చేతేశ్వర్ పుజారా ఇంట్లో విషాదం

Published : Nov 26, 2025, 07:55 PM IST

Cheteshwar Pujara brother in law: టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ చేతేశ్వర్ పుజారా బావమరిది జీత్ పబారి రాజ్‌కోట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది క్రితం నమోదైన కేసు నేపథ్యంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

PREV
13
పుజారా బావమరిది ఆత్మహత్య

టీమిండియా మాజీ క్రికెటర్ చేతేశ్వర్ పుజారా ఇంట్లో విషాదం నెలకొంది. పుజారా భార్య పూజా పబారి సోదరుడు జీత్ రసిక్‌భాయ్ పబారి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం రాజ్‌కోట్‌లోని తన నివాసంలో ఉరేసుకుని మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఆ పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాలవీయనగర్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సూసైడ్ నోట్ లభించకపోవడంతో మరణానికి గల నిర్దిష్ట కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

23
2024లో నమోదైన అత్యాచారం కేసు… మానసిక ఒత్తిడే కారణమా?

జీత్ పబారి ఆత్మహత్యకు ముందు ఆయనపై దాఖలైన ఒక సీరియస్ కేసు నేపథ్యంలో పోలీసులు విచారణను ప్రారంభించారు. 2024 నవంబర్ 26న జీత్ పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి అతడిపై అత్యాచార ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. నిశ్చితార్థం తర్వాత జీత్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, అనంతరం అకస్మాత్తుగా సంబంధాన్ని తెంచుకుని మరొక యువతిని పెళ్లి చేసుకున్నాడని ఆమె ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. 

కేసు నమోదు అయిన తర్వాత జీత్ తీవ్ర ఒత్తిడితో ఉంటున్నాడని, గత కొన్ని నెలలుగా డిప్రెషన్ లక్షణాలు కనిపించాయని కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. ఫిర్యాదు నమోదైన తేదీ, ఆత్మహత్య జరిగిన తేదీ రెండూ ఒకటే కావడం గమనార్హం.

33
ఆత్మహత్య సమయంలో కామెంట్రీలో పుజారా

జీత్ పబారి కుటుంబం జంజోధ్‌పూర్‌కు చెందినది. సుమారు రెండు దశాబ్దాల క్రితం వారు రాజ్‌కోట్‌కు మారి పత్తి జిన్నింగ్ వ్యాపారం ప్రారంభించారు. 

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పుజారా భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టులో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు. మ్యాచ్‌పై వ్యాఖ్యానం చేస్తున్న సమయంలోనే ఆయన బావమరిది మరణించిన వార్త తెలిసింది. పబారి మరణానికి ఖచ్చితమైన కారణం తెలుసుకునేందుకు పోలీసులు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories