కామన్వెల్త్ గేమ్స్‌ 2022లో 40 దాటిన టీమిండియా మెడల్స్... అయినా దానికి చాలా దూరంగా...

First Published | Aug 7, 2022, 9:44 AM IST

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఆశించిన దాని కంటే మంచి ప్రదర్శనే కనబరుస్తోంది. బర్మింగ్‌హమ్‌లో 9వ రోజు ముగిసే సమయానికి భారత్ ఖాతాలో 40 పతకాలు చేరాయి. ఇందులో 13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్య పతకాలు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత జట్టు, నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ కంటే నాలుగు స్వర్ణాలు వెనకబడి ఉంది...

Image credit: PTI

టేబుల్ టెన్నిస్‌లో మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్ ఈవెంట్లలో అలాగే మహిళల క్రికెట్‌లో, పురుషుల హాకీలో భారత జట్టు ఫైనల్స్‌ చేరింది. అలాగే నలుగురు భారత బాక్సర్లు ఫైనల్ చేరారు. అమిత్ పంగల్, నిఖత్ జరీన్, నీతూ గన్‌గాస్, సాగర్ అహ్లవత్ ఫైనల్‌కి భారత్‌కి మరో నాలుగు పతకాలు ఖాయం చేశారు...

బ్యాడ్మింటన్‌లోనూ భారత జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్స్‌కి అర్హత సాధించారు. అలాగే మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు సెమీస్ చేరగా పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రెడ్డి, చిరాగ్ శెట్టి... అలాగే మహిళల డబుల్స్‌లో త్రిష జాలీ, గాయాత్రి గోపిచంద్ సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లారు...

Latest Videos


అథ్లెటిక్స్‌లో హిమా దాస్ మహిళల 4X400 టీమ్‌ కూడా సెమీస్‌లో తలబడనుంది. ఓవరాల్‌గా భారత్, కామన్వెల్త్ గేమ్స్ 2022లో 50 నుంచి 60 పతకాల వరకూ అందుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే గత ఏడిషన్‌తో పోలిస్తే ఇది పేలవ ప్రదర్శనే...

Image credit: Getty

గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2018లో భారత జట్టు 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్య పతకాలతో టాప్ 3 పొజిషన్‌లో నిలిచింది. ఆస్ట్రేలియా 198, ఇంగ్లాండ్ 136 తర్వాత ఎక్కువ పతకాలు గెలిచిన జట్టుగా టాప్ 3లో నిలిచింది టీమిండియా...
 

2018 కామన్వెల్త్ గేమ్స్‌లో కెనడా 82 పతకాలు గెలిచినా భారత జట్టు కంటే 11 స్వర్ణాలు తక్కువగా గెలవడంతో టాప్ 4కి పరిమితమైంది. అయితే ఈసారి 9వ రోజు ముగిసే సమయానికి కెనడాతో పోలిస్తే భారత స్వర్ణాల సంఖ్య తక్కువగా ఉంది. మిగిలిన ఈవెంట్లలో భారత అథ్లెట్లు పసిడి పంట పండిస్తేనే కెనడాని వెనక్కి నెట్టే అవకాశం ఉంటుంది...

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జట్టుకి ఎక్కువ పతకాలు దక్కే ఈవెంట్ షూటింగ్. 2018 కామన్వెల్త్‌లో భారత షూటర్లు 7 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్య పతకాలతో మొత్తంగా 16 పతకాలు అందించారు. అయితే ఈసారి బర్మింగ్‌హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో షూటింగ్‌కి స్థానం దక్కలేదు. ఈ ప్రభావం టీమిండియాపై గట్టిగా పడింది...
 

ఈసారి లాన్ బౌల్స్‌తో పాటు లాంగ్ జంప్, హై జంప్, రేస్ వాక్, స్టీపుల్‌‌ఛేజ్ వంటి ఈవెంట్లలో తొలిసారి పతకాలు సాధించి... భారత్ పరువు కాపాడారు అథ్లెట్లు. లేకపోతే భారత్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. 

click me!