నీ ప్రారంభానికి ముందే దూరమవ్వగా, అభిషేక్ శర్మ అనారోగ్యం బారిన పడ్డారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డారు. ఫీల్డింగ్‌లోనూ కొన్ని క్యాచ్‌లు చేజారాయి. అయినప్పటికీ, దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక్క మ్యాచ్ తప్ప మిగిలిన అన్నింట్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు సార్లు 250 కంటే ఎక్కువ స్కోరు చేసిన తొలి టీ20 జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
కోచ్ బాధ్యతలపై స్పందిస్తూ, మ్యాచ్ ఫలితాలు ఆటగాళ్ల ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటాయని గంభీర్ పేర్కొన్నారు. "ఒక కోచ్ లేదా కెప్టెన్ ఎంత గొప్పవారనేది వారి జట్టు ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. మైదానం వెలుపల మేము అత్యుత్తమ వాతావరణాన్ని కల్పించగలం, ఆటగాళ్లకు భద్రతా భావాన్ని ఇవ్వగలం, నైపుణ్యాలను పంచుకోగలం. కానీ మైదానంలోకి దిగాక అంతా ఆటగాళ్ల చేతుల్లోనే ఉంటుంది" అని ఆయన అన్నారు. గంభీర్ హయాంలో భారత్ ఇప్పటికే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడం విశేషం.
56
హై రిస్క్ - హై రివార్డ్.. గంభీర్ వ్యూహం
ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ తన వ్యూహాలను పంచుకున్నారు. జట్టు విజయం వెనుక హై రిస్క్ - హై రివార్డ్ ఆలోచనా విధానం ఉందని చెప్పారు. ఆటగాళ్లను కేవలం నమ్మకం మీద కాకుండా, వారిపై ఉన్న విశ్వాసం ఆధారంగానే ఎంపిక చేస్తానని స్పష్టం చేశారు. సోషల్ మీడియా అభిప్రాయాల కంటే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న 30 మంది ఆటగాళ్లే తనకు ముఖ్యం అని, వారికి మాత్రమే తాను జవాబుదారీ అని గంభీర్ కరాఖండిగా చెప్పారు.
66
గంభీర్ ముందున్న పెద్ద లక్ష్యం: 2027 వన్డే వరల్డ్ కప్
గౌతమ్ గంభీర్ వైట్ బాల్ క్రికెట్‌లో తిరుగులేని కోచ్‌గా అవతరించారు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లకు పూర్తి సపోర్టు ఇస్తూ, వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈ విజయంలో మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ సెక్రటరీ జై షా పాత్రలను ఆయన కొనియాడారు. గంభీర్ తదుపరి భారీ లక్ష్యం ఇప్పుడు 2027 వన్డే వరల్డ్ కప్ గెలవడమే. దాని కోసం ఎలాంటి మాస్టర్ ప్లాన్ లను సిద్ధం చేస్తారో చూడాలి మరి.