ENG vs NEP : బ్యాండ్ వాయించారు.. ఇంగ్లాండ్ గెలిచినా వాళ్లే హీరోలు

Published : Feb 08, 2026, 08:13 PM IST

ENG vs NEP : టీ20 వరల్డ్ కప్ 2026లో నేపాల్ సంచలనం సృష్టించినంత పని చేసింది. ఇంగ్లాండ్‌పై అద్భుత పోరాటం చేసిన నేపాల్ 4 పరుగుల తేడాతో ఓడినా కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో నేపాల్ బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.

PREV
16
ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. నేపాల్ వీరోచిత పోరాటం

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 పోరులో ఒక అద్భుతమైన సన్నివేశం చోటుచేసుకుంది. క్రికెట్ ప్రపంచంలో దిగ్గజ జట్టుగా పేరున్న ఇంగ్లాండ్‌ను పసికూన నేపాల్ గడగడలాడించింది. దాదాపు ఓటమి అంచు వరకు వెళ్ళిన ఇంగ్లాండ్, తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకుని 4 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

ఈ విజయంతో హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ మెగా టోర్నీలో తమ పాయింట్ల ఖాతాను తెరిచింది. అయితే మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచినప్పటికీ, తమ అద్భుత పోరాటంతో నేపాల్ జట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

26
ఇంగ్లాండ్ భారీ స్కోరు.. ఆఖర్లో విల్ జాక్స్ విధ్వంసం

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో జాకబ్ బెథెల్ కీలక పాత్ర పోషించారు. జాకబ్ కేవలం 35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేశారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ సైతం బాధ్యతాయుతంగా ఆడి 32 బంతుల్లో 53 పరుగులు (4 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించారు.

ఇంగ్లాండ్ ఒక దశలో తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందని భావించినా, ఆఖరి 3 ఓవర్లలో విల్ జాక్స్ ఊచకోత కోశారు. విల్ జాక్స్ 18 బంతుల్లో 39 పరుగులు చేయడంతో, చివరి 18 బంతుల్లో ఇంగ్లాండ్ ఏకంగా 45 పరుగులు రాబట్టింది. నేపాల్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ, చివరి ఓవర్లలో అనుభవం లేమి వల్ల భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

36
లక్ష్య చేధనలో నేపాల్ వీరోచిత పోరాటం

185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ ఏమాత్రం తలవంచలేదు. ఓపెనర్ కుశాల్ భుర్తెల్ 17 బంతుల్లో 29 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ పౌడెల్ 34 బంతుల్లో 39 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆల్ రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరీ 29 బంతుల్లో 44 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు సవాల్ విసిరారు. ఒకానొక దశలో నేపాల్ విజయం ఖాయమనిపించింది. కీలక వికెట్లు పడినా, నేపాల్ బ్యాటర్లు ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పోరాడటం గమనార్హం.

46
లోకేష్ బమ్ బాంబు లాంటి ఇన్నింగ్స్

ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు లోకేష్ బమ్. నంబర్ 6లో బ్యాటింగ్‌కు వచ్చి, ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను సైతం వణికించారు. లోకేష్ కేవలం 20 బంతుల్లో 39 పరుగులు చేసి మ్యాచ్‌ను నేపాల్ వైపు తిప్పారు. 25 ఏళ్ల ఈ యువ ఆటగాడు గతంలో పోలీస్ ఫోర్స్ క్లబ్ తరపున ఆడాడు.

2022లో టీ20ల్లోకి అడుగుపెట్టిన లోకేష్, పేలవ ప్రదర్శనతో జట్టుకు దూరమయ్యారు. కానీ 2024 చివరలో మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చి, నేరుగా ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ వంటి జట్లకు చుక్కలు చూపించారు. ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడాడు. సగటు 13.33 మాత్రమే అయినప్పటికీ, ఈ మ్యాచ్‌లో లోకేష్ ఆడిన తీరు అమోఘమని చెప్పాలి.

56
ఆఖరి ఓవర్ డ్రామా.. ఆదుకున్న సామ్ కరన్

మ్యాచ్ చివరి ఓవర్‌కు చేరేసరికి నేపాల్ విజయానికి కేవలం 10 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. వాంఖడే స్టేడియంలో ఉత్కంఠ నెలకొంది. ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ఒత్తిడిలో పదేపదే మీటింగ్లు పెట్టుకోవడం కనిపించింది. అయితే, అనుభవజ్ఞుడైన సామ్ కరన్ అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లాండ్‌ను గట్టెక్కించారు.

ఆ ఆఖరి ఓవర్లో సామ్ కరన్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి నేపాల్ విజయాన్ని అడ్డుకున్నారు. జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ వంటి బౌలర్లు పరుగులు ధారాళంగా ఇచ్చిన చోట, సామ్ కరన్ తన 4 ఓవర్ల కోటాలో 27 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసి జట్టును గెలిపించాడు.

66
నేపాల్‌పై ప్రశంసల జల్లు

నేపాల్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. కేవలం 4 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, వారి పోరాట పటిమను చూసి క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ఐదు సార్లు మీటింగ్లు పెట్టి ప్లాన్ మార్చుకునేలా ఇంగ్లాండ్‌ను నేపాల్ ఒత్తిడిలోకి నెట్టడం చిన్న విషయం కాదు.

టీ20 వరల్డ్ కప్ 2026లో ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్‌లలో ఇది అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌గా నిలిచింది. పసికూన జట్లు పెద్ద జట్లకు సవాల్ విసురుతుండటంతో, ఈసారి వరల్డ్ కప్‌లో మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories